logo

మోదీతోనే భారత్‌కు గుర్తింపు

ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్‌కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Updated : 19 Apr 2024 06:40 IST

కామారెడ్డి భాజపా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి పట్టణం, న్యూస్‌టుడే : ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్‌కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి పట్టణంలో ఎంపీ రాములు, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటరమణారెడ్డి మాట్లాడారు. భాజపా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పనిచేస్తుందని రాష్ట్రంలోనూ అనేక కేంద్ర సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయన్నారు. ప్రతి గ్రామంలో జరిగే అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ భాజపాకు ఓటు వేసి మరోమారు మోదీకి మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ పట్టణంలో నిర్వహించిన బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలోనూ మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌ భాజపా ఎంపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ను 1.50 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. భాజపా జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌, తెలంగాణ ఎన్నికల ఇన్‌ఛార్జి అభయ్‌ పాటిల్‌, నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, దిలీపాచారి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


నాగర్‌కర్నూల్‌ అభివృద్దికి కృషి

-భరత్‌ప్రసాద్‌

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ అన్నారు. గురువారం ఆయన నాగర్‌కర్నూల్‌లో రిటర్నింగ్‌ అధికారి ఉదయ్‌కుమార్‌కు భాజపా శాసనసభాపక్ష ఉపనేత వెంకటరమాణారెడ్డి, తండ్రి, ఎంపీ రాములు, పార్టీ నేతలు జక్కా రఘునందన్‌రెడ్డి, ఎల్లేని సుధాకర్‌రావులతో కలిసి నామపత్రం దాఖలు చేశారు. అనంతరం భరత్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌కు మొదటిసారి వచ్చిన ప్రధాని మోదీ సభను విజయవంతం చేశామని, మొదటిసారి నాగర్‌కర్నూల్‌ గడ్డపై కాషాయ జెండా ఎగరేయటం ఖాయమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని