logo

కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం

ఈ నెల 19న వికారాబాద్‌ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 24 Apr 2024 07:03 IST

ఇప్పటివరకు రూ.3.8 కోట్లు స్వాధీనం

 ఈ నెల 19న వికారాబాద్‌ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 15న ధారూర్‌లో పత్రాలు, ఆధారాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న 29 తులాల బంగారం, 3 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.

 ఇవే కాదు.. ఇలాంటివి తరచూ వెలుగుచూస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 16 నుంచి ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో నిబంధనలు పక్కాగా అమలుపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. అక్రమంగా మద్యం, నగదు వివిధ ప్రాంతాలకు చేరకుండా పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను అందుబాటులోకి తీసుకొచ్చి కట్టడికి అడుగేశారు. ఎన్నికలు పారదర్శకంగా సాగేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

 న్యూస్‌టుడే, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి అర్బన్‌, సంగారెడ్డి టౌన్‌, వికారాబాద్‌: ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి. ఆయా చోట్ల పోలీసులు ప్రతి వాహనాన్ని పరిశీలించి పంపిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుచేశారు. వాటిని కలెక్టరేట్‌కు అనుసంధానం చేశారు. తద్వారా పర్యవేక్షణ సులభమవుతోంది.

రూ.50 వేలకు మించొద్దు

నిబంధనల ప్రకారం రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్లొద్దు. అంతకుమించితే కచ్చితంగా రసీదులు, పత్రాలు కలిగిఉండాలి. లేదంటే స్వాధీనం చేసుకుంటారు. రూ.10 లక్షలకు పైగా ఉంటే ఆర్వోకు సమాచారం ఇస్తారు. ఆదాయపు పన్ను శాఖకు విషయం చేరుతుంది. ఆధారాలు లేనిపక్షంలో తర్వాత నగదు తిరిగి పొందాలనుకుంటే ఎంసీఎంసీ కమిటీని ఆశ్రయించాలి.

ఒప్పంద పత్రాలు

భూముల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. తనిఖీ అధికారులకు రిజిస్ట్రేషన్‌, ఒప్పంద పత్రాలు చూపించాల్సి ఉంటుంది. కుటుంబంలో వివాహం, వైద్యం, వ్యవసాయం, ఇతర అవసరాల నిమిత్తం నిర్దేశిత మొత్తం దాటితే సంబంధిత వివరాలు, బిల్లులు చూపాలి. పెద్దమొత్తమైతే ఆదాయ పన్ను శాఖ అడిగిన పత్రాలు సమర్పించాలి.

మద్యం సరఫరా చేసినా..

ఓ వ్యక్తి ఆరు 750 ఎంఎల్‌ పరిమాణం కలిగిన మద్యం సీసాలు లేదంటే 12 ఆఫ్‌ బాటిళ్లు లేదా 24 క్వార్టర్లు తీసుకెళ్లవచ్చు. 30 ఎంఎల్‌ మద్యం సీసాలైతే 48 సీసాల వరకు ఫర్వాలేదు. ఆయా వాటితో పాటు 12 బీర్లను తీసుకెళ్లేందుకు అభ్యంతరాలు ఉండవు. అధికారులు ఆరా తీసినప్పుడు తగిన కారణం చెప్పాల్సి ఉంటుంది. అంతకుమించితే ఆబ్కారీ చట్టం ప్రకారం చర్యలు తప్పవు. మద్యాన్ని స్వాధీనం చేసుకుంటారు. విదేశాల నుంచి వచ్చే వారైతే రెండు లీటర్ల వరకు అనుమతి ఉంటుంది. దానికి రసీదు తప్పనిసరి. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క సీసా అనుమతి ఉండదు.

గ్రీవెన్స్‌ కమిటీ..

రైతులు ధాన్యం, జొన్నలు, వివాహాలు, ఇతర అవసరాలకు డబ్బు తరలించినప్పుడు సరైన పత్రాలు ఉండాలి. లేదంటే అధికారులకు అప్పగిస్తారు. ఈ విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నాలుగు జిల్లాల్లోని కలెక్టరేట్‌లలో గ్రీవెన్స్‌ కమిటీలను నియమించారు. బాధితులు 24 గంటల్లోపు ఆ కమిటీకి సరైన పత్రాలు సమర్పిస్తే వాటిని పరిశీలించి 48 గంటల్లోగా తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటుంది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 60 కేసులు నమోదవగా, 44 మందికి రూ.99 లక్షల మేర తిరిగి చెల్లించేశారు.
పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద తనిఖీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని