logo

సందడిగా నామపత్రాల దాఖలు

మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌రాజ్‌కు అందజేశారు.

Updated : 25 Apr 2024 06:26 IST

సందడిగా నామపత్రాల దాఖలు

మెదక్‌, న్యూస్‌టుడే: మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌రాజ్‌కు అందజేశారు. నర్సాపూర్‌, పటాన్‌చెరు ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మెదక్‌ జడ్పీ అధ్యక్షురాలు హేమలత, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ భట్టి జగపతితో కలిసి ఒక సెట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌తో కలిసి మరో సెట్‌ నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నాయకురాలు సుహాసినిరెడ్డితో కలిసి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు ఆయన కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు రమేశ్‌, ప్రదీప్‌కుమార్‌, ఆంజనేయులు, నరహరి, భానుచందర్‌, యుగతులసీ పార్టీ అభ్యర్థి అనిల్‌ మొదటి సెట్‌ నామినేషన్‌ వేయగా, ధర్మసమాజ్‌ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్‌, విముక్తి చిరుతల కక్షి పార్టీ అభ్యర్థి ఎల్లయ్య, స్వతంత్ర అభ్యర్థులు లక్ష్మినారాయణ, నవీన్‌ మరో సెట్‌ నామపత్రాలు సమర్పించారు.

ఆలోచించి ఓటు వేయండి: వెంకట్రామిరెడ్డి

 నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి తప్పుడు హామీలిచ్చిందని, బాండ్‌ పేపర్లను చెల్లని కాగితంగా చేసిందన్నారు. రైతులను రుణమాఫీ చేయడం లేదని, వరి పంటకు బోనస్‌ ఇవ్వకుండా మోసం చేస్తోందని విమర్శించారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, నాగలి, ఎడ్లు, నిరుద్యోగభృతి అని మోసం చేసి, నేడు తిరిగి ఎంపీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అబద్ధాలను ప్రజలు గుర్తించారని, ఈ ఎన్నికల్లో ఆపార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

 నేడు తుది గడువు

నామపత్రాల దాఖలుకు గురువారం తుది గడువు. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు 55 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రధాన పార్టీలైన భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు, భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ వేశారు. వీరితో పాటు ఆయా పార్టీల తరఫున పలువురు, స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్‌ వేయడానికి అవకాశం ఉంది. వచ్చిన నామినేషన్లను ఈనెల 26న పరిశీలించనున్నారు. 29 వరకు ఉప సంహరణకు గడువు విధించారు.

వేంకటేశ్వరస్వామి సన్నిధిలో సంతకం

నంగునూరు, న్యూస్‌టుడే: కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షిగా రూ.100 కోట్ల సొంత నిధులతో ట్రస్టును ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా సేవలు అందిస్తానని మెదక్‌ పార్లమెంట్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకొని స్వామివారి పాదాల వద్ద నామపత్రాలు, పార్టీ బీఫాం పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి సంతకాలు చేశారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ రోజాశర్మ, మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు