logo

Suryapet: సూర్యాపేటలో పట్టపగలే యువకుడిపై ఘాతుకం

పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ముగ్గురు యువకులు మరో యువకుడిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి రాళ్లతో మోదిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం కలకలం సృష్టించింది. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Updated : 30 Jun 2023 08:54 IST

సూర్యాపేటలో యువకుడిపై దాడి చేస్తున్న దృశ్యం

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ముగ్గురు యువకులు మరో యువకుడిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి రాళ్లతో మోదిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం కలకలం సృష్టించింది. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ అలియాస్‌ బంటి, మహేశ్‌, సన్నీ కలిసి తాళ్లగడ్డకు చెందిన చీకూరి సంతోష్‌ను స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అడ్డగించారు. ఇద్దరు యువకులు సంతోష్‌ను అదిమి పట్టుకున్నారు. ఒకరు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం బండరాళ్లతో యువకుడి తలపై మోదేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. ఇలా నడిరోడ్డుపై యువకులు వీరంగం సృష్టిస్తుండగా స్థానికులు ధైర్యం చేసి ఆయనను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు సంతోష్‌ అందరినీ తప్పించుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. అనంతరం సంతోష్‌ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనను ప్రత్యక్షంగా చూస్తున్న కొంత మంది మహిళలు భయంతో వణికిపోయారు. అక్కడే ఓ భవంతిపై ఉన్న వ్యక్తి చరవాణిలో ఈ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో వైరల్‌గా మారాయి. సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ ఘటనా స్థలానికి చేరుకొని కత్తి స్వాధీనం చేసుకున్నారు. 2021లో కృష్ణ అలియాస్‌ బంటిపై దాడి చేసిన కేసులో సంతోష్‌తోపాటు ఇద్దరు యువకులు జైలుకు వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి సంతోష్‌ కేసు ఉపసంహరించుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ తన స్నేహితులతో కలిసి గురువారం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు. బాధితుడి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని