logo

Priyanka Gandhi: ఇందిరమ్మను తలపించె.. మాటలతో మురిపించె..!

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం భువనగిరిలో నిర్వహించిన విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త జోష్‌ నిండింది.

Updated : 28 Nov 2023 06:59 IST

సభలో అభివాదం చేస్తున్న ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం భువనగిరిలో నిర్వహించిన విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త జోష్‌ నిండింది. ప్రియాంకగాంధీని చూసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా మహిళలు, ప్రజలు తరలివచ్చారు. ప్రియాంకగాంధీ జై బోలో తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దొరల పాలనకు స్వస్తిపలికి, ప్రజల పాలన కోసం కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను భారాస మోసం చేస్తూ పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. ప్రజల సంక్షేమానికి ఆరు గ్యారంటీలను ప్రకటించామని, తాము అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఆరు గ్యారంటీలు అమలు పరుస్తున్నామన్నారు. స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే ఎన్నడూ నోరు విప్పలేదని అన్నారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ట్రిపుల్‌ఆర్‌ బాధిత రైతుల పక్షాన, బస్వాపురం భూనిర్వాసితుల పక్షాన పోరాటం చేశారని గుర్తుచేశారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా భారాస ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందని, తెలంగాణ ప్రజలు ఎన్నడూ అమ్ముడు పోరని, ఇక్కడి ప్రజలు ఆత్మగౌరవం కోసం పోరాడుతారన్నారు. సభలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కర్ణాటక మంత్రి టి.శివరాజ్‌, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, సభ్యుడు తంగెళ్లపల్లి రవికుమార్‌, నాయకులు బర్రె జహంగీర్‌, బెండె శ్రీకాంత్‌, మహ్మద్‌ రఫియెద్దీన్‌, డాక్టర్‌ నగేష్‌, పిట్టల బాలరాజు, పడిగెల ప్రదీప్‌, గ్యాస్‌ చిన్న, కీర్తిరెడ్డి, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌, భువనగిరి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఆలస్యమైనా నిరీక్షించిన ప్రజలు

ప్రియాంకగాంధీ సభాస్థలికి గంట 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినప్పటికి ప్రజలు ఓపికగా నిరీక్షించారు. హెలిప్యాడ్‌కు మధ్యాహ్నం 12.38కి చేరుకున్న ప్రియాంక నేరుగా 12.43 గంటలకు సభావేదికకు చేరుకున్నారు. 37 నిమిషాల పాటు ఆమె సుదీర్ఘ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. ఆమె ప్రసంగాన్ని పార్టీ అనుబంధ కమిటీ కన్వీనర్‌ పవన్‌ మల్లాది అనువాదం చేశారు. మార్పు కావాలి-కాంగ్రెస్‌ రావాలి అని నినదించిన ప్రియాంకను సభా స్థలిలోని జనం అనుకరించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలి వచ్చిన ప్రజలతో సభాస్థలి కిటకిటలాడింది. స్థలం చాలక పలు మార్గాల్లో వస్తున్న ప్రజలను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. మహిళలు నృత్యాలు, పార్టీ జెండాల రెపరెపలతో సభాస్థలి సందడిగా మారింది. ఇందిరమ్మ మనవరాలు అంటూ ప్రియాంకను వృద్ధులు ఆసక్తిగా చూశారు.

సభకు హాజరైన ప్రజలు


రైతులకు సంకెళ్లు వేసిన భారాస ప్రభుత్వం

కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి

ట్రిపుల్‌ఆర్‌ బాధితులకు భారాస ప్రభుత్వం సంకెళ్లు వేసింది. బస్వాపూర్‌ ప్రాజెక్ట్‌ భూనిర్వాసితులకు, కరోనా బాధితులకు కాంగ్రెస్‌ పక్షాన అండగా నిలిచాను. ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాను. ఓటర్లను డబ్బులతో కొనేందుకు భారాస ప్రయత్నిస్తోంది. డబ్బులు తీసుకుని తనకు ఓటు వేసి గెలిపించండి. పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మూసీ కాలుష్యం నియంత్రణకు, మూసీనదిపై రాకపోకలకు జూలూరు, సంగెం, ఇంద్రియాలలో వంతెనలు నిర్మిస్తాం. భువనగిరిలో డిగ్రీ కళాశాల, బస్సులు భువనగిరి బస్టేషన్‌ నుంచి ప్రయాణించే విధంగా చర్యలు చేపడ్తా. సాగునీటి కాలువలను పూర్తి చేస్తాం. పోరాటాల, చైతన్యం కలిగిన భువనగిరి గడ్డ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని