logo

గాడితప్పిన గస్తీ

జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు.

Published : 19 Apr 2024 06:19 IST

పెరిగిన చోరీలు.. భయాందోళనలో ప్రజలు

రాయగిరిలో గొలుసు దొంగతనంపై పోలీసుల విచారణ

 భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు.  ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకొని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రతి రోజు చైన్‌స్నాచింగ్‌ ఘటనలు వెలుగుచూస్తుండటంతో జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలో మూడు డివిజన్లు, పదిహేడు పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. చోరులను పట్టుకునేందుకు జిల్లా కేంద్రంగా సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌, భువనగిరి పట్టణ పోలీస్‌  స్టేషన్‌లో  సొత్తు కేసుల ఛేదనకు ప్రత్యేక క్రైం, క్లూస్‌ బృందాలు ఉన్నాయి. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళలో గస్తీ కోసం పెట్రో మొబైల్‌, బ్లూకోల్ట్స్‌ బృందాలు ఉన్నా చోరీలు ఆగడం లేదు. మరోవైపు ఎన్నికల సమయం కావడంతో జిల్లాలో చెక్‌పోస్టులు వద్ద పోలీసుల పహారాకు చిక్కకుండా వెళ్తున్నారు.

 దొరకకుండా..ఆధారం చిక్కకుండా..

గొలుసు దొంగతనాల్లో పెద్దగా ఆధారాలు లభ్యం కావడం లేదు. ఘటన ప్రాంతాల్లో  కీలకమైన ఆధారాలు, వస్తువులు లభించడం లేదు. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న దొంగతనాల్లో కొత్త ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ తరహా ఘటనలకు పాల్పడిన చోరులకు సంబంధించిన వివరాలను సేకరించి దొరికిన ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం నమోదైన కేసుల్లో కొంతమంది పాతనేరస్థుల పాత్రపై విచారణ చేసినా వారు కాదని తేలింది. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలపై పోలీసులు ఆధారపడ్డారు. చాలా చోట్ల సీసీ కెమెరాల నిర్వహణ లేకపోవడంతో పోలీసులు కేసులు ఛేదించలేకపోతున్నారు. నిఘా నేత్రాలు పనిచేయకపోవడంతో నిందితులను గుర్తించడం కష్టతరంగా మారింది. కొన్ని కేసుల్లో నిందితులను గుర్తించి పక్కా ఆధారాలు సేకరించి వారిని అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.


రాత్రి వేళలో నిఘా పటిష్ఠం చేశాం
-ఎం.రాజేష్‌చంద్ర, డీసీపీ,   యాదాద్రిభువనగిరి

చోరీల నియంత్రణకు రాత్రి వేళలో నిఘా బృందాలను పటిష్ఠం చేశాం. నమోదైన కేసులను ఛేదించేందుకు దొరికిన ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు బృందాలు పనిచేస్తున్నాయి. ప్రజల పోలీసులకు సహకరించాలి. రాత్రి వేళలో ఆరుబయట నిద్రించేవారు నిర్లక్ష్యంగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యువకులు స్వచ్ఛందంగా తమ గ్రామాల భద్రతపై బాధ్యతగా వ్యవహరించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని