logo

ఏదీ నిఘా..!

లోక్‌సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే  అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.

Published : 20 Apr 2024 04:46 IST

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే  అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కోదాడ మండలం నల్లబండగూడెం, దామరచర్ల మండలం వాడపల్లి వంతెన, అడవిదేవులపల్లి టెయిల్‌పాండ్‌ సమీపంలో ఉంది. దీంతో పాటు మేళ్లచెరువు మండలం, కోదాడ మండలంలోని కొన్ని గ్రామాలు ఏపీ, తెలంగాణకు సరిహద్దులుగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులతో పాటు అంతర్‌రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గుంటూరు, నల్గొండ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర శాఖల అధికారులతో కలిసి గతనెల దామరచర్ల మండలం వాడపల్లిలో సమావేశం ఏర్పాటు చేసి అంతర్‌రాష్ట్ర సరిహద్దులో తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. ప్రస్తుతం కేవలం రహదారి చెక్‌పోస్టులు మాత్రమే ఉండగా.. కృష్ణానదిపై నిఘా కొరవడింది. దీంతో అక్రమార్కులు కృష్ణానది మీదుగా నాటుపడవల్లో సామగ్రి తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అడవిదేవులపల్లి మండలంలో ఏపీ తెలంగాణ సరిహద్దులో ఉన్న టెయిల్‌పాండ్‌

  •   తెలంగాణ ఏపీ సరిహద్దులో ఉన్న కృష్ణానదిలో ప్రస్తుతం నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో మరపడవలు, తెడ్ల పడవలు వినియోగించి నీటిని దాటగలుగుతున్నారు. దీంతో నగదు, మద్యం, నాటుసారా, మత్తు పదార్థాలు రహస్యంగా రవాణా చేస్తున్నారు. 
  • ఏపీలో మద్యం అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండకపోవడంతో ఇక్కడి నుంచి పడవల్లో అక్రమంగా సరఫరా చేసేవారు. పలుమార్లు ఈ తరహాలో మద్యం తరలిస్తుండగా వారిని పట్టుకుని కేసులు సైతం నమోదు చేశారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని సరిహద్దు గ్రామాల మీదుగా తెలంగాణ మద్యాన్ని రాత్రి సమయాల్లో అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
  • ఈసారి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలతో కలిసి జరుగుతుండగా తెలంగాణ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఏపీకి చెందిన ఓటర్లు అక్కడే ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపుతుండగా.. వీరిని సైతం ప్రభావితం చేసేలా చర్యలు చేపడుతున్నారు. కృష్ణానదిపై మరింత నిఘా ఏర్పాటు చేస్తేనే ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని