logo

జీవితంలో పాస్‌ అవుదాం..!

పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో..

Published : 23 Apr 2024 02:40 IST

వైద్యారోగ్యశాఖ అధికారులు రూపొందించిన ఆత్మహత్యల నివారణ కరపత్రం నమూనా

  • అక్షరం చదవని పుల్లారెడ్డి ‘పుల్లారెడ్డి నేతి మిఠాయిల’ పేరుతో వ్యాపారం ప్రారంభించి దేశవిదేశాల్లో గొప్ప పేరు సాధించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
  • ఇంటర్‌లో ఫెయిలై ఏడాది ఖాళీగా ఉండి ఆ తరువాత కష్టపడి చదివి పోలీసుశాఖలో చేరి డీఎస్పీగా పనిచేశారు ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి.
  • ఆంగ్లంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి పదేళ్లు హైదరాబాద్‌లో ఆటోనడిపి.. ఆ తరువాత డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా ఉద్యోగం సాధించారు మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తి.

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ‘జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం’ ప్రారంభించారు. విద్యార్థులకు పరీక్షల ఫలితాలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రస్తుతం ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేపడుతున్నారు. మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న వారు నేరుగా టోల్‌ఫ్రీ నెంబరు 14416కు ఫోన్‌ చేస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య అధికారులు, కౌన్సిలర్లు వారిలో ఆత్మస్థైర్యం కల్పించి మనోధైర్యం పెంపొందేలా చూస్తున్నారు. ‘ చదువే జీవితం కాదు.. జీవితమే శాశ్వతం’ అన్న విషయాన్ని అర్థం చేసుకునేలా చేస్తూ ‘పరీక్షల్లో పాస్‌ కావడం కాదు.. జీవితంలో పాస్‌ అవ్వాలి’ అంటూ తెలియజేస్తారు.

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేకంగా జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమంపై కరపత్రాలు రూపొందించి ప్రచారం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని పరీక్షల్లో మార్కులు, గ్రేడ్‌ల పేరిట మానసిక ఒత్తిడికి గురిచేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కసారి పరీక్షలో ఫెయిల్‌ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్‌ అవుతారని విద్యార్థులను భయపెట్టరాదని,  ఓటమి గెలుపునకు తొలిమెట్టు అవుతుందని ధైర్యం చెప్పాలని తెలియజేస్తున్నారు.

మార్కులే కొలమానం కాదు..

 కల్యాణ్‌చక్రవర్తి, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి, సూర్యాపేట

విద్యార్థులకు పరీక్షల్లో మార్కులు, ఫలితాలే కొలమానంగా తల్లిదండ్రులు భావించరాదు. పదోతరగతి, ఇంటర్‌ ఫెయిలై గొప్పస్థాయికి చేరుకున్న వారి గురించి తమ పిల్లలకు వివరించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఆత్మహత్య ఆలోచనలు వారి మనసులోంచి తొలగుతాయి. ప్రత్యేకంగా కరపత్రాలతో ప్రచారం చేపడుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు