logo

ఆ చేపల పులుసు..మనసులు గెలుచు

Updated : 18 May 2024 04:22 IST

దేవరకొండ నుంచి బంగ్లాదేశ్‌కు చేపలను వాహనాల ద్వారా ఎగుమతి చేస్తున్న దృశ్యం

దేవరకొండ, న్యూస్‌టుడే: వాగులు, వంకలు, చెరువులు, నదుల్లో దొరికే చేపల రుచి ఆయా ప్రవాహాలపై ఆధారపడి ఉంటుంది. పెంపకంగా దొరికే చేపలను పక్కన పెడితే ప్రకృతి పరంగా లభించే చేపలంటే చాలా మంది ఇష్టపడతారు. అందులోనూ నాగార్జునసాగర్‌ వెనుక జలాలు, ఏఎమ్మార్పీ, ఏకేబీఆర్‌ ప్రాజెక్టుల్లో లభించే చేపలంటే భోజన ప్రియులకు మరీ ఇష్టం. రుచి కొంచెం తియ్యగా, చప్పగా ప్రత్యేకంగా ఉండడంతో ఈ చేపల కోసం బంగ్లాదేశ్‌ దేశ వ్యాపారస్తులు, అసోం వంటి రాష్ట్రాల వారు కొనుగోలు చేసుకొని తరలిస్తుండడంతో దేవరకొండ నియోజకవర్గ ప్రాంతంలోని చేపలంటే యమరుచిగా పేరు వర్ధిల్లుతుంది.

 వేసవిలో సైతం

వర్షాకాలంలో ఎగువ ప్రాంతమైన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసే సమయంలో నాగార్జునసాగర్‌ వెనుక జలాలు ఏఎమ్మార్పీ, ఏకేబీఆర్‌ రిజర్వాయర్లలో నీళ్లు పుష్కలంగా ఉండడంతో చేపలకు కొదవ లేకుండా ఉంటుంది. గత ఏడాది తీవ్ర వర్షాభావం ఉండడంతో ప్రాజెక్టుల్లో జలకళ లేకుండా పోయింది. ప్రాజెక్టులు అడుగంటి పోయాయి. అయినా చేపలు పుష్కలంగా లభిస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతం కృష్ణపట్టి తీరంలో దట్టమైన అడవులు, గుట్టల మధ్య కృష్ణానది ప్రవహిస్తుండడంతో ఈ నీటిలో లభించే చేపలు చాలా రుచిగా ఉండేందుకు కారణమవుతున్నాయి. ప్రవాహంలో ప్రకృతి ఆధారంగా లభ్యమయ్యే పౌష్టికాలు, ఒండ్రుమట్టి సారం కారణంగా చేపలు రుచికరంగా ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. సాధారణంగా చందమామ, జెల్లలు, రొయ్యలు, బంగారుతీగ రకాలు ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఒక్కోసారి అరుదైన చేపలు సైతం మత్స్యకారులకు దొరుకుతాయి. చేపల వేటే జీవనాధారంగా వందలాది కుటుంబాలు కృష్ణానది తీరంలో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ నుంచి వచ్చిన మత్స్యకారుల కుటుంబాలు ఇంటిల్లిపాది నదితోనే మమేకమవుతూ జీవనం గడుపుతారు. ఇందులో మహిళలు సైతం భాగస్వాములవుతారు. అందుకే దేవరకొండ నియోజకవర్గ ప్రాంతాల్లో ఆ చేపల పులుసుకు ఇతర రాష్ట్రాల్లో సైతం పేరుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని