logo

వైకాపా ‘మందు’చూపు

నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది..

Updated : 25 Apr 2024 05:24 IST

కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇలాకాలో భారీగా మద్యం డంపులు
అక్రమంగా దాచిపెట్టి.. అడ్డంగా దొరికిన అధికార పార్టీ నాయకులు

విరువూరులోని వైకాపా నాయకుడి రైస్‌మిల్లు నుంచి మద్యం పెట్టెలు స్వాధీనం చేసుకుంటున్న సెబ్‌, పోలీసు అధికారులు

ఈనాడు, నెల్లూరు : నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. వేలాది మద్యం సీసాలు ఒకే చోట ఎలా డంప్‌ చేస్తున్నారు? అవి ఎక్కడి నుంచి వచ్చాయ్‌? అసలు ఆ సీసాల్లో ఉన్నది నిజమైన మద్యమేనా? ఒకటి, రెండు సీసాలు దొరికితేనే హడావుడి చేసే పోలీసులు, సెబ్‌ అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారు? ఫిర్యాదు అందుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు అక్కడికి వెళ్లేలోపే వారికి సమాచారం ఎవరిస్తున్నారు? రూ. లక్షల విలువైన సరకు ఒక చోట దొరికితే కనీస విచారణ చేయకుండా.. కేసులు కట్టి చేతులు దులుపుకోవడంలోఆంతర్యమేమిటి? ఇవీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియోజకవర్గంలో భారీగా లభ్యమైన మద్యం సీసాల గుట్టు విప్పకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తలెత్తుతున్న ప్రశ్నలు..

వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. దాంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సామదాన దండోపాయాలు వినియోగిస్తున్నారు. ఓ వైపు నోట్ల కట్టలను సిద్ధం చేస్తూనే.. మరోవైపు మద్యం సీసాలు డంప్‌ చేస్తున్నారు. అయిదేళ్లలో అక్రమంగా దోచుకున్న సొమ్మును.. మళ్లీ అధికారం సాధించడం కోసం విచ్చవిడిగా ఖర్చు చేసేందుకు సంసిద్ధులయ్యారు. ఎన్నికల సమయంలో అనుచరులతో పాటు ఓటర్లు, ప్రచార కూలీలకు మద్యం ఎరగా వేయడానికి ఉర్రూతలూగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి జిల్లాలో అడపాదడపా దొరికే సీసాలు ఒక ఎత్తయితే.. వారం రోజుల వ్యవధిలో సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమైన భారీ డంప్‌లే అధికార పార్టీ నాయకుల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి తెచ్చిన సరకును ఇలా దాచిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తుండగా.. నేరుగా డిపోల నుంచి కూడా తెచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

విచారిస్తేనా? నిగ్గుతేల్చేనా?

2014 ఎన్నికల సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు కల్తీ మద్యం సరఫరా చేశారు. దాని కాటుకు ఏడుగురు చనిపోగా- పలువురు ఆసుపత్రుల పాలయ్యారు. ఆ కేసుల్లో నిందితులు.. ఇప్పుడూ బరిలో ఉన్నారు. ఆ నేపథ్యంలో భారీగా మద్యం సీసాలు దొరకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పంటపాళెంలో 4,232, బుధవారం విరువూరులో లభ్యమైన 2,649 సీసాలు వైకాపా నాయకులైన సుధాకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిల దగ్గరే దొరికాయి. ఇదంతా సరేలే అనుకున్నా.. అసలు ఆ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో నిజానిజాలు వెలికి తీయలేకపోతున్నారు. ఆ సీసాలపై ఉన్న కోడ్‌ను స్కాన్‌ చేస్తే.. దాని చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. సంబంధిత అధికారులు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో ఆ సీసాల్లో ఉన్నది కల్తీదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు, సెబ్‌ అధికారులు ఉద్దేశపూర్వకంగానే సూత్రధారులను తప్పించేందుకు యత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎన్నికల సంఘం దృష్టిసారిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ప్రజల కోరుతున్నారు.

దుకాణాల్లో.. విధేయులే!

జిల్లాలో మొత్తం 193 మద్యం దుకాణాలు ఉండగా- ఒక్కో చోట సూపర్‌వైజర్‌, ఇద్దరు సేల్స్‌మెన్లు పనిచేస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ శాతం వైకాపా విధేయులే కావడం గమనార్హం. గతంలో వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారినే ఆబ్కారీశాఖ అధికారులు ఎంపిక చేశారు. ఆ నేపథ్యంలోనే కొందరు సూపర్‌ వైజర్లు, సేల్స్‌మెన్లు కృతజ్ఞతాభావంతో వైకాపా నాయకులకు పరిమితికి మించి విక్రయిస్తున్నారు. దుకాణాల వద్దకు వచ్చే మందుబాబులకు స్టాక్‌లేదని చెప్పి వెనక్కు పంపుతున్నారు. అధికార పార్టీ నాయకుల జోక్యంతో.. ఆబ్కారీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు