logo

ఇంటింటికీ ఇచ్చేందుకు ఇబ్బందేంటి జగన్‌!

సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్ణయం.. వృద్ధులకు ప్రాణ సంకటంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఉద్దేశపూర్వకంగా అవస్థలు పెట్టేందుకు కుట్ర పన్నింది.

Updated : 01 May 2024 05:15 IST

ఒకే వీధిలో ఒకరిద్దరికి ఇచ్చి.. మిగిలిన వారికి ఇవ్వకపోవడంపై అభ్యంతరం
ఓట్ల కోసం తమను అవస్థలు పెట్టడమేమిటంటూ పింఛనుదారుల ఆవేదన

సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్ణయం.. వృద్ధులకు ప్రాణ సంకటంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఉద్దేశపూర్వకంగా అవస్థలు పెట్టేందుకు కుట్ర పన్నింది. గత నెలలో సచివాలయాల దగ్గరకు వెళ్లి తీసుకునేందుకే నానా అవస్థలు పడిన పింఛనుదారులను.. ఈ సారి ఏకంగా కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుల చుట్టూ తిప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఒక వీధిలో పది పింఛన్లు ఉంటే.. కేవలం ఒకరిద్దరికి ఇచ్చేందుకే సిబ్బందిని పంపిస్తోంది. పండుటాకులకు ఆసరాగా ఉండే సొమ్మును ఆలస్యం చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. సరిపడా సిబ్బంది ఉన్నా.. వారికేం పనులు లేకున్నా.. ప్రతిపక్షాలపై బురద జల్లుతూ.. ఓట్ల కోసం అభాగ్యల ప్రాణాలతో వైకాపా ప్రభుత్వం రాజకీయం చేస్తోంది.

ఈనాడు, నెల్లూరు: జిల్లాలో 768 గ్రామ, వార్డు సచివాయాలు ఉండగా- వీటి పరిధిలో మొత్తం 3.15 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో 79,734 మందికి మాత్రమే ఇంటింటికీ అందజేస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో 6,800 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. వీరందరితో పంపిణీ చేయిస్తే.. రెండు రోజుల్లోనే అందరికీ పూర్తి చేయవచ్చు. అయినా అధికారులు కుంటిసాకులు చెబుతున్నారు. మిగిలిన వారందరికీ డీబీటీ(డైరెక్ట్‌ బ్యాంకు ట్రాన్స్‌ఫర్‌) విధానంలో మే నెల పింఛను విడుదల చేయనున్నారు. ఆ సొమ్ము లబ్ధిదారుల ఆధార్‌ కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు జమకానుంది. ఇప్పటికే డీబీటీ విధానంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సొమ్ము కొందరికి సక్రమంగా అందక.. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆ క్రమంలో పింఛను సొమ్ముకు కూడా తమకు పాట్లు తప్పేలా లేవని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జమ సరే.. తీసుకోవడం ఎలా?

జిల్లాలో బ్యాంకులకు వెళ్లి.. నగదు తీసుకోవాల్సిన వారు 2.35 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ.. అవన్నీ పాతవే. కొందరివి మనుగడలో ఉన్నాయో లేదో.. చాలా మందికి తెలియదు. ఈకేవైసీ కాకపోవడం.. సున్నా నిల్వలు.. వీటిల్లో ఏ సమస్య ఉన్నా లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పవు. పైగా ఆధార్‌ లింకైన బ్యాంకుకే నగదు వెళ్లే అవకాశం ఉండటంతో.. రెండు, మూడు ఖాతాలున్న వారు ఎందులో జమైందో తెలియక గందరగోళానికి గురవుతారు. నెల్లూరుకు చెందిన రహీం అనే వృద్ధుడికి మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అన్నింటికీ ఆధార్‌ అనుసంధానమైంది. ఏ ఖాతాలో డబ్బులు పడుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎందులో జమైందో తెలుసుకునేందుకు మళ్లీ సచివాలయానికి వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు.

ప్రతిపక్షాలపై నెపం నెట్టేందుకు కుట్ర

మే ఒకటో తేదీ మేడే. సెలవు కావడంతో.. అందరూ రెండో తేదీ బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి లబ్ధిదారులంతా బ్యాంకులకు వెళ్లినా.. నగదు చెల్లించే అవకాశం లేదు. ఫారంలో వివరాలు నమోదు చేసి క్లర్క్‌కు ఇస్తే.. వాటిని ఆన్‌లైన్‌లో చెక్‌ చేసి.. ఆ ఖాతాలో నగదు ఉంటే చెల్లింపులు జరుగుతాయి. ప్రతి ఖాతాదారుడికి ఇచ్చేందుకు 10 నిమిషాలైనా పడుతుంది. ఈ లెక్కన ఉదయం పది గంటలకు బ్యాంకు తెరిచినా.. పనివేళలు ముగిసే సమయానికి 30 నుంచి 40 కంటే ఎక్కువ మందికి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మందికి మండల కేంద్రాల్లోని బ్యాంకుల్లోనే ఖాతాలు ఉంటాయి. వారందరికీ ఇచ్చేందుకు సరిపడా నగదు నిల్వలు అక్కడ అందుబాటులో ఉండవు. దీంతో ఒక్కో లబ్ధిదారుడు రెండు, మూడు సార్లు తిరగాల్సి వస్తుంది. వెంకటాచలం మండలంలో మొత్తం 8,916 మంది లబ్ధిదారులు ఉండగా.. 2,221 మందికి ఇళ్లకు ఇస్తున్నారు. మిగిలిన వారిలో సుమారు నాలుగు వేల మంది పింఛను సొమ్ముకు మండల కేంద్రానికి రావాల్సిందే. ఇదంతా పండుటాకులను పలుమార్లు తిప్పడంతో పాటు మండుటెండలో చిత్రహింసలు పెట్టేందుకు వైకాపా పన్నాగం పన్ని.. ఆ తప్పును ప్రతిపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

గత నెలతో పోల్చితే తగ్గుదల

ఏప్రిల్‌లో 3,16,492 మందికి రూ. 95 కోట్లు విడుదలైంది. మే నెలకు సంబంధించి 3,15,423 మందికే అందజేయనున్నారు. 1,069 మందికి తగ్గించారు. ఇందుకు కారణాలు తెలియలేదు.


అంత దూరమొచ్చి.. కొందరికేనా!

గుడ్లూరు: మండలంలో అత్యధిక ఆవాసాలున్న సచివాలయం చినలాటరపి పంచాయతీ. దీని పరిధిలో జానకంపేట, ఆర్సీ అగ్రహారం, పెదలాటరపి గ్రామాలు ఉండగా- పింఛన్లు 344 ఉన్నాయి. వీటిలో 181 మందికి ఇంటికి వెళ్లి ఇవ్వనున్నారు. మిగిలినవారంతా సుమారు 8 కి.మీ. దూరంలోని గుడ్లూరుకు రావాల్సి ఉంది. సచివాలయంలో మొత్తం పది మంది పనిచేస్తుండగా.. వీరికి పంపిణీ బాధ్యత అప్పగిస్తే ఒక్కొక్కరికి 34 చొప్పున వస్తాయి. ఇప్పటికే వీరిలో ఒక్కొక్కరు పది మందికి చొప్పున ఇళ్లకు ఇస్తున్నారు. అక్కడి వరకు వెళ్లిన సిబ్బంది.. మిగిలిన వారికి ఇచ్చేందుకు ఇబ్బందేమిటో అధికారులకే తెలియాలి. 


ఎటు చూసినా.. 300 మీటర్లలోపే..

అల్లూరు: అల్లూరు-1 సచివాలయంలో 8 మంది సిబ్బంది ఉండగా- దీని పరిధి ఎటు చూసినా 300 మీటర్లలోపే ఉంటుంది. మొత్తం 649 మంది పింఛనుదారులు ఉండగా.. 189 మందికి ఇళ్లకు ఇస్తున్నారు. అంటే.. ఒక్కో ఉద్యోగి సగటున 23 మంది చేతికి నగదు ఇస్తున్నారు. దీన్ని పూర్తి చేయడానికి ఒక్క రోజు కూడా పట్టదు. వారు ఇంటికి వెళ్లి ఇచ్చే వారి పక్కనే పదుల సంఖ్యలో లబ్ధిదారులు ఉన్నా.. వారికి ఇవ్వకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


పక్కింటికి వచ్చి.. నాకు లేదంటే ఎలా

- వీర రాఘవులు, చినలాటరపి

నా వయసు 64 ఏళ్లు. ప్రస్తుతం ఎండ తీవ్రతకు ఇంట్లోనే ఉండలేకపోతున్నాం. పింఛను డబ్బుకు 8 కి.మీ. వెళ్లాల్సి వస్తోంది. నాకు చరవాణి ద్వారా తెలుసుకోవడం.. తీసుకోవడం రాదు. అధికారులు ఫోన్‌ చేసి బ్యాంకులో వేస్తాం.. తీసుకోమని చెబుతున్నారు. మా ఇంటికి సమీపంలోని 85 ఏళ్ల వృద్ధుడికి ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పారు. ఆ పక్కనే కదా మా ఇల్లు, వచ్చి ఇవ్వండయ్యా! అని అడిగితే.. కుదరదని చెబుతుండటం ఎంత వరకు సబబు. ఈ వయసులో మమ్మల్ని బ్యాంకుల చుట్టూ తిప్పేందుకే ఇలా చేస్తున్నారనిపిస్తోంది.  


సచివాలయమే దగ్గర

- కె.నరసమ్మ, కందుకూరు

పింఛన్లను ఇంటికి తెచ్చి ఇచ్చే అవకాశం ఉన్నా.. అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. గత నెలలో సచివాలయానికి పిలిపించి ఇబ్బంది పెట్టారు. కనీస సదుపాయాలు కల్పించలేదు. ఎండలో కి.మీ. వెళ్లి.. పింఛను సొమ్ము తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ సారి బ్యాంకులో వేసి.. మా కష్టాలు రెట్టింపు చేశారు. ఇప్పుడు దాదాపు 2 కి.మీ. వెళ్లాల్సి వస్తోంది. అది కూడా ఉదయం పది తర్వాత.. అక్కడ ఎంత సమయం పడుతుందో.. తలచుకుంటే భయమేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని