logo

లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి

మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు.

Updated : 19 Apr 2024 06:12 IST

శతశాతం దాటిన బ్యాంకు లింకేజీ రుణాలు  

మహిళా సంఘ సభ్యులతో మాట్లాడుతున్న డీఆర్‌డీవో చందర్‌నాయక్‌

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌ : మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆర్థికంగా రాణిస్తూ సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్నారు. జిల్లాలో నాలుగేళ్లుగా నిర్దేశించిన లక్ష్యానికి మించి రుణాలు పంపిణీ చేస్తున్నారు. మహిళలు కూడా తీసుకున్న రుణాలను తిరిగి సమయానుకూలంగా చెల్లింపులు చేస్తున్నారు. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో కూడా శతశాతం లక్ష్యాన్ని సాధించారు.

3.27 శాతం అధికంగా

రుణాల పంపిణీ లక్ష్యాన్ని అధికారులు ప్రతి జిల్లాకు సూచిస్తారు. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన లక్ష్యానికి మించి 3.27 శాతం రుణాన్ని అధికంగా అందించారు. మహిళల ఆర్థిక స్థోమత ఆధారంగా గ్రూపులకు రూ.లక్ష నుంచి రూ.20 లక్షల రుణాలు పంపిణీ చేశారు. తీసుకున్న రుణాలను మహిళలు తమ అవసరాలకు వాడుకుంటూ లబ్ధి పొందుతున్నారు. 2022- 23 ఏడాదిలోనూ రూ.550 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఇందులో రూ.539 కోట్లను (98 శాతం) తిరిగి బ్యాంకులకు చెల్లించారు.

నిరంతర కృషి  

జిల్లాకు ఇచ్చిన లక్ష్యాలను సాధించడానికి ఐకేపీ అధికారులు నిరంతరం కృషి చేశారు. మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. రుణాలు తీసుకోవడంలో ఆసక్తి చూపుతున్న మహిళా సంఘాలకు వెంటనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రుణాలతో 90 శాతం పైగా మహిళలు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. చేపల పెంపకం, డెయిరీ నిర్వహణ, కిరాణ, గాజుల దుకాణాలు తదితర వ్యాపారాలు చేస్తున్నారు.


సద్వినియోగం చేసుకుంటున్నారు

మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న బ్యాంకు లింకేజీ రుణాలను మహిళలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో లక్ష్యం కంటే అధికంగా రుణాలు ఇవ్వగలిగాం. తీసుకున్న రుణాలను కూడా మహిళలు తిరిగి చెల్లిస్తున్నారు.  

 చందర్‌నాయక్‌, డీఆర్‌డీవో, కామారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని