logo

ఓటరు తీర్పు విభిన్నం..

కామారెడ్డి జిల్లా ప్రజలకు జహీరాబాద్‌, మెదక్‌ లోక్‌సభ స్థానాలతో అనుబంధం ఉంది. ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు.

Published : 23 Apr 2024 07:03 IST

ముందు మెదక్‌..తర్వాత జహీరాబాద్‌

 అన్ని పార్టీలకు అవకాశం

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: కామారెడ్డి జిల్లా ప్రజలకు జహీరాబాద్‌, మెదక్‌ లోక్‌సభ స్థానాలతో అనుబంధం ఉంది. ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు 2008 వరకు మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉండేవి. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఆవిర్భవించిన జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో కామారెడ్డి, ఎల్లారెడ్డితోపాటు బాన్సువాడ, జుక్కల్‌ అసెంబ్లీ స్థానాలను జహీరాబాద్‌లో విలీనం చేశారు. అయితే ఈ రెండు స్థానాల్లో ఓటర్లు అన్ని పార్టీలను ఆదరించారు.

బరిలో ఇందిరాగాంధీ..

మెదక్‌ లోక్‌సభ ఆవిర్భవించినప్పటి నుంచి 2008 వరకు ఇక్కడ 15 మార్లు ఎన్నికలు నిర్వహించగా 12 మార్లు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులకే ఓటర్లు పట్టం కట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఇక్కడ ఇందిరాగాంధీ(కాంగ్రెస్‌)పై జైపాల్‌రెడ్డి(జనతాపార్టీ) పోటీ చేశారు. అయితే ఇందిరాగాంధీకి ఇక్కడి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 3,01,577 ఓట్లు రాగా.. జైపాల్‌రెడ్డికి 82,433 ఓట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ 68 శాతం ఓట్లు సాధించి విజయం సాధించారు. అంతేకాదు దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్నప్పుడే ఆమె హత్యకు గురయ్యారు. ఆ తర్వాత బాగారెడ్డి ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1989 నుంచి 1998 వరకు వరుసగా నాలుగుసార్లు ఎంపీగా విజయకేతనం ఎగురవేశారు.

తెదేపా.. భాజపాలకు సైతం..

1984లో తెదేపా అభ్యర్థి మాణిక్‌రెడ్డికి 2,63,524 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థికి 2,61,702 ఓట్లు వచ్చాయి. 1,822 ఓట్ల స్వల్ప మెజార్టీతో మాణిక్‌రెడ్డి విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఆలే నరేంద్ర 1,23,766 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

నాటకీయ పరిణామాల మధ్య అభ్యర్థి ఎంపిక

2009లో జహీరాబాద్‌ లోక్‌సభ స్థానానికి తొలిసారిగా ఎన్నికలు నిర్వహించారు. అయితే అప్పుడు తెదేపా, తెరాస పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా జహీరాబాద్‌ స్థానం తెరాసకు కేటాయించాల్సి వచ్చింది. దీంతో అప్పటికే కామారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ రేసులో గంప గోవర్ధన్‌, సయ్యద్‌ యూసుఫ్‌ అలీలు పోటీ పడుతున్నారు. తెదేపా అధిష్ఠానం గంప గోవర్ధన్‌కే టికెట్‌ ఇచ్చింది. దీంతో తెదేపాలో కొనసాగుతున్న యూసుఫ్‌అలీకి రాత్రికి రాత్రే తెరాస అభ్యర్థిగా ఖరారు చేసి పోటీకి దింపారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి యూసుఫ్‌అలీకి 3,78,360 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌కు 3,95,767 ఓట్లు వచ్చాయి. దీంతో 17,407 ఓట్లతో షెట్కార్‌ విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు