logo

నేనండి..ఈవీఎంని

ఓటరు మహాశయులకు నమస్కారాలు.. నేనండీ.. మీ ఈవీఎం(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌))ని. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలొచ్చిన ప్రతిసారి మీ ముందుకొస్తుంటాను కదా.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మళ్లీ మనం కలవబోతున్నాం.

Updated : 29 Apr 2024 05:49 IST

 మీ ఓటు భద్రమే.. నన్ను నమ్మండి
 మే 13న పోలింగ్‌ కేంద్రాలకు తరలిరôడి

 న్యూస్‌టుడే, కమ్మర్‌పల్లి : ఓటరు మహాశయులకు నమస్కారాలు.. నేనండీ.. మీ ఈవీఎం(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌))ని. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలొచ్చిన ప్రతిసారి మీ ముందుకొస్తుంటాను కదా.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మళ్లీ మనం కలవబోతున్నాం. మీరేసిన ఓట్లతో అభ్యర్థుల విజయావకాశాలు నిర్ణయిస్తాను నేను. ఈవీఎంలలో రిగ్గింగ్‌, ట్యాంపరింగ్‌కు అవకాశముందని నాపై ఆరోపణలు వచ్చాయి. అవన్నీ అపోహలేనని కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో నాలో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో వందశాతం సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లనూ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. స్లిప్పుల లెక్కింపు అసాధ్యమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టీకరిస్తూ నాపై విశ్వాసం ఉంచింది. ఇప్పటికైనా నన్ను నమ్మండి.. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మే 13న పోలింగ్‌ కేంద్రానికి తరలివచ్చి ఓటేయండి.. మీరు గెలిచి.. నన్నూ గెలిపించండి.

నా నిర్మాణం  ఇలా..

నేను విద్యుత్తు లేదా బ్యాటరీ సహాయంతో పని చేస్తాను. నాలో అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించిన గుర్తులతో బ్యాలెట్‌ను ఫీడ్‌ చేస్తారు. నాలో నోటాతో కలిపి 16 మీటలుంటాయి. 15 నేతల భవితను నిర్ణయిస్తాయి. మీకు ఎవరూ నచ్చకపోతే నోటాను ఎంచుకోండి. ఓటింగ్‌కు ముందు, పూర్తయ్యాక అధికారులు నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి భద్రపరుస్తారు. ఆ చోటునే స్ట్రాంగ్‌ రూం అంటారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు నన్ను కంటికి రెప్పలా కాపాడుతారు.

నమూనా  పోలింగ్‌

పోలింగ్‌ ప్రారంభానికి అరగంట ముందు ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్‌ నిర్వహిస్తారు. వారితో ఓట్లేయించి అభ్యర్థుల వారీగా నమోదైన స్లిప్పులు చూపించి వాటిని తొలగిస్తారు. తర్వాత పోలింగ్‌ పూర్తయ్యాక ఓటర్ల నుంచి తీసుకున్న సంతకాల సంఖ్యను నాలో పోలైన ఓట్లతో సరి చూసుకుంటారు. అవి సరిపోతే స్టాప్‌ మీట నొక్కేస్తారు. ఆ తర్వాత ఓట్లు వేయరాదు. అనంతరం నాకు సీలు వేస్తారు.

ఎప్పుడు పరిచయం  చేశారంటే..

1977లో నన్ను ప్రతిపాదించగా.. 1979లో ఒక వర్కింగ్‌ మోడల్‌గా ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసింది. 1980లో రాజకీయపార్టీల ఎదుట నన్ను ప్రదర్శించారు. 1982లో కేరళలోని పరవూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అమలు చేశారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 1998లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీలో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మే 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఉపయోగించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో వినియోగించారు. 2014లో నాపై అనుమానాలను తొలగించడానికి వీవీప్యాట్‌ స్లిప్పులతో, 2019లో తీర్పు తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 ఈవీఎంలను ర్యాండమ్‌గా ఎంపిక చేసి వాటిలోని ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చి చూస్తున్నారు.

ఇలా పనిచేస్తాను..

  •  సాధారణ బ్యాలెట్‌ మాదిరిగానే నా(ఈవీఎం) పలక మీద బ్యాలెట్‌ ఉంటుంది. అభ్యర్థి పేరు గుర్తు పక్కనే ఎరువు రంగులో బాణం, దాని పక్కన ఓటరు నొక్కాల్సిన నీలం రంగు మీట ఉంటుంది.
  •  కంట్రోల్‌ యూనిట్‌ వద్ద ఉండే అధికారి నన్ను సిద్ధం చేశాక పచ్చలైటు వెలుగుతుంది.. అప్పుడే ఓటేయొచ్చు.
  •  ఓటరు మీట నొక్కగానే శబ్దం వస్తుంది. తర్వాత మళ్లీ నొక్కినా ఓటు పడదు.
  •  ఒకేసారి రెండు మీటలు నొక్కితే ఎక్కువ బలం దేనిపై పెడితే ఆ గుర్తుకు ఓటు నమోదవుతుంది. దీంతో రిగ్గింగ్‌కు ఆస్కారం ఉండదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని