logo

IT Raids: ఆగని ఐటీ దాడులు.. సంచుల కొద్దీ డబ్బు

ఒడిశాలో అయిదు రోజులుగా ఆదాయం పన్ను అధికారులు నాటుసారా తయారు చేసి విక్రయించేవారి ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే

Updated : 10 Dec 2023 08:07 IST

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఒడిశాలో అయిదు రోజులుగా ఆదాయం పన్ను అధికారులు(IT Raids) నాటుసారా తయారు చేసి విక్రయించేవారి ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం వరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో దాడులు నిర్వహించి రూ.225 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ప్రజల సొమ్ము దోచుకున్న వారి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి ప్రజలకు చేరుస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో అధికారులు దాడులు ముమ్మరం చేశారు.

156 సంచుల నగదు వెలికితీత: శుక్రవారం రాత్రి బొలంగీర్‌ జిల్లా సుధారపడ ప్రాంతంలో నాటు సారా తయారుచేసే సంస్థ మేనేజర్‌ ఇంటిలో సోదాలు నిర్వహించి భారీగా డబ్బు వెలికితీసి 20 సంచుల్లో ఉంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న ధనాన్ని 156 సంచుల్లో వేసి ఈ మొత్తాన్ని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బ్యాంకులో ఉన్న నోట్ల లెక్కింపు యంత్రాలతోపాటు ఇతర బ్రాంచుల్లో ఉన్న యంత్రాలనూ తీసుకొచ్చి శనివారం లెక్కించారు.

అక్రమ నగదు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందిస్తూ స్వాధీనం చేసుకున్నది అక్రమ నగదు అని, ఇది భారీ మొత్తంలో రికవరీ కావడం ఆందోళన కలిగించే విషయమన్నారు.

రాష్ట్రంలో ప్రముఖ నాటు సారా వ్యాపారిగా గుర్తింపున్న బొలంగీర్‌కు చెందిన బల్దేవ్‌ సాహుకు సంబంధించిన సంస్థలోను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బొలంగీర్‌తోపాటు సంబల్‌పూర్‌, రవుర్కెలా, భువనేశ్వర్‌, సుందర్‌గఢ్‌ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని