logo

నితీష్‌ గమ్యం ఎటువైపు?

సంబల్‌పూర్‌ సిటింగ్‌ ఎంపీ నితీష్‌ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది.

Published : 20 Apr 2024 03:08 IST

మద్దతు భార్యకా? భాజపాకా?
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే

సంబల్‌పూర్‌ సిటింగ్‌ ఎంపీ నితీష్‌ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. దేవ్‌గఢ్‌ రాజు నితీష్‌ గంగదేవ్‌ భాజపాలో అగ్రనేత. పశ్చిమ ఒడిశాలో ఆయనకు ఆదరణ ఉంది. గతసారి ఆయన సంబల్‌పూర్‌ నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలిచారు. కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఈసారి కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ సంబల్‌పూర్‌ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. ప్రచారం ముమ్మరమైనా నితీష్‌ ఎక్కడా కనిపించడం లేదు. రాజపరివారంలో కలతలు నెలకొన్నాయన్న వార్తలూ వినిపిస్తున్నాయి. భార్య అరుంధతీ దేవితో ఆయనకు సత్సంబంధాలు లేవన్న చర్చ నడుస్తోంది. మరోవైపు పశ్చిమంలో పుంజుకుంటున్న భాజపాను ఎదుర్కోవడానికి నవీన్‌ సరికొత్త ఎత్తుగడ వేశారు. నితీష్‌ భార్య అరుంధతీ దేవిని దేవ్‌గఢ్‌ అసెంబ్లీ అభ్యర్థిగా నిలిపారు. దీంతో సంబల్‌పూర్‌ రాజకీయాలు వేడెక్కాయి. దేవ్‌గఢ్‌ అసెంబ్లీ సెగ్మెంటు సంబల్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.


కలతలు లేవ్‌

తమ కుటుంబంలో కలతలు లేవనే వ్యాఖ్యలను అరుంధతీ కొట్టిపారేశారు. తన భర్త నితీష్‌ అస్వస్థతకు గురైనందున క్రియాశీలకంగా లేరని భువనేశ్వర్‌లో విలేకరులకు చెప్పారు. తన తరఫున ఆయన ప్రచారం చేస్తారని వివరించారు.


ఆయన మద్దతు మాకే

రోవైపు దేవ్‌గఢ్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే, భాజపా అభ్యర్థి సుభాష్‌చంద్ర పాణిగ్రహి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... నితీష్‌గంగదేవ్‌ భాజపాలో ఉన్నారని, ఆయన మద్దతు తమకే ఉందని చెప్పారు. రాణి అరుంధతీకి భాజపాలో సభ్యత్వం లేదని, ఆమె బిజద అభ్యర్థి అయినా ప్రభావం ఉండదని, దేవ్‌గఢ్‌వాసులు కమలానికి అనుకూలంగా ఉన్నారని వివరించారు. ఈ నేపథ్యంలో నితీష్‌ వైఖరి ఎలా ఉండబోతోందన్న చర్చ సంబల్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని