logo

అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ

కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్‌గ్రోవ్‌ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం.

Updated : 24 Apr 2024 06:58 IST

బితరకనికలో అదనంగా 39 మడ అడవి పక్షుల గుర్తింపు

మడ అడవి పక్షి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్‌గ్రోవ్‌ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. ఈమేరకు గణాంకాల నివేదికను అటవీశాఖ అధికారులు సోమవారం విడుదల చేశారు. వాటి ప్రకారం.. 2023లో బితర్‌కనికలో 179 మడ అడవి పక్షులను గుర్తించారు. ప్రస్తుతం వీటి సంఖ్య 218కి చేరుకుంది. 80మంది అటవీ శాఖ సిబ్బంది పాల్గొని ఆదివారం వీటి గణన చేపట్టారు. రాజ్‌నగర్‌, డంగముల, మహాకల్పద, గహిర్‌మెట్ట, కుజంగ్‌ అటవీ రేంజ్‌ అధికారుల పర్యవేక్షణలో వీరంతా ఉద్యానవనంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యానవన అటవీ సంరక్షణ సహాయక ఛీప్‌ (ఏసీఎఫ్‌) మానస దాస్‌ మాట్లాడుతూ బితరకనికలో ఉన్న మడ అడవులు, అన్ని నీటి వనరులను జల్లెడ పట్టి వీటి లెక్కింపు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఆకర్షణీయం.. వీటి ప్రత్యేకం: వివిధ రంగులతో చిన్న పరిమాణంలో ఉన్న ఈ పక్షులు ఆకర్షణీయంగా కనిపించడమే వీటి ప్రత్యేకత. తల ఊదా రంగులో ఉండి, నలుపు ముక్కు, తెల్లని రంగు మెడ, పచ్చ, నీలం రంగులు కలిసిన రెక్కలు, పసుపు రంగు పొట్ట, ఎరుపు రంగుతో కూడిన కాళ్ల పైభాగంతో ఈ పక్షి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. చిన్న చిన్న కీటకాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయని వీటి పరిశోధకురాలు శుభదర్శిని ప్రధాన్‌ పేర్కొన్నారు. ఈ వలస పక్షి శాస్త్రీయ నామం మేఘారించ పిట్ట అని ఆమె వెల్లడించారు. వీటి సంతతి వృద్ధికి ఏప్రిల్‌-ఆగస్టు అనువైన కాలంగా ప్రధాన్‌ స్పష్టం చేశారు. మానవ ఆవాసాలకు దూరంగా ఉండడంతోపాటు ఉద్యానవనంలో సమృద్ధిగా ఆహారం లభించడం వీటి సంతతి పెరుగుదలకు కారణాలుగా నిలుస్తున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు