logo

జగన్‌ చెప్పారంటే.. చేయరంతే!

ప్రతి ఒక్కరి గుండెచప్పుడు విన్నా.. ప్రజల కన్నీళ్లను చూశా.. సమస్యలన్నీ తీరుస్తా.. అని పాదయాత్రలో హామీల వర్షం కురిపించిన సీఎం జగన్‌ గద్దె ఎక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు.

Published : 23 Apr 2024 03:28 IST

ప్రతి ఒక్కరి గుండెచప్పుడు విన్నా.. ప్రజల కన్నీళ్లను చూశా.. సమస్యలన్నీ తీరుస్తా.. అని పాదయాత్రలో హామీల వర్షం కురిపించిన సీఎం జగన్‌ గద్దె ఎక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ఆయన మాటలు నమ్మిన జనానికి కన్నీరే మిగిల్చారు. కనీసం ప్రధాన సమస్యలు పరిష్కరించని నేత ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం మళ్లీ ఎలా వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

న్యూస్‌టుడే, బొబ్బిలి, గ్రామీణం, గజపతినగరం, తెర్లాం, బాడంగి, రామభద్రపురం

రోగులకు అష్టకష్టాలు

గజపతినగరం ప్రభుత్వాసుపత్రిలో ఉత్తమ సేవలు అందించి, వంద పడకలుగా తీర్చిదిద్దుతామని జగన్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం కనీసం రోగులు కూర్చోవడానికి చోటు లేదు. రక్తపరీక్షలకు గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి. నాలుగేళ్ల క్రితం రూ.17 కోట్లతో చేపట్టిన వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఒక్క గదిని పూర్తిచేసి సేవలు అందించలేకపోయారు. పాత భవనంలోనే చాలీచాలని పడకలు, గదులు, వైద్యంతో రోగులు అవస్థలు పడుతున్నారు.

50 పడకలు ఎక్కడ?

బొబ్బిలి నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న సామాజిక ఆసుపత్రిలో వసతి సమస్య వెంటాడుతోంది. పేరుకు 50 పడకలు అయినా.. 30 మంచాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 20 వేయాలంటే వార్డులు లేవు. సుమారు రూ.కోటిన్నర అంచనా వ్యయంతో కొత్త భవనం నిర్మించారు. వార్డులు మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో పూర్తిస్థాయిలో రోగులకు సేవలు అందడం లేదు. కొన్ని సందర్భాల్లో రిఫర్‌ చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీన్ని 100 పడకులకు విస్తరించాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.

గాలికి వదిలేశారు

బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు లేవు. ఈ రెండింటి ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లినా.. ఇంతవరకు వాటి ఊసేలేదు. దీంతో దాదాపు 3,000 మంది విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు చెల్లించి, చదువుతున్నారు. అలాగే బొబ్బిలి పట్టణానికి రూ.94 కోట్లతో సువర్ణమఖి నది నుంచి తాగునీరు తీసుకువచ్చేందుకు తెదేపా హయంలో భూమిపూజ చేశారు. ఐదేళ్లు అవుతున్నా ఈ ప్రభుత్వం 10 శాతం పనులు కూడా చేయలేదు. పట్టణంలో బిందెడు నీటి కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది.

రైతుల కన్నీళ్లు

రామభద్రపురంలోని పెద్దగెడ్డ జలాశయం నుంచి బాడంగి మండలానికి సాగునీరు అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. పరిశీలించి, న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. ఇదే పూర్తయితే కేవలం వర్షాధారంతో పంటలు సాగు చేస్తున్న బాడంగిలోని రైతుల కష్టాలు తీరుతాయి. సుమారు 2,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. బొబ్బిలి మండలం నారాయణప్పవలస వద్ద 15 ఏళ్ల క్రితం నిర్మించిన కంచరగెడ్డ జలాశయం అసంపూర్తిగా ఉండిపోయింది. ఈ ప్రభుత్వం రూ.2 కోట్లతో మిగులు పనులు పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు పంపినా, ఫలితం లేదు. దీంతో సుమారు 700 ఎకరాలకు సాగునీరు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇప్పటివరకు దిక్కులేదు

గజపతినగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలు, సిబ్బందిని సిద్ధం చేస్తామని పాదయాత్రలో జగన్‌ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనంలోనే డిగ్రీ కాలేజీ నడుస్తోంది. చాలీ చాలని గదుల్లో బోధన సాగుతోంది. 2020లో డిగ్రీ కళాశాలను ప్రారంభించగా.. 2023 వరకు అధ్యాపకుల పోస్టులు మంజూరు చేయకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి డిప్యుటేషన్‌ విధానంలో వచ్చి అరకొరగా తరగతులు నిర్వహించారు. దీంతో ప్రారంభంలో 175 మంది చేరగా.. ఇప్పుడు ఆ సంఖ్య 100కు పడిపోయింది.

కీలకమైనా నిర్లక్ష్యమేనా

బొబ్బిలిలోని పారాది వద్ద పురాతన వంతెనను తిరిగి నిర్మించేందుకు తెదేపా హయాంలో సుమారు రూ.10.50 కోట్లు మంజూరయ్యాయి. ఒడిశాకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంతవరకు ఈ పనులు చేపట్టలేదు. ఇటీవల వంతెన కుంగిపోతే దాదాపు ఆరు నెలలపాటు భారీ వాహనాల రాకపోకలను నిలిపేశారు. రామభద్రపురం నుంచి తెర్లాం మీదుగా వీటిని మళ్లించడంతో ఆ రహదారులన్నీ ఛిద్రమైపోయాయి. నదిలో తాత్కాలికంగా అప్రోచ్‌ రహదారి నిర్మించి వాహనాలు తిరిగేలా చర్యలు తీసుకున్నారే తప్ప శాశ్వత పనులు లేవు.

మాయ మాటలే..

బాడంగి మండలం గొల్లాది వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఐదేళ్లు పూర్తయినా.. ఒక్క అడుగు పడలేదు. వర్షాకాలం వస్తే సుమారు 20 గ్రామాల ప్రజలు నియోజకవర్గ కేంద్రానికి రావడానికి నరకం చూస్తున్నారు. బొబ్బిలి మండలం రాముడువలస, తెర్లాం మండలం లోచర్ల వద్ద ఎత్తిపోతల పథకాలు హామీల్లో కొట్టుకుపోయాయి. తెర్లాం మండలం కుసుమూరు వద్ద వేగావతిపై వంతెన నిర్మాణ పనులకు 2022న రూ.12.50 కోట్లతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇంతవరకు పనులు ప్రారంభించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు