logo

భజన బృందం మాట్లాడదేం!

పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు.

Published : 25 Apr 2024 02:48 IST

ఉత్తర్వులంటూ మంత్రికి సన్మానాలు
కమీషన్ల కక్కుర్తితో ఆగిన టి5 కాలువ పనులు

పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. ఇలాంటి ప్రాంతానికి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఓ వరప్రదాయని. నల్లమల సాగర్‌ నుంచి ప్రాజెక్టు ఎడమ కాలువ తీగలేరు ద్వారా నియోజకవర్గంలోని 66 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లో వెలిగొండ పూర్తిచేసి నీరిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా పాలకులు.. అయిదేళ్లు కాలం వెళ్లదీశారు. ఎన్నికలకు ముందు ఉత్తుత్తి శిలాఫలకాలు, ప్రారంభోత్సవాలంటూ హడావుడి చేశారు. నీళ్లు లేని సొరంగాలకు రిబ్బన్లు కత్తిరించి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పుల్లలచెరువు మండలంలో ప్రత్యక్షంగా 11,500 ఎకరాలకు సాగునీరిచ్చే టి5 బ్రాంచ్‌ కాలువ నిర్మాణానికీ తిలోదకాలిచ్చారు. 

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం

గతంలోనే కదిలిన దస్త్రం...: వై.పాలెం మండలం వీరాయపాలెం నుంచి ప్రారంభమయ్యే టి5 కాలువ నిర్మాణం కోరుతూ రైతులు ఆందోళనలు చేశారు. దీంతో అప్పటి తెదేపా ప్రభుత్వం సర్వే, అంచనా రూపొందించేందుకు నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని 2018లో ప్రాజెక్ట్స్‌ ఈఎన్‌సీ అనుమతుల కోసం పంపారు. అనంతరం ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయాన్ని 2019 ఎన్నికల వేళ వైకాపా అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్‌ హామీలిచ్చారు. గెలిచిన ఆరు నెలల్లోనే టి5 కాలువకి నిధులు మంజూరు చేయించి పనులు పూర్తిచేయిస్తానంటూ ఊదరగొట్టారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

మంత్రిని పొగడ్తల్లో ముంచెత్తి...: వైకాపా ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత టి5 నిర్మాణానికి రూ.83.78 కోట్లతో పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటివరకు తీగలేరు కాలువ పనులు చేస్తున్న జయప్రకాష్‌, గాయత్రి కంపెనీలను కాకుండా కొత్త గుత్తేదారుకు అప్పగించాలని టెండర్లు పిలిచారు. దీంతో సంబరపడిన రైతులు, వైకాపా నాయకులు మంత్రి సురేష్‌కు సన్మానాలు చేశారు. ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. అనంతరం గతేడాది ఏప్రిల్‌లో ఇరిగేషన్‌ అధికారులు టెండర్లు పిలిచారు. పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ఆ ఊసే ఎవరూ పట్టించుకోలేదు.

రైతుల నోట్లో మట్టి...: కాలువ టెండర్లు దక్కించుకుని పనులు చేయాలనుకుని ఓ సంస్థ ముందుకొచ్చింది. ఇక్కడి ప్రజాప్రతినిధి ఒకరు దాదాపు పది శాతం కమీషన్‌ అడిగడంతో మిన్నకుండి పోయింది. ప్రభుత్వం బిల్లులు ఇస్తుందో లేదో నమ్మకం లేక పనులు చేయడమే కష్టమైన తరుణంలో కమీషన్లు ఎక్కడి నుంచి తెస్తామంటూ ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద సదరు సంస్థ ప్రతినిధులు తేల్చి చెప్పి వెళ్లిపోయారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తిచేయిస్తానంటూ ప్రగల్బాలు పలికిన మంత్రి సురేష్‌ మాటలతో అయిదేళ్లు కాలయాపన చేస్తూ వచ్చారు. వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చే టి5 కాలువ పనులు చేపట్టకుండా రైతుల నోట్లో మట్టి కొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు