logo

రూ. 96.69 కోట్లు.. 73 రోజులు

ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాకు వస్తున్న మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు ఏటా పూర్తిస్థాయిలో సద్వినియోగం కావడం లేదు. గతేడాది రూ.57.49 కోట్ల నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. ఈసారీ అదే పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Published : 18 Jan 2022 06:20 IST

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

పాధి హామీ పథకం ద్వారా జిల్లాకు వస్తున్న మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు ఏటా పూర్తిస్థాయిలో సద్వినియోగం కావడం లేదు. గతేడాది రూ.57.49 కోట్ల నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. ఈసారీ అదే పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ కేటాయించిన రూ.262.03 కోట్ల నిధుల్లో రూ.165.34 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. మిగిలిన రూ.96.69 కోట్లు ఖర్చు చేయడానికి మార్చి 31 వరకూ అంటే 73 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఆలోపు మిగిలిన నిధులు ఖర్చు కాకపోతే ఇవీ వెనక్కి వెళ్లిపోనున్నాయి.

జిల్లాలో ఇదీ పరిస్థితి

* వంశధార ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల పరిధిలోని కాలువలు, డిస్ట్రిబ్యూటరీల్లో 119 పనులకు రూ.15 కోట్లు ఖర్చు చేసుకోవడానికి గతంలో కలెక్టర్‌ అనుమతిచ్చారు. ఆ పనులూ ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ప్రారంభమే కాలేదు.

* ఒక్కొక్క దానికీ రూ.25 లక్షల చొప్పున ఖర్చు చేసి జిల్లాలో 150 చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో ఈ పనుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది.

* సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ కేంద్రాలు, మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్లు తదితర భవన నిర్మాణాలూ ఈ పథకం కిందే సాగుతున్నాయి. వీటిలో నాలుగో వంతు కూడా పూర్తయిన దాఖలాల్లేవు.


వీరఘట్టం తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రమిది. పునాదుల వరకు నిర్మించి వదిలేశారు. ఉపాధి హామీ కాంపొనెంట్‌ నిధులతో జరుగుతున్న ఈ పనులు నిలిచిపోయి ఏడాదైంది. అతీగతీలేదు. వీరఘట్టంలో మొత్తం 4 రైతు భరోసా కేంద్రాలకు ఒకటి పునాదులు తీసి వదిలేశారు. మరొకటి పునాదులు వేసి విడిచిపెట్టారు. మిగతా రెండు ఇంతవరకు పనులే ప్రారంభించలేదు.


పాలకొండ మండలంలోని అంపిలి గ్రామంలో నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన గ్రామ సచివాలయ భవనమిది. ఏడాదిన్నర కిందట రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభించారు. ఇందులో ఉపాధి హామీ వ్యయమే అధికం. కానీ నేటికీ పనులు పూర్తికాలేదు. గచ్చులు, వైరింగ్‌, రంగులు తదితర పనులు మాత్రమే చేయాల్సి ఉంది. పని జరిగినా బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం కారణంగా నిధులు ఖర్చు కావడం లేదు.


నిలిచిపోవడానికి కారణాలెన్నో..

* క్షేత్రస్థాయిలో పనులన్నీసర్పంచుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఒక గ్రామంలో నాలుగైదు భవనాల నిర్మాణం జరుగుతోంది. ఒక భవన పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాకపోతే ఇతర పనులు నిలిపేస్తున్నారు. ఈ సమస్య వల్లే అధిక శాతం పనులు జరగక, నిధులు ఖర్చు చేయలేకపోతున్నారు.

* అంచనాలు రూపొందించిన సమయానికి ఉన్న ధరలు, పనులు ఆమోదం పొంది ప్రారంభానికి నోచుకునే సమయానికి ఉండే ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. ధరల పెరుగుదల వల్ల పనులు చేయడం నష్టంగా మారుతోందని గుత్తేదారులు వెనుకడుగు వేస్తున్నారు. అధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు.

* ప్రభుత్వ భవనాలు, జగనన్న కాలనీలు, నాడు-నేడు పనులు ఒకేసారి జరుగుతుండటంతో సిమెంటు, ఇసుక, ఐరన్‌ కొరత ఏర్పడింది. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న వారికే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి మెటీరియల్‌ సరఫరా చేస్తున్నారు. దీంతో గుత్తేదారులకు సక్రమంగా లభించడం లేదు.

* క్షేత్రస్థాయిలో కొన్నింటి పనులు వేగంగానే జరుగుతున్నా ఆ మేరకు ఎంబుక్‌లో రికార్డు కాకపోవడం, బిల్లులు రాకపోవడం కారణంగా దాదాపు పూర్తయిన భవన నిర్మాణాలనూ గుత్తేదారులు నిలిపేస్తున్నారు.


అధిగమించాలంటే..: వీటన్నిటినీ అధిగమించి పనులు ముందుకు సాగి నిధులు సకాలంలో ఖర్చవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సక్రమంగా విడుదల చేయాలి. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించాలి. సామగ్రి కొరత లేకుండా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి చర్యలు తీసుకోవాలి. అప్పటికీ పనులు చేయని గుత్తేదారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి. అప్పుడే పనులు ఊపందుకుని నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయడానికి ఆస్కారం ఉంటుంది.


సమస్యలు పరిష్కరిస్తున్నాం: గతేడాదిలా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో నిత్యం పరిశీలిస్తున్నాం. కొన్నిచోట్ల బిల్లులు చెల్లింపులు, మరికొన్ని చోట్ల సామగ్రి కొరత పేరుచెప్పి పనులు ఆలస్యం చేస్తున్నారు. వారితో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. ఇప్పుడు బిల్లులు విడుదలవుతున్నాయి. మెటీరియల్‌ కొరతా దాదాపు తీరింది. శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనుల పురోగతిపై ఉన్నతాధికారులూ సమీక్షలు చేస్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా తక్షణం పరిష్కారం చూపుతున్నారు.

- హెచ్‌.కూర్మారావు, డ్వామా పీడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని