logo

మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..

తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు.

Published : 19 Apr 2024 04:40 IST

బండారు ప్రకటన

ర్యాలీగా వస్తున్న బండారు, చిత్రంలో రామానాయుడు

మాడుగుల, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. చంద్రబాబుతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఉదయాన్నే మాట్లాడిన తర్వాతే.. మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని తెదేపా నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు మాడుగుల వచ్చినట్లు పేర్కొన్నారు. పరవాడ మండలం వెన్నెలపాలెంలోని స్వగృహం నుంచి ఆయన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, మాడుగుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పీవీజీ కుమార్‌తో కలిసి బుధవారం మాడుగుల మండలం ముకుందపురం చేరుకున్నారు. అక్కడి నుంచి అనకాపల్లి పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ సోదరుడు సురేశ్‌నాయుడుతో భారీ ర్యాలీగా మాడుగుల చేరుకున్నారు. మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం తులసీ కల్యాణ మండపంలో తెదేపా నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రామానాయుడు, పీవీజీ కుమార్‌ తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తామని చెప్పడంతో మాడుగుల నుంచి పోటీ చేసే అవకాశం చంద్రబాబు ఇచ్చారన్నారు. అలమండ, చీడికాడలో తాతగారి ఇల్లు, అమ్మ తరఫున బంధువులు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. మాడుగులను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతానని చెప్పారు. నాయకులు అప్పలరాజు, జగ్గారావు, దేముడు, ముసిలినాయుడు, కొండబాబు, రమణమ్మ, రాజకుమార్‌, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

ర్యాలీలో రామానాయుడు బులెట్‌ నడుపుతుండగా, బండారు వెనుక కూర్చున్నారు. మాడుగుల బస్టాండు సమీపంలో బులెట్‌ సేఫ్టీ రాడ్డు ముందు వెళ్తున్న ప్రచార రథం వెనుక భాగానికి ఇరుక్కుంది. డీజే శబ్దం వల్ల రథాన్ని ఆపమని కేకలు వేసినా డ్రైవర్‌కు వినిపించలేదు. ఈలోగా సేఫ్టీ రాడ్డు ఊడిపోవడంతో ప్రమాదం తప్పింది

బంధుగణమంతా ఇక్కడే..

కె.కోటపాడు: నాటకీయ పరిణామాల మధ్య కూటమి అభ్యర్థిగా మాడుగుల నుంచి మాజీ మంత్రి బండారు బరిలో దిగనున్నారు. బండారు తాత స్వగ్రామం దేవరాపల్లి మండలం ఎం.అలమండ. ఇదే మండలం కొత్తపెంటలోనూ బంధువులున్నారు. కె.కోటపాడు మండలం వారాడ సంతపాలెం బండారు అత్తారిల్లు. ఎం.అలమండ ప్రాథమిక పాఠశాలలో ఆయన 5వ తరగతి వరకు చదివారు. పరవాడ ఎమ్మెల్యేగా మూడుసార్లు, పెందుర్తి ఎమ్మెల్యే ఒకసారి ఎన్నికయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో పురపాలక శాఖా మంత్రిగా పనిచేశారు. గొట్లాం, శ్రుంగవరం, కొత్తభూమి, మర్రివలస, పాతవలసలో బండారు శుక్రవారం ఇంటింటా ప్రచారం చేస్తారని రామానాయుడు, పీవీజీ కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని