logo

ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!

బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే.

Updated : 23 Apr 2024 05:39 IST

చెరువులపై కన్నేసిన అక్రమార్కులు

ఖిలావరంగల్‌లో అద్దె ట్యాంకరు ద్వారా నీటి సరఫరా

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌, జులైవాడ, భీమారం, భీమదేవరపల్లి: బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. ఇలాంటి ప్రమాదమే వరంగల్‌ మహా నగరానికీ పొంచి ఉంది. ఇప్పటికే దేశాయిపేట, ఎంహెచ్‌ నగర్‌, వీవర్స్‌ కాలనీ, కాశీబుగ్గ , లేబర్‌ కాలనీల్లో అద్దె నీటి ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..
వరంగల్‌ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటల్లో ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా పాగా వేస్తున్నారు. శిఖం భూముల్లో భారీ భవంతులు వెలుస్తున్నాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జారీ చేసిన ఫుల్‌ ట్యాంకు లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆక్రమణలకు రాజకీయ అండ దండలుండటంతో కబ్జాదారులు రెచ్చి పోతున్నారు.

హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లోని చింతల చెరువు 69 ఎకరాల్లో విస్తరించి ఉంది. 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది. ఓ ప్రజాప్రతినిధి తన రాజకీయ పలుకుబడితో చాలా వరకు కబ్జా చేశారు. ఓ వైద్యుడు నాలుగెకరాలు ఆక్రమించారు. పలువురు స్థిరాస్తి వ్యాపారులు శిఖం భూముల్లో వేసిన ప్లాట్లను కొనుగోలు చేసినవారు ఇళ్లు నిర్మించుకున్నారు. రెండేళ్ల కిందట ఒకరు చింతల చెరువు తూమునే మూసి వేశారు.
వరంగల్‌ దేశాయిపేట చిన్నవడ్డ్డెపల్లి చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారం 120 ఎకరాల్లో ఉండాలి. చుట్టూ భవనాలు వెలిశాయి. 40 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది.

హనుమకొండ నగరంలో..

* హనుమకొండ పెద్ద వడ్డెపల్లి చెరువు 160 ఎకరాలు ఉండాలి. అందులో సుమారు 30 నుంచి 40 ఎకరాల వరకు కబ్జాలకు గురైంది. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారు. చెరువులో నీళ్లుంటే పరిసరాల్లోని 50 కాలనీల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి.
* కాజీపేట బంధం చెరువు 40 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుతం 20-25 ఎకరాలకే పరిమితమైంది. ఎఫ్‌టీఎల్‌ హద్దులు దాటేసి భవన నిర్మాణాలు జరిగాయి. తాజాగా ఐదు ఎకరాల స్థలాన్ని చదును చేస్తున్నారు.
* హసన్‌పర్తిలోని చెన్నంగి చెరువు 90 శాతానికి పైగా ఆక్రమణకు గురైంది. ఓ ప్రజాప్రతినిధితో పాటు పలువురు స్థిరాస్తి వ్యాపారులు కబ్జా చేశారు.
* చింతగట్టులోని ఎల్లమ్మ చెరువుదీ అదే పరిస్థితి. 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు 20 ఎకరాలకు కుచించుకుపోయింది. ఇటీవల పలువురు 20 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు అందులో రాత్రికి రాత్రే మొరం పోశారు.
* భీమదేవరపల్లి మండలం వంగర, మాణిక్యాపూర్‌, గట్లనర్సింగాపూర్‌, ముస్తఫాపూర్‌, కొత్తకొండ, ముత్తారం తదితర గ్రామాల్లోని చెరువుల్లో వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి.
* రంగశాయిపేట బెస్తంచెరువు పదెకరాల వరకు ఆక్రమించారు.
* జక్కలొద్ది శివారు మద్దెకుంట స్థలాల్లో ప్లాట్లు చేసేశారు.
* ఉర్సు రంగసముద్రం చెరువులో 20 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. * అమ్మవారిపేట దామెర చెరువు సగం వరకు ఆక్రమించారు. ప్లాట్లు చేసి అమ్మేశారు.
నర్సంపేట డివిజన్‌లోని మండలాల వారీగా చూస్తే చెన్నారావుపేటలో 45, దుగ్గొండిలో 108, నెక్కొండలో 27, నల్లబెల్లిలో 58, ఖానాపురంలో 18, నర్సంపేటలో 69 చెరువులు, కుంటలున్నాయి. వీటిలో దాదాపు అన్ని ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లాయి.

కీలకం భద్రకాళి..

వరంగల్‌-హనుమకొండ నగరాలకు వారిధి భద్రకాళి చెరువు. రెవెన్యూ దస్త్రాల ప్రకారం 253.55 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలి. 70 ఎకరాల వరకు ఆక్రమించారు. 1996లో భద్రకాళి ఫోర్‌ షోర్‌ బండ్‌ (చెరువు చుట్టూ మట్టికట్ట) ఏర్పాటుతో కొత్త కాలనీలు వెలిశాయి. హనుమకొండ పద్మాక్షిగుట్ట రోడ్డులో మరో 30 ఎకరాలకు అక్రమార్కులు ఎసరు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో మినీ బండ్‌ ఏర్పాటుకు జీవో జారీ చేయడం వెనుక కూడా రాజకీయ నాయకులున్నారని తెలిసింది.
 భద్రకాళి చెరువులో నీళ్లు ఉంటే నగరంలో సుమారు 250-300 కాలనీల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి.
భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం సర్వే నెంబరు 32లో హనుమకొండ-సిద్దిపేట ప్రధాన రహదారికి ఆనుకొని 45.34 ఎకరాల విస్తీర్ణంలో ఊర చెరువు ఉంది. కొందరు 25 ఎకరాలకుపైగా కబ్జాచేసి సాగు చేసుకుంటున్నారు. కొందరికి ఏక్‌ సాల్‌ పట్టా ఉండగా.. సమీపంలో పొలాలు ఉన్నవారు సైతం చెరువు భూముల్లోకి చొచ్చుకొని వచ్చారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం శిఖంలో తవ్విన తాగునీటి బావి చుట్టూ కొందరు వరి పంటలు సాగు చేశారు.
గడిచిన మూడేళ్లలో హసన్‌పర్తి మండలం భీమారంలోని సామల చెరువు శిఖం భూములు 70 శాతానికి పైగా ఆక్రమించారు. 70 ఎకరాల్లో ఉండాల్సిన చెరువు 28 ఎకరాలకు కుచించుకుపోయింది. ఓ ప్రజాప్రతినిధితో పాటు పలువురు స్థిరాస్తి వ్యాపారులు రెవెన్యూ అధికారుల అండదండలతో చెరువు భూములను కబ్జా చేశారు. అక్రమ నిర్మాణాలూ వెలిశాయి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు