logo

కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు

కేఎంసీ(కాకతీయ మెడికల్‌ కాలేజీ)లోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు.

Published : 24 Apr 2024 03:05 IST

వైద్యం కోసం బారులుతీరిన అతివలు

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: కేఎంసీ(కాకతీయ మెడికల్‌ కాలేజీ)లోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. ఓపీ విభాగంలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన వైద్యుల్లో కొందరు ఉదయం 10.30 గంటల తర్వాత ఆలస్యంగా రావడంతో గంటల కొద్ద్దీ నిరీక్షించలేక కొందరు లోపలికి వెళ్లేందుకు తోసుకున్నారు. వారిని నిలువరించేందుకు సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపీ సేవలకు మొత్తం 699 మంది రాగా.. అందులో న్యూరాలజీకి సంబంధించి 339 మంది ఉన్నారు. వారిలో నరాలు, తిమ్మిర్లు, తలనొప్పి, మైగ్రేన్‌, నడుంనొప్పి, పక్షవాతం, వంటి సమస్యలతో ఎక్కువ మంది వచ్చారు. మిగిలిన 355 మందిలో నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యం కోసం వచ్చిన వారు ఉన్నారు.

ఏసీలు పనిచేయక నిలిచిన శస్త్రచికిత్సలు

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏసీలు పనిచేయడం లేదు. దీంతో ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. గత నెల 2న ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో ఏసీలు పనిచేయక రోగులు పడుతున్న ఇబ్బందులపై ఈనాడులో ‘పెద్దాసుపత్రి ఏసీలు పనిచేయించండి’ శీర్షికతో కథనం ప్రచురితం కాగా.. డీఎంఈ స్పందించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. అయినా ఇప్పటికీ అదే పరిస్థితి. దీంతో ఆపరేషన్‌ థియేటర్లతో పాటు ఐసీయూ వార్డులు, డయాలసిస్‌ వార్డులో ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఏసీలు పనిచేయక పోవడం వల్ల వైద్యులు శస్త్రచికిత్సలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఆసుపత్రిలో రెండురోజులుగా అవి నిలిచిపోయాయి. ఏసీల మరమ్మతు, నిర్వహణకు రూ.30 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశముంది. నిధుల కొరత వల్లనే మరమ్మతులు చేయించలేకపోతున్నట్లు తెలిసింది. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసినట్లయితే పేదలకు ఉచిత వైద్యం అందే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని