logo

దూరాభారమైనా బాధ్యతగా.. భావితరాలకు స్ఫూర్తిగా

ఇది వాజేడు మండలం బొల్లారం గ్రామం. ఇక్కడ 219 మంది ఓటర్లు ఉండగా, వీరు 6 కి.మీ దూరంలోని ఆర్‌.గుంటపల్లి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేస్తున్నారు. ఇదే మండలంలో గుట్టలపై దట్టమైన అడవిలో ఉన్న పెనుగోలు గ్రామంలో 22 మంది ఓటర్లు ఉంటారు.

Published : 13 May 2024 01:41 IST

ఓటుహక్కు వినియోగంలో స్ఫూర్తిగా గ్రామీణులు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం మారుమూల అటవీ ప్రాంతంలోని తిప్పాపురం గ్రామమిది. ఐదేళ్ల కిందట పంచాయతీగా ఏర్పాటైంది. దీని పరిధిలో పెంకవాగు, కలిపాక, కొత్తగుంపు గ్రామాలున్నాయి. దాదాపు 433 మంది ఓటర్లున్నా.. పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయలేదు. వీరంతా 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని ఆలుబాక జడ్పీఎస్‌ ఉన్నత పాఠశాల కేంద్రంగా ఓటు హక్కును వినియోగించుకుంటారు.

ది వాజేడు మండలం బొల్లారం గ్రామం. ఇక్కడ 219 మంది ఓటర్లు ఉండగా, వీరు 6 కి.మీ దూరంలోని ఆర్‌.గుంటపల్లి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేస్తున్నారు. ఇదే మండలంలో గుట్టలపై దట్టమైన అడవిలో ఉన్న పెనుగోలు గ్రామంలో 22 మంది ఓటర్లు ఉంటారు. ఎన్నికలేవైనా వీరంతా సద్దికట్టుకుని 16 కి.మీ కాలినడకన కొండలు దాటొచ్చి జంగాలపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి వస్తారు.

ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపూర్‌, ములుగు మండలాల్లో అనేక పల్లెలు పోలింగ్‌ కేంద్రాలకు దూరంగానే ఉన్నాయి. నడక మార్గం, ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, ఇతర ప్రత్యామ్నాయ సదుపాయాల మధ్య ప్రతి ఎన్నికల్లోనూ ఓపికతో కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ‘అందరికీ అందుబాటులో పోలింగ్‌’ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఈ పల్లెల చెంత పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు జరగడం లేదు. వజ్రాయుధంలాంటి ఓటును వినియోగించుకుని తమలో చైతన్యాన్ని చాటిచెబుతున్న ప్రాంతాల్లో అవకాశం ఉన్న చోటల్లా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలనేది సామాజిక కార్యకర్తల నినాదం.

వెంకటాపురం, న్యూస్‌టుడే: ఓటు.. ఐదేళ్లకోసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో జిల్లాలోని గ్రామీణులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొండలు, గుట్టలు, వాగులు దాటుతూ ఎంత దూరమున్నా.. భారంగా భావించకుండా ఓటు వేస్తున్నారు. వేలికి సిరా చుక్క అంటించుకుని మురిసిపోతున్నారు.  ఎన్నికల సమయంలో తప్ప ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వారి వైపు కన్నెత్తి చూడకపోయినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ధరిచేరకున్నా బాధ్యతగా ఓటేస్తున్నారు.

  • మంగపేట మండలంలోని రేగులగూడెం గ్రామంలో దాదాపు 150 మంది ఓటర్లున్నారు. గతంలో దాదాపు 12 కి.మీ దూరంలో ఉన్న కొత్తూరుమొట్లగూడెంలో ఓటు హక్కు వినియోగించుకునే వారు. ఈ ఏడాది తొండ్యాల-లక్ష్మీపురంలో కొత్తగా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది రేగులగూడెం ప్రజలకు 4 కి.మీ దూరంలో ఉంది. ఎలాంటి రహదారి సదుపాయం లేకపోయినా.. కాలినకడన వచ్చి వేలికి సిరా చుక్కను అంటించుకుంటున్నారు.
  • ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామంలో 364 మంది ఓటు హక్కు కలిగిన వారున్నారు. వీరంతా జంపన్నవాగు దాటొచ్చి 3 కి.మీ దూరంలో ఉన్న ఆకులవారిఘనపురం పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేస్తున్నారు. ఇదే మండలంలోని ఎక్కెల పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉన్న పలు గ్రామాల వారు కూడా భారంగా భావించకుండా పోలింగ్‌లో పాల్గొంటున్నారు.
  • వెంకటాపూర్‌ మండలం బూరుగుపేట పోలింగ్‌ కేంద్రంలో అందుగులమేది, చక్రవర్తిపల్లె, రామకృష్ణాపూర్‌ గ్రామాలకు చెందిన దాదాపు 800 మంది ఓటర్లు ఏళ్లుగా ఓటేస్తున్నారు. సుమారు 3 కి.మీ దూరంలో ఉన్నా.. దూరాభారం అనుకోకుండా వచ్చి ఓటుతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ములుగు మండలంలోని అబ్బాపూర్‌ పోలింగ్‌ కేంద్రం పరిధిలో రెండు గ్రామాల ఓటర్లు ఇదే పరిస్థితి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని