satyabhama movie review: రివ్యూ: సత్యభామ.. కాజల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ టాక్‌ ఏంటి?

కాజల్‌ ప్రధాన పాత్రలో సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో వచ్చిన క్రైమ్‌, యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ మెప్పించిందా?

Updated : 25 Jun 2024 16:24 IST

Satyabhama Movie Review: చిత్రం: సత్యభామ; నటీనటులు: కాజల్‌,  నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌, రవి వర్మ, తదితరులు; సంగీతం: శ్రీచరణ్‌ పాకాల; సినిమాటోగ్రఫీ: విష్ణు బెసి; ఎడిటింగ్‌: కోదాటి పవన్‌కల్యాణ్‌; నిర్మాత: బాబీ తిక్క, శ్రీనివాస్‌ తక్కలపెల్లి; రచన, దర్శకత్వం: సుమన్‌ చిక్కాల; విడుదల: 07-06-2024

తెలుగులో సినిమాల సీజ‌న్ మొద‌లైపోయింది. వారం వారం మూడు సినిమాలు చొప్పున  ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. ఈ వారం ఆ సంఖ్య  ఇంకా ఎక్కువే. వీటిలో ఒక‌టి... ‘స‌త్య‌భామ’. నాయికా ప్ర‌ధాన‌మైన  ఈ సినిమాలో కాజ‌ల్  ప్ర‌ధాన పాత్ర పోషించారు. హిట్ సినిమాల ద‌ర్శ‌కుడు  శ‌శికిరణ్ తిక్క స‌మ‌ర్ప‌ణ‌లో, ఆయ‌న స్క్రీన్‌ప్లే ర‌చ‌న‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించాయి. మ‌రి చిత్రం ఎలా ఉంది?కాజల్‌ యాక్షన్‌ మోడ్‌లో అదరగొట్టిందా?

క‌థేమిటంటే: కె. స‌త్య‌భామ (Kajal Aggarwal) షి టీమ్‌లో ఏసీపీ స్థాయిలో ప‌నిచేస్తుంటారు. చూడటానికి శాంతంగా క‌నిపించినా, నేర‌స్థుల నుంచి నిజాలు రాబ‌ట్ట‌డంలో దిట్ట‌. త‌నకు అప్ప‌జెప్పిన కేసుల్ని అంత సుల‌భంగా వ‌దిలిపెట్ట‌దని పేరు. ర‌చ‌యిత అమరేంద‌ర్ (న‌వీన్‌చంద్ర‌)ని ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్న ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికంటే, వృత్తికే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తుంటుంది. షి టీమ్‌లో ప‌నిచేస్తున్న‌ప్పుడే హ‌సీనా అనే ఓ బాధితురాలు గృహ హింస‌ని అనుభ‌విస్తూ సాయం కోసం స‌త్య‌భామ ద‌గ్గ‌రికి వ‌స్తుంది. నీకేం కాదు, అంతా నేను చూసుకుంటాన‌ని ధైర్యం చెప్పి పంపించాక‌, భ‌ర్త చేతిలో దారుణ హ‌త్య‌కి గుర‌వుతుంది. హ‌సీనా హ‌త్య స‌త్య‌భామ‌ని ఎంతో క‌ల‌చివేస్తుంది. హ‌సీనాతోపాటు, ఎంతో మంది జీవితాల‌తో ఆడుకున్న ఆ నేర‌స్థుడిని ప‌ట్టుకునే క్ర‌మంలో స‌త్య‌భామ‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?(Satyabhama Movie Review) ఆ కేసుని ఆమె వ్య‌క్తిగ‌తంగా తీసుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ప‌రిశోధ‌న ప్ర‌ధానంగా సాగే ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. ఈ త‌ర‌హా క‌థ‌లు ఈ మ‌ధ్య తెలుగులో త‌ర‌చూ వ‌స్తున్నాయి. ఓ నేరం చోటు చేసుకుంటుంది. అది ఎవ‌రు చేశార‌నేది అంతుచిక్క‌దు. ఎలాంటి ఆధారాలు దొర‌క్కుండా అత్యంత ప‌క‌డ్బందీగా చేసిన ఆ నేరం వెన‌క గుట్టుని విప్పేందుకు ఓ పోలీస్ అధికారో లేదంటే ఓ డిటెక్టివో లేదంటే, బాధితుడో లేక అతని తాలూకూ వ్య‌క్తులో రంగంలోకి దిగుతుంటారు. ఆ క్ర‌మంలో ఎదుర‌య్యే స‌వాళ్లు,  వెలుగులోకి వ‌చ్చే అస‌లు నిజాలు, కేసు ముడి వీడే క్ర‌మం ఎలా సాగింద‌నేదే ఈ క‌థ‌ల‌కి కీల‌కం. ‘స‌త్య‌భామ‌’ కూడా ఆ తాను ముక్కే. కాక‌పోతే ఇక్క‌డ నేరం ఎవ‌రు చేశార‌నేది ముందే తెలిసిపోతుంది. అత‌న్ని వెతికి ప‌ట్టుకోవ‌డ‌మే ప‌ని. పైగా కేస్‌ని ఛేదించేది ఓ మ‌హిళా పోలీస్ అధికారి. (Satyabhama Movie Review) ఆమె కేస్‌ని వ్య‌క్తిగ‌తంగా తీసుకునే క్ర‌మంలో పండిన భావోద్వేగాలు ఈ సినిమాని కాస్త  ప్ర‌త్యేకంగా మార్చేశాయ‌ని చెప్పుకోవాలి. కొత్త క‌థేమీ కాదు కానీ,  ఇలాంటి సినిమాల‌కి క‌థ‌న‌మే కీల‌కం. మంచి ర‌చ‌యిత‌గా పేరున్న శ‌శికిరణ్ తిక్క క‌థ‌నం ప‌రంగా త‌న‌దైన ప్ర‌భావం చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌ల్లో ర‌క‌ర‌కాల అనుమానాల్ని రేకెత్తిస్తూ, చివ‌రికి ఎవరూ ఊహించ‌ని ముగింపుని ఇస్తుంటారు. ఇందులో కూడా అదే చేశారు కానీ, అనుమానాల్ని రేకెత్తించే క్ర‌మంలో ఉప‌క‌థ‌ల్లాగా కొత్త సంఘ‌ట‌న‌ల్ని, కొత్త పాత్ర‌ల్ని తెర‌పై చూపిస్తూ వెళ్ల‌డంతో అస‌లు క‌థ ప‌క్క‌దారి ప‌డుతుంది. అస‌లు నిందితుడు ఎక్క‌డా అనే ఉత్కంఠ క్ర‌మంగా స‌డ‌లిపోతూ, మ‌ధ్య‌లో వ‌చ్చే వీడియో గేమ్స్ నేప‌థ్యం, మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా, టెర్ర‌రిజం త‌దిత‌ర అంశాలు ఎక్కువ ఫోక‌స్ అవుతాయి. అయితే షి సేఫ్ యాప్ ప్రాధాన్యం గురించి చెప్పే స‌న్నివేశాలు ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి. హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్‌లో బ‌లం లేదు. (Satyabhama Movie Review) స‌త్య‌భామ‌ శ‌క్తిమంత‌మైన పోలీస్ అధికారిగా ప‌రిచ‌యం అవుతుంది కానీ... అందుకు త‌గ్గ‌ట్టుగా ఆ పాత్ర‌ని మ‌ల‌చ‌లేదు. నిందితుడినీ, ఆధారాల్ని  చేజేతులా వ‌దిలేస్తూ, మ‌ళ్లీ వాటి కోస‌మే అన్వేషించే ఆ పాత్రలో ఏ కోశానా బ‌లం, స‌హ‌జ‌త్వం క‌నిపించ‌దు. స‌త్య‌భామ త‌న ప‌రిశోధ‌న‌తో వెలుగులోకి తీసుకొచ్చిన విష‌యాల కంటే కూడా, ప‌తాక స‌న్నివేశాల్లో ఓ పాత్ర త‌నంత‌ట తాను చెప్పే విష‌యాలే ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. కొన్ని మ‌లుపులు, ప‌తాక స‌న్నివేశాలు మెప్పిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: ఎక్కువ‌గా క‌మ‌ర్షియల్ సినిమాల్లో, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా క‌నిపించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ నాయికా ప్ర‌ధాన‌మైన పాత్ర‌లో క‌నిపించ‌డం కొత్త‌గా  అనిపిస్తుంది. స‌త్య‌భామ పాత్ర‌కు తగ్గ‌ట్టుగా హుషారుగానే క‌నిపించారామె. పోరాట ఘ‌ట్టాల్లోనూ ఆమె క‌ష్టం క‌నిపిస్తుంది. న‌వీన్‌చంద్ర‌తో క‌లిసి ఓ స‌న్నివేశంలో భావోద్వేగాలు కూడా ప‌లికించింది. ఆమె పాత్ర మిన‌హా, ఇత‌ర మ‌రే పాత్ర‌కూ  ప్రాధాన్యం లేదు. ప్ర‌కాశ్‌రాజ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, నాగినీడు న‌టులున్నా వాళ్ల ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించ‌దు. మిగిలిన ఏ పాత్ర కూడా ప్ర‌భావం చూపించ‌దు. న‌వీన్‌చంద్ర ర‌చ‌యిత‌గా క‌నిపిస్తారు. ఆయ‌న‌కు న‌టించేందుకు పెద్ద‌గా ఆస్కారం దొర‌క‌లేదు. (Satyabhama Movie Review) సాంకేతికంగా సినిమా ఒకే. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ర‌చ‌న ప‌రంగా లోపాలు క‌నిపిస్తాయి. సుమ‌న్ చిక్కాల మేకింగ్‌లోనూ బిగి కొర‌వడింది. కాళికాదేవి కోపం, సీతాదేవిలోని శాంతం.. అనీ, ఆ స‌త్య‌భామ ఆయుధం చేత‌బూని యుద్ధం చేస్తే, ఈ స‌త్య‌భామ ఆయుధం వ‌దిలిపెట్టి యుద్ధం చేసిందనీ... ఇలా రైమింగ్‌తో కొన్ని సంభాష‌ణ‌లు  వినిపిస్తాయి. ఆ సంభాష‌ణ‌ల‌కి త‌గ్గ‌ట్టుగా క‌థ‌లో గాఢ‌త ఉందో లేదో చూసుకోవాల్సింది.

  • బ‌లాలు
  • + కాజల్ న‌ట‌న
  • కథలోని కొన్ని మ‌లుపులు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌, క‌థ‌నాలు
  • ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
  • చివ‌రిగా: స‌త్య‌భామ‌...  మ‌మ అనిపించే ఓ  క్రైమ్ థ్రిల్ల‌ర్ (Satyabhama Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని