logo

పుస్తకాలు లేకుండా చదువులా?

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. 

Published : 18 May 2024 04:32 IST

అయిదేళ్లుగా వింత పరిస్థితి
1 నుంచి జూనియర్‌ కళాశాలలు పునః ప్రారంభం

చింతలపూడి, న్యూస్‌టుడే: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు.  పలు కళాశాలల్లో మౌలిక వసతులు లేకపోవడం అటుంచితే వారికి ప్రాథమికంగా అవసరమైన పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని స్థితి ఉంది.  అయిదేళ్లుగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకుండానే కాలం గడిపేయడం గమనార్హం. జూన్‌ 1 నుంచి కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాదైనా అందిస్తారా? అనేది ప్రశ్నగానే మిగులుతోంది.

ఏటా అధికారులు ఇండెంట్‌ పెట్టడం వరకే పరిమితమవుతున్నారు. ఒక్క పుస్తకం ఇచ్చిన పాపాన పోలేదు. విద్యార్థులు రూ.వేలకు వేలు ఖర్చు పెట్టి స్టడీ మెటీరియల్స్‌ను కొనుగోలు చేసుకుని పరీక్షలను నెట్టుకొచ్చారు. ముద్రణ ఖర్చులు భరించలేమని విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు.

అయిదేళ్ల క్రితం ఇచ్చిన పాఠ్యపుస్తకాలను ఆయా కళాశాలల్లోని గ్రంథాలయాల్లో దాచి పెట్టి వాటినే ఏటా విద్యార్థులకు అరకొరగా అందించేవారు. చిరిగిన ఆ పాత పుస్తకాలతో విద్యార్థులు కాలం గడిపేవారు. ఈ బాధలు పడలేక  కొందరు ఏలూరు, విజయవాడు నుంచి స్టడీ మెటీరియళ్లు కొనుగోలు చేసి చదువుకుంటున్నారు. సరైన సిలబస్‌ ప్రకారం చదివే వీలు ఉండకపోవడంతో ఏదో బట్టీ చదువులతో ఎక్కువశాతం మంది ఇంటర్‌ను పూర్తి చేశారు. ‘పాఠ్యపుస్తకాల కోసం ఇండెంట్‌ పెట్టాం’ అని డీఐఈవో ప్రభాకర్‌ తెలిపారు.

మొత్తం ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలు-   19
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల సంఖ్య-    124
ఇంటర్‌ మొదటి సంవత్సర  విద్యార్థులు- 14870
ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులు-      13120

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని