logo

వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీల మృతి

వడదెబ్బకు గురై ఇద్దరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో మృతి చెందారు. రైల్వేకోడూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లె పంచాయతీ బంగ్లామిట్టకు చెందిన పాలెంకోట వెంకటేషు (55) శుక్రవారం గ్రామ సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పని చేస్తుండగా ఎండ తీవ్రతకు తాళలేక కుప్పకూలిపోయారు.

Published : 18 May 2024 06:09 IST

రైల్వేకోడూరు గ్రామీణ, సుండుపల్లి, న్యూస్‌టుడే: వడదెబ్బకు గురై ఇద్దరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో మృతి చెందారు. రైల్వేకోడూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లె పంచాయతీ బంగ్లామిట్టకు చెందిన పాలెంకోట వెంకటేషు (55) శుక్రవారం గ్రామ సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పని చేస్తుండగా ఎండ తీవ్రతకు తాళలేక కుప్పకూలిపోయారు. తోటి కూలీలు వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. ఆయన మృతికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఫీల్డ్‌ అసిస్టెంటు హరిప్రసాద్‌ తెలిపారు.సుండుపల్లి మండలం రాయవరం గ్రామం దిగువ జంగంపల్లెకు చెందిన సమ్మెట అమరావతమ్మ(60) కొత్తజంగంపల్లి సమీపంలోని కొత్తచెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులకు    వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగొస్తూ మార్గ మధ్యలో కుప్పకూలి మృతి చెందారు.


అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : అనారోగ్యం భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లె మండలంలో శుక్రవారం జరిగింది. మదనపల్లె పట్టణంలోని అనపగుట్టకు చెందిన లక్ష్మీనారాయణ, రమాదేవిల కుమారుడు నరేష్‌ (32) పెద్దతిప్పసముద్రం మండలం అంకిరెడ్డిపల్లెలోని స్పిరిట్‌ తయారీ సంస్థలో పనిచేస్తాడు. ఇతను కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎన్నిరోజులైనా జబ్బు నయం కాకపోవడంతో మనస్తాపానికి గురైన అతను గురువారం సాయంత్రం మదనపల్లె మండలం కొండామారిపల్లె సమీపంలోని ఓ కంకర ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి పురుగుమందుతాగి ఇంటికి వచ్చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తించి అతన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్‌ చేశారు. శుక్రవారం అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్‌ స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సాధిక్‌ తిరుపతికి వెళ్లి మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆత్మహత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు.


మనస్తాపంతో బంగారు నగల వర్తకుడి బలవన్మరణం

మధు (పాత చిత్రం)

రామసముద్రం, న్యూస్‌టుడే: విష పూరిత మందు తాగి బంగారు నగల వర్తకుడు మధు (35) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామసముద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ సద్గురుడు కథనం మేరకు...రామసముద్రం మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన మధుతో పదేళ్ల క్రితం శ్వేతకు వివాహం జరిగింది. వీరికి ఆద్య, లాస్య ఇద్దరు బిడ్డలు. జీవనోపాధి కోసం అతను రామసముద్రంకు మకాం మార్చాడు. బంగారు నగల తయారీ పనిచేసుకుని జీవనం సాగించేవాడు. ఈ నెల 14వ తేదీ రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. దీంతో భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. అనంతరం 15వ తేదీ ఉదయం ద్విచక్ర వాహనం తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో గురువారం భార్య, భర్త ఆచూకీ కోసం పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రామసముద్రం పక్కనే ఉన్న గుట్టపాళ్యం గ్రామ సమీపంలోని పొలాల్లో మృతదేహం బయటపడింది. మృతదేహం పక్కనే మద్యం సీసాతో పాటూ విష పూరిత మందు సీసా పడి ఉంది. జీవితంపై విరక్తి చెంది మద్యంలో విషం కలుపుకొని మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


వ్యక్తిపై హత్యాయత్నం

గాయపడిన అల్తాఫ్‌

వీరబల్లి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని వంగిమళ్లకు చెందిన అల్తాఫ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లగా ముసుగుతో ఉన్న ముగ్గురు వ్యక్తులు కత్తులతో తనపై దాడి చేశారని.. వెంటనే గట్టిగా కేకలు వేయడంతో వారు పరారయ్యారని అల్తాఫ్‌ వివరించారు. దర్యాప్తు చేస్తున్నామని వీరబల్లి పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని