సమగ్ర ప్రక్షాళనే... న్యాయం!

కర్ణుడి చావుకు కారణాలెన్ని ఉన్నాయో- దేశీయంగా సామాన్యులకు న్యాయం చేరువ కావడంలో అన్ని అడ్డంకులు పోగుపడ్డాయి.

Published : 01 Dec 2022 00:41 IST

ర్ణుడి చావుకు కారణాలెన్ని ఉన్నాయో- దేశీయంగా సామాన్యులకు న్యాయం చేరువ కావడంలో అన్ని అడ్డంకులు పోగుపడ్డాయి. నవంబరు ఒకటో తేదీ నాటికి దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో సుమారు అయిదు కోట్ల అపరిష్కృత వ్యాజ్యాలు పేరుకుపోయాయి. సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించినట్లు- న్యాయస్థానాల్లో మౌలిక వసతుల లేమిని పరిమార్చకుండా న్యాయమూర్తుల సంఖ్యను పెంచినంత మాత్రాన పెండింగ్‌ కేసుల కొండలు కరగవు. కక్షిదారులకు సులభతర సేవలు సమకూరేలా మేలిమి న్యాయ సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామన్నది ప్రభుత్వాల పాతపాటే! కానీ, భారత న్యాయవ్యవస్థను ఆధునికీకరించే క్రతువే ఆచరణలో కొల్లబోతోంది. కృత్రిమ మేధతో అనుసంధానమైన చైనా స్మార్ట్‌కోర్టులు కక్షిదారులకు సత్వర న్యాయసేవలను అందిస్తున్నాయి. 2019-2021 మధ్య అలా అవి చైనీయులకు 170 కోట్ల పనిగంటలను ఆదా చేయగలిగాయి. పూర్వ వ్యాజ్యాలూ తీర్పులకు సంబంధించిన అపార సమాచార రాశిని జల్లెడ పడుతూ ప్రస్తుత కేసుల విశ్లేషణ, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల పరిశీలనలకు బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత, కృత్రిమమేధలను సంపన్న దేశాలు సమధికంగా వినియోగించుకుంటున్నాయి. అటువంటి అత్యాధునిక విధానాలను అందిపుచ్చుకోవడంలో వెనకబడిన ఇండియాలో- కాలంచెల్లిన పద్ధతులే నేటికీ కొనసాగుతున్నాయి. తీర్పులు వెలువడే నాటికి తరాలు గడచిపోతున్న దుర్భరావస్థలో- దేశం ఏటా రూ.50 వేల కోట్ల ఉత్పాదకతను కోల్పోతోందన్నది గత అధ్యయనాల సారాంశం. ఆ దుస్థితి సమసిపోవాలంటే- పోనుపోను ఇంతలంతలవుతున్న జనాభా అవసరాలు, 21వ శతాబ్ది సవాళ్లకు అనుగుణంగా న్యాయవ్యవస్థకు ఆసాంతం నూతన జవసత్వాలు సంతరింపజేయాలి. ఆ గురుతర బాధ్యతను నిర్వర్తించడంలో ప్రభుత్వాలు అశ్రద్ధ వహిస్తే- న్యాయానికి తీరని అన్యాయం చేసినట్లే! 

న్యాయమూర్తుల పోస్టుల భర్తీపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ స్పందిస్తూ- వ్యవస్థలోని ఖాళీలను మంచి న్యాయవాదులతో పూరించడం కష్టసాధ్యమవుతోందని ఆవేదన వ్యక్తపరచారు. భారతదేశంలో నమోదైన న్యాయవాదుల సంఖ్య దాదాపు పదిహేడు లక్షలన్నది అంచనా. వారికి తోడుగా ఏడాదికి ఎనభై వేల నుంచి లక్ష మంది కొత్తగా నల్లకోటు వేసుకుంటున్నారు.   రాశి పరంగా ఘనమైన న్యాయవాదుల్లో వాసి కలిగిన వాళ్లెందరు? దేశవ్యాప్తంగా 30శాతం ప్లీడర్లు నకిలీలేనని, తప్పుడు పట్టాలతో కోర్టులూ ట్రైబ్యునళ్ల ముందు హాజరవుతూ వృత్తి ప్రమాణాలను కుళ్ళబొడుస్తున్నారని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) ఛైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా గతంలోనే చేదువాస్తవాన్ని వెల్లడించారు. తొంభైశాతం ప్రభుత్వ న్యాయ కళాశాలలు బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాల పరంగా తీవ్రస్థాయి కొరతను ఎదుర్కొంటున్నాయని బీసీఐ ఇటీవలే సుప్రీంకోర్టుకు నివేదించింది. ప్రమాణాలు పాటించని ఎన్నో కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యంగా అనుమతులు జారీచేస్తున్నాయని అది తప్పుపట్టింది.  ఈ-వాహనాలు, ఓటీటీలు, ఆన్‌లైన్‌ క్రీడలు, డిజిటల్‌ మీడియా, క్రిప్టో కరెన్సీ తదితరాల వ్యాప్తి నేపథ్యంలో నైపుణ్యవంతులైన న్యాయవాదులకు గిరాకీ దేశవ్యాప్తంగా ఇనుమడిస్తోంది. గనులు, ఐటీ అనుబంధ సేవలు, ఇంధన, రవాణా, పర్యావరణ, ఔషధ రంగాల్లోని పరిశ్రమలు, నియంత్రణ సంస్థల్లో సంబంధిత అంశాలపై పట్టు కలిగిన ప్లీడర్లకు అవకాశాలు ఇబ్బడిముబ్బడి కానున్నాయి. సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టీకరించినట్లు, న్యాయవిద్యను పూర్తిగా ప్రక్షాళిస్తే తప్ప ఆ మేరకు నిపుణ న్యాయవాదులను రూపొందించుకోలేం! నల్సార్‌ వంటి ఉన్నతస్థాయి న్యాయ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేయడం అత్యావశ్యకం. సమకాలీన, భవిష్యత్తు సమాజ అవసరాలకు తగినట్లుగా కోర్సుల రూపకల్పనా కీలకమే. న్యాయఫలాలు ప్రజలకు అందని ద్రాక్షలు కాకూడదంటే- కిందిస్థాయి కోర్టుల్లో స్థానిక భాషల వినియోగమూ ఊపందుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ సమష్టిగా పరిశ్రమిస్తేనే- పౌరహక్కులకు గొడుగుపట్టేలా న్యాయసంస్కరణలు సాకారమవుతాయి!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు