‘మీటూ’ స్ఫూర్తితో..చైనా మహిళల పోరాటం..!

చైనాలో ‘మీటూ’ కేసు రెండు సంవత్సరాల తర్వాత కోర్టుముందుకు విచారణకు వచ్చింది.

Published : 02 Dec 2020 00:06 IST

అణచివేసే ధోరణిలో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం

తైపీ: ఇంటర్నెట్‌, మీడియా ఆంక్షలకు పేరుగాంచిన చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వ హయాంలో.. తమపై జరిగే దాడులు, లైంగిక వేధింపులపై అక్కడి మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితులు అత్యంత అరుదనే చెప్పవచ్చు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ‘మీ టూ’ ఉద్యమం వారిలో కొంత స్థైర్యాన్ని నింపింనట్లు తెలుస్తోంది. ఉద్యమ స్ఫూర్తితో ముందుకొస్తున్న మహిళలు.. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, అక్కడి చైనా కమ్యూనిస్టు పార్టీ ఇలాంటి ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతుందనే వాదన ఉంది. ఇలాంటి సమయంలో కొందరు బాధిత మహిళలు మాత్రం నేరుగా కోర్టుల్లో దావాలు వేస్తున్నారు. తాజాగా అలాంటి ‘మీటూ’ కేసు రెండు సంవత్సరాల తర్వాత కోర్టుముందుకు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో తమకు జరుగుతోన్న అన్యాయలపై చైనా మహిళలు ధైర్యంగా పోరాడుతున్నారనే విషయాన్ని ఈ కేసు వెల్లడిస్తోందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రెండేళ్ల తర్వాత కోర్టు ముందుకు..
చైనా ప్రభుత్వ ఆధీనంలో నడిచే అక్కడి సెంట్రల్‌ టెలివిజన్‌(సీసీటీవీ)లో 2014లో జూవో షియావోసువాన్‌(25) అనే యువతి ట్రైనీగా చేరారు. అక్కడ చేరిన కొద్దిరోజులకే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆ ఛానల్‌లో సీనియర్‌ యాంకర్‌గా ఉన్న ఓ వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఆ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన జూవో, మీటూ ఉద్యమంలో చేరి తనకు జరిగిన అవమానంపై పోరాటం ప్రారంభించింది. అయితే, ఇలాంటి చర్యలను ఇష్టపడని చైనా అధికార పార్టీ, ఫిర్యాదును తీసుకునేందుకు జూవోకు కొన్ని మార్గాలు చూపించింది. కానీ, న్యాయంకోసం రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తోన్న జూవోకు.. ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. చివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే ఆ యువతిపై తిరిగి పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలోనే.. రెండేళ్ల తర్వాత ఈ కేసు కోర్టు విచారణకు రావడం ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమయ్యింది.

తొలుత కార్మిక వివాద కేసుగానే..
2014లో జరిగిన ఈ కేసులో టీవీ యాంకర్‌ ఝూ జున్‌ తనను లైంగికంగా వేధించారంటూ జూవో ఆరోపణలు చేసింది. బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు 50వేల యువాన్‌ (7600 డాలర్లు)లను నష్టపరిహారం చెల్లించాలని జూవో తన దావాలో పేర్కొంది. అయితే, అప్పటికి ఇలాంటి ఫిర్యాదును లైంగిక వేధింపుల కేసు కింద కాకుండా కేవలం కార్మిక వివాదాల కేసుగానే అక్కడి ప్రభుత్వం పరిగణించింది. అయితే, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె తరపు న్యాయవాదులు, లైంగిక వేధింపుల చట్టం ప్రకారం ఈకేసు విచారణ జరపాలని డిమాండ్ చేయడంతో అందుకు అధికారులు అంగీకరించారు.

యువతిపైనే దావా..
తాజాగా ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా బాధితురాలు జూవో మీడియాతో మాట్లాడారు. చైనాలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల్లో కేవలం కొన్ని కేసులు మాత్రమే కోర్టు విచారణ వరకు వస్తాయని ఆమె వెల్లడించారు. ఇకముందు ఇలాంటి ప్రతి ఒక్క కేసు విచారణకు వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, న్యాయ ప్రక్రియలో ఉన్న సమస్యలను తన కేసు రుజువు చేస్తుందని జూవో ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే, టీవీ యాంకర్‌ ఝూ జున్‌ మాత్రం ఆ యువతి ఆరోపణలను ఖండించారు. అంతేకాకుండా తన కీర్తికి భంగం కలిగించారంటూ దాదాపు లక్ష డాలర్లను చెల్లించాలని తిరిగి ఆ యువతిపైనే పరువునష్టం దావా వేశారు. అయితే, ఆయన కేసు ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.

మీటూ ఉద్యమ స్ఫూర్తితో..
చైనా మాజీ అధినేత మావో జెడాంగ్‌ హయాంలో మహిళా హక్కులపై కాస్త పురోగతి కనిపించినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తారు. అయితే, స్త్రీ సమానత్వం విషయంలో మాత్రం చైనా వెనుకబడిపోయిందనే వాదన ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని.. గడిచిన మూడు దశాబ్దాల్లో మహిళా నాయకుల సంఖ్య మరింత తగ్గిపోవడమే ఇందుకు కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే జూవో కేసు చర్చనీయాంశమయ్యింది. తొలుత, తనపై లైంగిక వేధింపులు జరిగిన తీరును వివరిస్తూ ఆ యువతి సోషల్ మీడియాలో వివరించారు. దీనిపై స్పందించిన ఎంతో మంది చైనా మహిళలు ఆమెకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా తమకు ఎదురైన వేధింపుల అనుభవాలను వివరించడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలోనే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ‘మీటూ’ ఉద్యమం వారిలో మరింత స్ఫూర్తిని నింపింది. కానీ, ప్రస్తుత అధ్యక్షుడి షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం మాత్రం వారిపై నియంత్రణను కొనసాగించడంతోపాటు అసమ్మతి గళాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి కేసుల్లో ముందుకొచ్చే మహిళల గొంతుకను తొక్కిపట్టడం (సెన్సార్‌షిప్‌), అధికారుల ఆంక్షలతో వారిని అణచివేసే ప్రయత్నాన్ని చైనా ప్రభుత్వం కొనసాగిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో లైంగిక వేధింపులకు సంబంధించి ఆధారాలు ఉండడంతో జూవో దావా కోర్టుకు చేరింది.

ఇదిలా ఉంటే, చైనాలో గత కొంతకాలంగా మాత్రమే ఇలాంటి కేసులు కోర్టు వరకూ చేరుకుంటున్నాయి. మహిళలు ఉద్యమ స్ఫూర్తితో చేస్తోన్న పోరాటం వల్లనే ఇది సాధ్యమవుతున్నట్లు మానవ హక్కుల నేతలు, మహిళా ఉద్యమకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో చైనా చట్టాల్లో ఎన్నో మార్పులు రావాల్సిఉందని ఆశిస్తున్నారు. అయితే, ఇలా పోరాడుతున్న మహిళలకు మాత్రం జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోందన్న వాదనలూ ఉన్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని