icon icon icon
icon icon icon

Assembly Elections: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఒంటి గంటకు పోలింగ్‌ శాతం ఎంతంటే..?

Assembly Elections: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated : 17 Nov 2023 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Assembly Elections Polling) శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు నేడు ఒకే విడతలో ఓటింగ్‌ జరుగుతుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మిగిలిన 70 నియోజకవర్గాలకు రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యప్రదేశ్‌లో 45.40 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 38.22 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రిటర్నింగ్‌ అధికారులు వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ వేళ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పోటీ చేస్తున్న దిమని నియోజకవర్గంలో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. 

మధ్య భారత్‌లో మొగ్గు ఎటు?

ఓటేసిన ప్రముఖులు..

 • ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ దుర్గ్‌ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 75 సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 • మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌, ఆయన సతీమణి అమృత రాయ్‌ ఓటేశారు.
 • మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌, ఆయన సతీమణి సాధనా సింగ్‌, ఇద్దరు కుమారులు సెహోర్‌లో ఓటు వేశారు. అంతకుముందు ఆయన స్థానిక ఆలయంలో పూజలు చేశారు. ఈ ఎన్నికల్లో చౌహన్‌ బుద్నీ నుంచి బరిలో ఉన్న విషయం తెలిసిందే.
 • లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ ఇండోర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలైన్‌లో నిలబడి ఆమె ఓటు వేశారు.
 • కేంద్రమంత్రి, భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 • కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్ నాథ్‌ ఛింద్వాఢాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుమారుడు, ఎంపీ నకుల్‌ నాథ్‌, కోడలితో కలిసి శిఖర్‌పూర్‌లో ఓటు వేశారు. 
 • ఇండోర్‌-1లో భాజపా అభ్యర్థి కైలాశ్ విజయ్‌వర్గియా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 • నర్సింగ్‌పూర్‌లో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఓటు వేశారు. ఇదే స్థానం నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరో కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్‌ తికమ్‌గఢ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 • మధ్యప్రదేశ్ మంత్రులు నరోత్తమ్‌ మిశ్రా, యశోధరా రాజే సింధియా, రాజ్యవర్ధన్‌ సింగ్‌ దట్టిగావ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కుమారుడు జైవర్ధన్‌ సింగ్‌ తదితరులు తొలి గంటల్లో ఓటు వేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. తొలి విడతలో భాగంగా నవంబరు 7న 20 స్థానాలకు ఓటింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  img
  img
  img
  img