icon icon icon
icon icon icon

Bonda Uma: తండ్రి హయాం నుంచి డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్‌: బొండా ఉమా

రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని తెదేపా నేత బొండా ఉమా విమర్శించారు.

Published : 29 Apr 2024 11:39 IST

విజయవాడ: రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శించారు. విజయవాడలో భాజపా నేత లంకా దినకర్, జనసేన మహిళా విభాగం నేత రాయపాటి అరుణతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతిపరుడికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్‌ అని మండిపడ్డారు. రూ.లక్షల కోట్లు దోచుకోవడానికి దేనికైనా సిద్ధపడతారని ఆరోపించారు.  రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కూటమిగా జతకట్టామన్నారు. జగన్‌ అవినీతిని సొంత కుటుంబమే బయటపెడుతోందని చెప్పారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గాడి తప్పిన పాలనను మళ్లీ దారిలో పెడతామన్నారు.

అప్పుల్లో రాష్ట్రానికి ప్రథమ స్థానం: లంకా దినకర్‌

వైకాపా పాలనలో అన్నిరంగాల్లో దోపిడీ జరిగిందని భాజపా నేత లంకా దినకర్‌ విమర్శించారు. ‘‘పవర్‌ ప్రాజెక్టుల పేరుతో భారీగా దోచుకున్నారు. ల్యాండ్‌, శాండ్‌, మైన్‌, ఎర్రచందనం అన్నింట్లో దోపిడీనే. జగన్‌ పాలనలో అప్పుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలోకి వచ్చింది. మూలధన వ్యయంలో తప్పుడు లెక్కలు చూపుతున్నారు. కేంద్ర పథకాలు, ప్రాజెక్టులకు తమ స్టిక్కర్లు వేసుకున్నారు’’ అని లంకా దినకర్‌ అన్నారు.

సాధ్యంకాని అంశాలతో వైకాపా మ్యానిఫెస్టో: రాయపాటి అరుణ

ఆసుపత్రులకు బకాయిల వల్ల ఆరోగ్యశ్రీ అమలు కావట్లేదని జనసేన నాయకురాలు రాయపాటి అరుణ అన్నారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల రూ.1500 కోట్లు బకాయి పడిందని చెప్పారు. పాత అంబులెన్స్‌లకు రంగులేసి కొత్తవి కొన్నట్లు బిల్లులు పెట్టారని ఆరోపించారు. సాధ్యంకాని అంశాలతో వైకాపా మ్యానిఫెస్టో తీసుకొచ్చారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img