icon icon icon
icon icon icon

కదన రంగంలోకి వైఎస్‌ కుటుంబం!

మాజీ మంత్రి వివేకా హత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది.

Updated : 29 Apr 2024 09:21 IST

ఇప్పటికే వివేకా కుమార్తె సునీత కాంగ్రెస్‌ తరఫున ప్రచారం
తాజాగా షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ రంగప్రవేశం
మే 1 నుంచి కడప నియోజకవర్గంలోనే షర్మిల
వైకాపా ఇంటింటి ప్రచారంలో జగన్‌ సతీమణి భారతి

ఈనాడు, కడప వేంపల్లే, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వివేకా హత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది. ఆయన కుమారుడు సీఎం జగన్‌, కుమార్తె షర్మిల రెండు వర్గాలుగా విడిపోయి సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతున్నారు. తన తండ్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఐదేళ్లుగా న్యాయం జరగలేదని, అందుకు జగనే కారణమంటూ ప్రజాక్షేత్రంలోకి షర్మిలతో కలిసి సునీత దిగారు. న్యాయం.. ధర్మం నినాదంతో ఎన్నికల్లో తలపడటానికి వారిద్దరూ సిద్ధమయ్యారు. కడప పార్లమెంటు స్థానానికి షర్మిల కాంగ్రెస్‌ పార్టీ నుంచి తలపడుతుండగా.. వైకాపా నుంచి సీఎం జగన్‌.. వైఎస్‌ అవినాష్‌రెడ్డిని రంగంలోకి దింపారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని రక్షించడమే కాకుండా తిరిగి అభ్యర్థిగా రంగంలోకి దింపడాన్ని జీర్ణించుకోలేని షర్మిల.. తన అన్న జగన్‌తో పాటు అవినాష్‌రెడ్డిని ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఓసారి పర్యటించిన ఆమె రాష్ట్రంలో ప్రచారానికి పీసీసీ అధ్యక్షురాలి హోదాలో వెళ్లారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని మే నెల 1న తిరిగి కడప నియోజకవర్గానికి చేరుకుని పోలింగ్‌ పూర్తయ్యేవరకు ఇక్కడే మకాం వేయాలని నిర్ణయించారు. షర్మిలకు మద్దతుగా ప్రచారానికి రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వేర్వేరు సమయాల్లో రానున్నట్లు కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. ఇప్పటికే సునీత ఊరూవాడా ప్రచారం చేస్తుండగా, తాజాగా షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ శనివారం నుంచి రంగంలోకి దిగారు.

షర్మిలకు మద్దతుగా అనిల్‌కుమార్‌ సమావేశాలు

క్రైస్తవ మత ప్రబోధ]కుడిగా పేరుతెచ్చుకున్న షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌.. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి వైకాపాకు మద్దతుగా క్రిస్లియన్లను కూడగట్టే ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు. ఇప్పుడు ఆయనే వైకాపాకు వ్యతిరేకంగా క్రిస్టియన్‌ ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిలకు మద్దతుగా వైయస్‌ఆర్‌ జిల్లాలో పాస్టర్లు, క్రైస్తవులతో సమావేశమవుతున్నారు. కడపలోని పలు చర్చిల్లో ఆదివారం జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన.. ధైర్యంగా ఉంటే ఏసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు. తన పార్టీ ఓట్లు చీలి పోతాయనే భయంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్‌ పార్టీపైనా, పరోక్షంగా షర్మిలపై ఈ నెల 25న పులివెందుల సభలో సీఎం జగన్‌ బహిరంగంగా విమర్శలు చేశారు. సీఎం అనుమానాలు నిజం చేసేవిధంగా బ్రదర్‌ అనిల్‌కుమార్‌ క్రిస్టియన్‌, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రొద్దుటూరులో శనివారం ఆయన పాస్టర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. బహిరంగంగా ఓట్లు అడగకపోయినప్పటికీ.. పాస్టర్లు మాత్రం మనమంతా హస్తం గుర్తుకు ఓటేయాలని కోరడం వినిపించింది. కడపలో జరిగిన ఓ చర్చిలో బోధనలు చేస్తూ.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని క్రీస్తు సందేశాన్ని వినిపించారు. మా కుటుంబంలో జరిగిన ఘటనల కారణంగా కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నామని, న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. న్యాయం జరగాలని, జరిగి తీరుతుందని ఆవేశపూరితంగా ప్రసంగించారు.

ఇంటింటి ప్రచారంలో భారతి

సీఎం జగన్‌ సతీమణి భారతి పులివెందుల నియోజకవర్గంలో ఆదివారం వైకాపా తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొండూరు మండలం ఇనగనూరులో ఇంటింటి ప్రచారం చేపట్టగా.. ఆమె వెంట అవినాష్‌రెడ్డి సతీమణి సమత ఉన్నారు. సమత తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా జగన్‌, ఎంపీగా అవినాష్‌రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు.

సునీత ప్రచారంలో వైకాపా కవ్వింపు చర్యలు

పులివెందుల మండలంలో ఆదివారం వివేకా కుమార్తె సునీత కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద రంగాపురంలో ఆమె ప్రచారాన్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివేకా హత్య గురించి ఇక్కడ మాట్లాడవద్దని వైకాపా కార్యకర్తల ఆందోళన చేపట్టగా.. వారికి ధీటుగా సునీత సమాధానం ఇచ్చారు. ఎందుకు వివేకా హత్య గురించి మాట్లాడకూడదంటూ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో పోలీసులు స్పందించి వైకాపా కార్యకర్తలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img