icon icon icon
icon icon icon

పంతం నెగ్గించుకున్న సీనియర్లు

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి అయిదుగురు అభ్యర్థుల పేర్లతో తుదిజాబితాను కాంగ్రెస్‌ గురువారం రాత్రి విడుదల చేసింది.

Updated : 10 Nov 2023 05:56 IST

అధిష్ఠానంపై పనిచేసిన ఉత్తమ్‌, రాజనరసింహల ఒత్తిడి  
రాంరెడ్డి దామోదర్‌రెడ్డికే  సూర్యాపేట టికెట్‌
పటాన్‌చెరులో నీలం మధు  స్థానంలో కాటా శ్రీనివాస్‌గౌడ్‌
మిర్యాలగూడ, తుంగతుర్తి, చార్మినార్‌  స్థానాలకూ అభ్యర్థుల ప్రకటన

ఈనాడు- దిల్లీ, నల్గొండ: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి అయిదుగురు అభ్యర్థుల పేర్లతో తుదిజాబితాను కాంగ్రెస్‌ గురువారం రాత్రి విడుదల చేసింది. ఇందులో సూర్యాపేట, తుంగతుర్తి(ఎస్సీ), చార్మినార్‌, మిర్యాలగూడకు తాజాగా అభ్యర్థులను ప్రకటించగా.. పటాన్‌చెరు స్థానంలో అభ్యర్థిని మార్చింది. దీంతో సీపీఐకి కేటాయించిన కొత్తగూడెం మినహా 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. తాజా జాబితాలో సీనియర్‌ నేతల ముద్ర స్పష్టంగా కనిపించింది. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దన్నుతోనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సూర్యాపేట టికెట్‌ను దక్కించుకున్నారని తెలిసింది. మరోవైపు, పటాన్‌చెరులో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా పట్టుతోనే ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన నీలం మధు ముదిరాజ్‌ను పక్కనపెట్టి కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్‌ కేటాయించినట్లు సమాచారం.

సూర్యాపేట కోసం పోటాపోటీ

సూర్యాపేట టికెట్‌ కోసం రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డిల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. 2018లోనూ వీరిద్దరు టికెట్‌ కోసం పోటీ పడ్డారు. అప్పట్లో దామోదర్‌రెడ్డికి టికెట్‌ దక్కగా.. రమేశ్‌రెడ్డికి నిరాశే మిగిలింది. అప్పుడు సైతం నామినేషన్‌ ప్రక్రియ ముగియడానికి ఒకరోజు ముందు అభ్యర్థిని ప్రకటించారు. సీనియర్‌ నేత అయిన దామోదర్‌రెడ్డి ఓవైపు, నియోజకవర్గవ్యాప్తంగా పాదయాత్రలు చేయడంతోపాటు గత ఎన్నికల్లోనూ టికెట్‌ను త్యాగం చేశానని రమేశ్‌రెడ్డి మరోవైపు.. ఈసారి టికెట్‌ కోసం గట్టిగా పట్టుబట్టారు. దామోదర్‌రెడ్డికి నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రమేశ్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మద్దతు పలికినట్లు సమాచారం. దీంతో అభ్యర్థిత్వంపై చివరివరకు ఉత్కంఠ కొనసాగింది. చివరకు దామోదర్‌రెడ్డికే టికెట్‌ దక్కింది. వనపర్తిలో అభ్యర్థిగా ప్రకటించిన మాజీ మంత్రి చిన్నారెడ్డిని తప్పించిన నేపథ్యంలో ఇక్కడా సీనియర్‌ నేతను పక్కనపెడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావంతో దామోదర్‌రెడ్డి వైపు పార్టీ మొగ్గుచూపినట్లు తెలిసింది.

పటాన్‌చెరులో అభ్యర్థి మార్పు

పటాన్‌చెరులో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు మూడో జాబితాలో కాంగ్రెస్‌ టికెట్‌ ప్రకటించింది. దీంతో శ్రీనివాస్‌గౌడ్‌ అనుచరులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. మరోవైపు, దామోదర రాజనరసింహా స్వయంగా రంగంలోకి దిగారు. బుధవారం రాత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వెంట తీసుకెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఫలితంగా మధు స్థానంలో శ్రీనివాస్‌గౌడ్‌ పేరును అధిష్ఠానం ప్రకటించింది.

మిర్యాలగూడలో బీఎల్‌ఆర్‌..

సీపీఎంతో పొత్తు కుదరకపోవడంతో మిర్యాలగూడ స్థానానికి సైతం అభ్యర్థిని ప్రకటించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌పక్ష నేత బత్తుల లక్ష్మారెడ్డి(బీఎల్‌ఆర్‌)కి టికెట్‌ కేటాయించింది. ఈ టికెట్‌ను సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి సైతం ఆశించారు. అయితే తన సోదరుడు జైవీర్‌రెడ్డికి నాగార్జునసాగర్‌ టికెట్‌ కేటాయించడం, నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతానని జానారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ సీటు విషయంలో రఘువీర్‌రెడ్డి పెద్దగా ఒత్తిడి చేయలేదు. కాగా లక్ష్మారెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.

తుంగతుర్తిలో అనూహ్యం

తుంగతుర్తి(ఎస్సీ) టికెట్‌ను ఇటీవలే పార్టీలో చేరిన మందుల సామేల్‌ అనూహ్యంగా దక్కించుకున్నారు. ఈ స్థానానికి గత రెండు ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలైన అద్దంకి దయాకర్‌తో పాటు డాక్టర్‌ వడ్డేపల్లి రవి, పిడమర్తి రవి, నగరిగారి ప్రీతమ్‌ తదితరులు పోటీపడ్డారు. వీరిలోనే ఒకరికి టికెట్‌ వస్తుందని అంతా భావించారు. అనంతరం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మందుల సామేల్‌ రేసులోకి వచ్చారు. దయాకర్‌, వడ్డేపల్లి రవి, ప్రీతమ్‌లతో పాటు భారాస సిట్టింగ్‌ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ సైతం ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో.. మరో సామాజికవర్గ అభ్యర్థిని బరిలో దింపాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సామేల్‌కు టికెట్‌ కేటాయించింది. ఎంపీ కోమటిరెడ్డి, పొంగులేటిల మద్దతు ఉండటం, స్థానికుడు కావడంతో ఈయన వైపు అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలిసింది. సామేల్‌ తెరాస (ఇప్పటి భారాస) వ్యవస్థాపక సభ్యుడు. 2016 అక్టోబరు నుంచి 2021 వరకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు.

షరీఫ్‌కు చార్మినార్‌

ఎంఐఎం టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు లేదా మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీం మస్కతీ కుమారుడు అలీ మస్కతీకి చార్మినార్‌ టికెట్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో గురువారం వరకు అభ్యర్థిని పార్టీ ప్రకటించలేదు. వారిద్దరూ పోటీకి విముఖత చూపడంతో పీసీసీ సభ్యుడు, న్యాయవాది మహ్మద్‌ ముజీబ్‌ ఉల్లా షరీఫ్‌కు టికెట్‌ ఇచ్చింది.


నియోజకవర్గం-అభ్యర్థి

సూర్యాపేట: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తుంగతుర్తి(ఎస్సీ): మందుల సామేల్‌, మిర్యాలగూడ: బత్తుల లక్ష్మారెడ్డి, చార్మినార్‌: మహ్మద్‌ ముజీబ్‌ ఉల్లా షరీఫ్‌, పటాన్‌చెరు: కాటా శ్రీనివాస్‌గౌడ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img