icon icon icon
icon icon icon

వసుంధర రాజెను పట్టించుకోని భాజపా

రాజస్థాన్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది.

Updated : 20 Apr 2024 12:50 IST

కుమారుడి నియోజకవర్గానికే ఆమె పరిమితం
(జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ)

రాజస్థాన్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. దీంతో ఆమె తన కుమారుడు దుశ్యంత్‌ సింగ్‌ పోటీ చేస్తున్న ఝాలావాడ్‌-బారా నియోజకవర్గంలో ప్రచారానికే పరిమితమయ్యారు.

  •  ధోల్‌పుర్‌ మాజీ మహారాణి అయిన వసుంధర రాజె ఝాలావాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పటికే నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన ఆమె కుమారుడు ఐదోసారి గెలిచి తల్లి రికార్డును సమం చేయాలని చూస్తున్నారు.
  • రాష్ట్ర రాజకీయాల్లోకి రాకముందు కేంద్ర మంత్రిగా పని చేసిన వసుంధర 24 నియోజకవర్గాలకు ప్రచారానికే వెళ్లడం లేదు. ఒక్క నియోజకవర్గానికే పరిమితమయ్యారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలైన ఆమెను పార్టీ ప్రచార తారగా కూడా ఎంపిక చేయలేదు. కంటి తుడుపుగా మేనిఫెస్టో కమిటీలో సభ్యురాలిగా వేశారు.
  • లోక్‌సభ ఎన్నికల్లో వసుంధర రాజె మద్దతు దారుల్లో పలువురికి భాజపా టికెట్లు దక్కలేదు. అభ్యర్థుల ఎంపికలో ఆమెను పెద్దగా సంప్రదించలేదు.
  • 2019లో దుశ్యంత్‌ నాలుగో సారి గెలిచాక కేంద్ర పదవి ఇవ్వాలని వసుంధర ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలో మోదీ, అమిత్‌ షాలతో ఆమెకు విభేదాలు తలెత్తాయి.
  • గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధర అనుయాయులు 45 మంది ఎన్నికయ్యారు. అయినా ఆమెను కాదని తొలిసారి ఎమ్మెల్యే అయిన భజన్‌లాల్‌ శర్మకు భాజపా అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది.
  •  ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జైపుర్‌కు వచ్చినప్పుడూ వసుంధరకు అవమానమే ఎదురైంది. ఆమెకు ఒక చిట్టీ ఇచ్చి భజన్‌లాల్‌ శర్మ పేరును చదవాల్సిందిగా సూచించారు. అప్పటి నుంచీ ఆమె పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img