icon icon icon
icon icon icon

ప్రతిష్ఠాత్మకం.. పక్కా వ్యూహం

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు కావడంతో కాంగ్రెస్‌, భారాస, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అప్పటి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నాయి.

Updated : 23 Apr 2024 07:04 IST

క్రియాశీలకంగా ప్రత్యేక విభాగాలు
కీలకంగా వార్‌రూంలు..
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు కావడంతో కాంగ్రెస్‌, భారాస, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అప్పటి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నాయి. ప్రతి అవకాశాన్ని ఓట్లుగా మలచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. క్షేత్ర స్థాయి కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ బూత్‌స్థాయి నుంచి పకడ్బందీగా వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నాయి. వివిధ ప్రత్యేక విభాగాలను క్రియాశీలం చేయడంతోపాటు అంతర్గత వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నాయి.

బూత్‌ కమిటీలకు దిశానిర్దేశం

ఎన్నికల్లో అత్యంత కీలకం బూత్‌ కమిటీలే. ఓటర్లను పోలింగ్‌ కేంద్రం వరకూ తీసుకెళ్లేవి ఇవే. దీంతో వీటిపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాయి. రాష్ట్రంలో 35 వేలకుపైగా బూత్‌లు ఉండగా.. ప్రధాన పార్టీల ఆధ్వర్యంలో సుమారు 33 వేల బూత్‌ కమిటీల చొప్పున పనిచేస్తున్నాయి. వీటిపై రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగేలా అన్ని పార్టీలు యంత్రాంగాన్ని సిద్ధం చేశాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన కాల్‌ సెంటర్ల ద్వారా బూత్‌ కమిటీల కార్యక్రమాలను పరిశీలించే బాధ్యతను ఆ యంత్రాంగం నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌, భాజపాలు ఇప్పటికే రాష్ట్ర స్థాయి బూత్‌ కమిటీల సమావేశాలను నిర్వహించి పార్టీ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేశాయి. బూత్‌ కమిటీలు ఇచ్చే సమాచారంతోనే క్షేత్ర స్థాయిలో పార్టీ అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసుకుంటూ..లోటుపాట్లను సరిదిద్దుకుంటూ అధిష్ఠానాలు ముందుకెళ్తున్నాయి.

ఆ నివేదికలే కీలకం..

రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసుకున్న వార్‌ రూంలను పార్టీలు వ్యూహాల అమలుకు వినియోగిస్తున్నాయి. పార్టీ నేతలతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్న స్వతంత్ర వ్యవస్థలు అయిన వార్‌ రూంలు పార్టీలకు బాగా ఉపకరిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని పార్టీలకు వివరించడంలో ఇవి కీలక భూమిక పోషిస్తున్నాయి. పార్టీకి సానుకూలతలు ఏమిటి?  వ్యతిరేకంగా చర్చ జరుగుతున్న అంశాలు, అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్న విధానం, పార్టీ నేతల వ్యవహారశైలి, ప్రచారానికి దూరంగా ఉంటున్న కీలక నేతలు, ప్రత్యర్థి పార్టీలు వ్యవహరిస్తున్న తీరు సహా ఏ రోజుకారోజు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులపై కీలక నేతలకు నివేదికలను అందజేస్తున్నాయి. వాటి ఆధారంగా వారు పరిస్థితిని చక్కదిద్దుకుంటూ విజయానికి బాటలు వేసుకుంటున్నారు.

ప్రత్యేకంగా వ్యూహ కమిటీలు

ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా వ్యూహ (స్ట్రాటజీ) కమిటీలు పనిచేస్తున్నాయి. పార్టీ రోజువారీ కార్యక్రమాలతో సంబంధం లేకుండా ఉన్న కీలక నాయకులతో ఈ కమిటీలు పనిచేస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్‌, భారాస ముఖ్య నేతలతో వ్యూహ కమిటీలు తరచూ సమావేశమవుతూ పార్టీ బలాబలాలు, ప్రభావితం చూపుతున్న అంశాలు, దృష్టిసారించాల్సిన అంశాలను వివరిస్తున్నాయి. వీటితోపాటు ఎన్నికల నిర్వహణ కమిటీలు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ కమిటీల బాధ్యులు మూణ్నాలుగు రోజులకోసారి బూత్‌ కమిటీలు, మండల, అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల వారీగా ఉన్న బాధ్యులతో చర్చిస్తూ ముందుకు వెళ్తున్నారు.


చురుగ్గా సామాజిక మాధ్యమాల విభాగాలు

ప్రతి పార్టీ ప్రత్యేకంగా సామాజిక మాధ్యమ విభాగాలను నిర్వహిస్తోంది. వందలమందితో పనిచేస్తున్న ఈ విభాగాలు పార్టీకి సంబంధించిన సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థుల ఆరోపణలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img