icon icon icon
icon icon icon

అడ్డాలో ‘మహాయుతి’కి చీలిక కష్టం?

మహారాష్ట్రలో రెండో విడత పోలింగ్‌ జరగనున్న 8 నియోజకవర్గాల్లో మరోసారి సత్తా చాటాలని ‘మహాయుతి’ (ఎన్డీయే) కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది.

Updated : 24 Apr 2024 05:49 IST

శివసేనల పోరు రసవత్తరం
రెండో విడతకు మహారాష్ట్రలోని 8 నియోజక వర్గాలు సిద్ధం

మహారాష్ట్రలో రెండో విడత పోలింగ్‌ జరగనున్న 8 నియోజకవర్గాల్లో మరోసారి సత్తా చాటాలని ‘మహాయుతి’ (ఎన్డీయే) కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇది ఈ కూటమికి అడ్డాయే అయినా శివసేనలో చీలిక ఇబ్బంది పెడుతోంది. అయినా క్లీన్‌స్వీప్‌ చేయాలని మహాయుతి తీవ్రంగా పోరాడుతోంది. ఈ ప్రాంతంలో భాజపాకు గట్టి పట్టుంది. మహా వికాస్‌ అఘాడీ కూడా  గట్టిగా పోరాడుతోంది. ఈ ఎన్నికల్లో రెండు శివసేనలు, రెండు ఎన్సీపీలు ఉండటంతో ఓటర్లలో కొంత గందరగోళం నెలకొంది.

శిందేకు సవాల్‌

విదర్భ ప్రాంతంలోని యవత్మాల్‌-వాశిం నియోజకవర్గంలో ఏక్‌నాథ్‌ శిందే శివసేనకు, ఉద్ధవ్‌ సేనకు మధ్య పోటీ నెలకొంది. దీంతో శిందేకు ఇది ప్రతిష్ఠాత్మకంగా మారింది. శిందే పార్టీ నుంచి రాజశ్రీ పాటిల్‌, ఉద్ధవ్‌ పార్టీ నుంచి సంజయ్‌ దేశ్‌ముఖ్‌ బరిలో ఉన్నారు. రాజశ్రీ ఎన్నికలకు కొత్తకాగా దేశ్‌ముఖ్‌ రాజకీయ నేతగా రాణిస్తున్నారు. ఇక్కడ ఐదు సార్లు గెలిచిన అవిభాజ్య శివసేన ఎంపీ భావనా గవాలీకి ఈ సారి టికెట్‌ ఇవ్వలేదు.  ఇక్కడి దేశ్‌ముఖ్‌, మరాఠా, కుంబీ, బంజారా వర్గాలు గత ఎన్నికల్లో భాజపా, శివసేన కూటమికి అండగా నిలిచాయి. ఇప్పుడు ఆ పార్టీలు వేరు కావడంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. బంజారాల అధ్యాత్మిక గురువు మహంత్‌ సునీల్‌ మహరాజ్‌.. ఉద్ధవ్‌కు మద్దతు తెలిపారు. ఈ ప్రాంతంలో ఆయనకు భారీ మద్దతుదారులున్నారు.

అమరావతిలో నువ్వా.. నేనా?

అమరావతిలో ఈసారి ఆసక్తికర పోరు నెలకొంది. గత ఎన్నికల్లో ఎన్సీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీ నటి నవనీత్‌ రాణా ఈసారి భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇక్కడ బల్వంత్‌ వాంఖడే బరిలోకి దిగారు. మతపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన అమరావతిలో నవనీత్‌ను బయటి వ్యక్తిగా ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. స్థానిక భాజపా నాయకుల్లోనూ ఆమె పట్ల వ్యతిరేకత ఉంది. రాణా భాజపాను ఎంచుకోవడం ఆమె అనుచరుల్లోని కొందరికి ఇష్టం లేదు. ఇక్కడ రెండు అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి నియోజకవర్గంలో భాజపాకు బలమైన మద్దతుదారులైన 35శాతం మంది ఓబీసీలు రాణా వెంట నడుస్తారా లేదా అనేది. రెండోది 28శాతం ఉన్న దళితులు, గిరిజనులు ఎవరి పక్షం వహిస్తారనేది. గత ఎన్నికల్లో రాణాకు అండగా నిలిచిన ముస్లింలు ఈసారి మద్దతు ఇవ్వడం కష్టమే. దళితులు, ముస్లింలు అభ్యర్థుల భవితను తేల్చనున్నారు.

ప్రకాశ్‌ అంబేడ్కర్‌ పోటీతో..

ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వ హిందూ పరిషత్‌ అండతో మెజారిటీ కుంబీ-మరాఠా ఓటర్లను కొల్లగొట్టే భాజపా అకోలాలో తిరుగులేని విజయాలను సాధిస్తోంది. ముస్లింలు, దళితుల ఓట్లు గణనీయంగానే ఉన్నా ఇక్కడ ఆ పార్టీదే హవా. ఇక్కడ భాజపా నుంచి అనూప్‌ ధోత్రే, కాంగ్రెస్‌ నుంచి అభయ్‌ పాటిల్‌, వంచిత్‌ బహుజన్‌ అఘాడీ (వీబీఏ) నుంచి ప్రకాశ్‌ అంబేడ్కర్‌ పోటీ పడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో మోదీ ప్రభావం, కాంగ్రెస్‌ ముస్లిం అభ్యర్థిని నిలపడంతో ఇక్కడ ఎన్నిక ఏకపక్షంగా సాగింది. గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి 5,54,444 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి పాటిల్‌ను కాంగ్రెస్‌ పోటీకి దింపడంతో హిందూ ఓట్లను కొంత సాధించే అవకాశముంది. ముస్లింల ఓట్లు ఎలాగూ ఆయనకు వచ్చే అవకాశముంది. దళితుల ఓట్లు ప్రకాశ్‌ అంబేడ్కర్‌కు దక్కుతాయి.

శివసేనల బరి బుల్డాణా

ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న బుల్డాణా ఆ తర్వాతి కాలంలో ఉమ్మడి శివసేనకు అడ్డాగా మారింది. ఇప్పుడు రెండుగా చీలిన శివసేన వర్గాల మధ్యే పోరు సాగుతుండటం గమనార్హం. సిటింగ్‌ ఎంపీ ప్రతాప్‌రావ్‌ జి.జాదవ్‌ శిందే సేన నుంచి బరిలో ఉన్నారు. నాలుగోసారి గెలిచేందుకు చెమటోడుస్తున్నారు. అయితే బాలాసాహెబ్‌ ఠాక్రే వారసత్వానికి ఇది ప్రతిష్ఠగా మారింది. ఉద్ధవ్‌ వర్గం నుంచి నరేంద్ర ఖేడేకర్‌ బరిలో ఉన్నారు. రైతు నేత రవికాంత్‌ తుప్కార్‌ బరిలో ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

సేనల మధ్యలో వీబీఏ

నాందేడ్‌ పక్కనున్న హింగోలీ లోక్‌సభ స్థానంలో శివసేనలతోపాటు వీబీఏ అభ్యర్థి బరిలో ఉండటంతో ముక్కోణ పోటీ నెలకొంది. శిందే సేన నుంచి బాబురావు కోహలీకర్‌, ఉద్ధవ్‌ సేన నుంచి నాగేశ్‌ పాటిల్‌ ఆష్టీకర్‌, వీబీఏ నుంచి డీబీ చవాన్‌ తలపడుతున్నారు. శివసేనల నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు నేతలూ పెద్దగా పేరులేనివారే. ఈ నియోజకవర్గంలో విజయం ముఖ్యమంత్రి శిందేకు ప్రతిష్ఠాత్మకం. ఆయన ఉద్ధవ్‌ ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఉద్ధవ్‌ అభ్యర్థి ఆష్టీకర్‌కు స్థానిక సహకార సంఘాల్లో బలముంది. ఇక్కడి రైతుల సమస్యలపై ఆయన దృష్టి సారించి ప్రచారం చేస్తున్నారు.

కంచుకోటను వదులుకున్న కాంగ్రెస్‌

పొత్తులో భాగంగా తన కంచుకోట అయిన వార్ధాను ఎన్సీపీకి (ఎస్పీ) కాంగ్రెస్‌ ఇచ్చింది. శరద్‌ పవార్‌ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే అమర్‌ కాలే బరిలో దిగారు. భాజపా నుంచి రాందాస్‌ తడస్‌ పోటీ చేస్తున్నారు. వార్ధా చరిత్రలో కాంగ్రెస్‌ పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి. వార్ధా మహాత్మా గాంధీ సేవాగ్రామ్‌కు కేంద్రం. ఇక్కడ తేలీ, కుంబీ ఓబీసీ వర్గాల పోరు సాగనుంది. భాజపా సిటింగ్‌ ఎంపీ తడస్‌ తేలీ వర్గానికి చెందినవారు. ఆయన 2014, 2019లో గెలిచారు. కాలే కుంబీ వర్గానికి చెందిన నేత.


సామాజిక వర్గాల పోరు

పశ్చిమ మహారాష్ట్రలోని పర్భణీ నియోజకవర్గంలో తొలుత బయటి వ్యక్తులు, స్థానికులకు మధ్య పోటీలా సాగింది. ఆ తర్వాత మరాఠాలు, ఓబీసీల మధ్య పోరుగా మారింది. చివరకు వర్గాల వారీ ఓట్ల చీలిక కోసం అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ శివసేన (ఉద్ధవ్‌) సిటింగ్‌ ఎంపీ సంజయ్‌ జాదవ్‌, మహాయుతి కూటమిలోని రాష్ట్రీయ సమాజ్‌ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) నుంచి ఆర్‌ఎస్‌ మహదేవ్‌ జాంకర్‌ బరిలో నిలిచారు. శివసేన స్థానిక నేతలంతా ఉద్ధవ్‌ వెంటే నిలిచారు. దీంతో భాజపా, శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్‌) పార్టీల ఓట్లపైనే ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి ఆధారపడ్డారు.


కాంగ్రెస్‌ ఇలాఖాలో భాజపా పాగా

మరాఠ్వాడా ప్రాంతంలోని నాందేడ్‌ కాంగ్రెస్‌కు ఒకప్పటి అడ్డా. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు. ఆ తర్వాతి కాలంలో నేతలంతా భాజపావైపు మళ్లడంతో ఆ పార్టీ బలహీనపడింది. గత ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ను భాజపా అభ్యర్థి ప్రతాప్‌రావ్‌ పాటిల్‌ చిఖలీకర్‌ ఓడించారు. ఇటీవల అశోక్‌ చవాన్‌ భాజపాలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ వసంతరావ్‌ పాటిల్‌ను బరిలోకి దించింది. వీబీఏ నుంచి అవినాశ్‌ భోసికర్‌ పోటీ చేస్తున్నారు. అశోక్‌ చవాన్‌ రావడంతో భాజపా బలపడింది. గతంలో ఇక్కడ ఎన్నికలు అశోక్‌ చవాన్‌కు మిగిలిన వారికి మధ్య జరిగేవి. సిటింగ్‌ ఎంపీపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. మరాఠా కోటా ఆందోళన భాజపాకు ఆందోళన కలిగిస్తోంది. సంప్రదాయంగా భాజపాకు మద్దతిచ్చే ఓబీసీలు ఈసారి వీబీఏ, భాజపా మధ్య చీలిపోనున్నారు.


  • యవత్మాల్‌ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు పెద్ద సమస్యగా ఉంది.
  • ఎస్సీ నియోజకవర్గమైన అమరావతిలో అభివృద్ధి ఛాయలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.

ఏ నియోజకవర్గాల్లో ఎవరికి బలం

మహాయుతి

అమరావతి, వార్ధా, అకోలా

మహా వికాస్‌ అఘాడీ

యవత్మాల్‌-వాశిం, బుల్డాణా


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img