icon icon icon
icon icon icon

ఆ ముగ్గురికీ అగ్నిపరీక్షే!

కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు ప్రధానంగా ముగ్గురు నాయకులకు అగ్నిపరీక్షలా మారాయి. వారు- పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, జేడీఎస్‌ రాష్ట్రాధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి, భాజపా రాష్ట్ర సారథి బి.వై.విజయేంద్ర. మూడు పార్టీల్లోనూ వారికి ప్రస్తుతం సీనియర్లు తోడున్నా.

Updated : 25 Apr 2024 06:48 IST

కన్నడనాట మెరుగైన ఫలితాలపై మూడు పార్టీల రాష్ట్రాధ్యక్షుల కన్ను
ఈనాడు, బెంగళూరు

ర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు ప్రధానంగా ముగ్గురు నాయకులకు అగ్నిపరీక్షలా మారాయి. వారు- పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, జేడీఎస్‌ రాష్ట్రాధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి, భాజపా రాష్ట్ర సారథి బి.వై.విజయేంద్ర. మూడు పార్టీల్లోనూ వారికి ప్రస్తుతం సీనియర్లు తోడున్నా.. ఈ ఎన్నికల్లో తమ పక్షాల జయాపజయాలకు ప్రధానంగా బాధ్యత వహించబోయేది మాత్రం వీరేనన్నది సుస్పష్టం. భవిష్యత్తులో తాము పార్టీలను సమర్థంగా నడిపించగలమన్న విశ్వాసాన్ని ఆయా పక్షాల అధిష్ఠానాల్లో, ప్రజల్లో కల్పించాలంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు రాబట్టుకోవడం ఎంత ముఖ్యమో ఈ ముగ్గురికీ తెలుసు.  

ఆశల పల్లకిలో డీకే

నిరుటి కర్ణాటక విధానసభ ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆత్మవిశ్వాసంతో పోటీ చేయగలుగుతోందంటే అందుకు కారణం- కన్నడనాట అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయమేనంటే అతిశయోక్తి కాదు. ఆ విజయంలో శివకుమార్‌ పాత్ర అత్యంత కీలకం. ఆయనపై అధిష్ఠానానికి అపార విశ్వాసం. 61 ఏళ్ల డీకే సీఎం పదవి కోసం నిరుడు సిద్ధరామయ్యతో తొలుత పోటీపడ్డారు. అయితే అధిష్ఠానం సూచనతో తాను తర్వాత వెనక్కి తగ్గినట్లు స్వయంగా పలు సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుతం 78 ఏళ్ల సిద్ధరామయ్య రాజకీయ విశ్రాంతి దశకు చేరువయ్యారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టగలిగితే సీఎం సీటు డీకేకు దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకేఒక్క స్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌కు ఈసారి కనీసం 15 చోట్ల విజయం కట్టబెట్టేలా డీకే ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే ఒక్కలిగలకు తానే భవిష్యత్తు నాయకుడినని, ముఖ్యమంత్రి పదవి తన హక్కు అని ఆయన తరచూ చెబుతుంటారు. అయితే సిద్ధరామయ్య శిబిరంలోని ఎం.బి.పాటిల్‌, సతీశ్‌ జార్ఖిహొళి, కె.రాజణ్ణ, కె.జె.జార్జి, రామలింగారెడ్డిల నుంచి అంతగా సహకారం దక్కకపోవడం, బెంగళూరు ప్రాంతానికే పరిమితమైన నేతగా ముద్రపడటం డీకేకు ప్రతికూలాంశాలు. ఎన్నికల తర్వాత అధికార పంపిణీ అనివార్యమై.. దళిత, అహింద నాయకులకు సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్‌ జోరందుకుంటే మాత్రం డీకేకు ఇబ్బందే.


కుమారస్వామి గురి కుదిరేనా!

న్నడనాట ఈసారి జేడీఎస్‌ మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ మూడింటినీ గెల్చుకోవడంతోపాటు పార్టీకి పట్టున్న చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, తుమకూరు, బెంగళూరు గ్రామీణ, మైసూరుల్లోనూ ఎన్డీయే అభ్యర్థులను గెలిపించడం 64 ఏళ్ల హెచ్‌డీ కుమారస్వామి ముందున్న సవాల్‌. అప్పుడే ఆయన పేరు మారుమోగుతుంది. ప్రస్తుతానికి జేడీఎస్‌ ప్రచార బాధ్యతలను పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ మోస్తున్నారు. ఆయన తర్వాత పార్టీని నడిపించాల్సింది కుమారస్వామే. ఆయన సోదరుడు హెచ్‌.డి.రేవణ్ణ నాయకత్వం హాసన జిల్లాకే పరిమితం. తన కుమారుడు నిఖిల్‌గౌడను భవిష్యత్‌ నాయకుడిగా తీర్చిదిద్దేందుకు కుమారస్వామి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో తనపై విశ్వాసాన్ని పెంచాలంటే ప్రస్తుత ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం కుమారస్వామికి అత్యావశ్యకం. గత ఎన్నికల్లో ఒకేఒక్క స్థానానికి పరిమితమైన జేడీఎస్‌ ఇప్పుడు రెండింట గెలిచినా కుమారస్వామి తన ప్రయత్నంలో విజయం సాధించినట్లే! అయితే ఇప్పటికే మూడుసార్లు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామికి ఆరోగ్యమే అతిపెద్ద అవరోధం. మరోవైపు- ఆయన ఒంటెద్దు పోకడ నచ్చక పార్టీ నుంచి ద్వితీయశ్రేణి నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. అవకాశవాద రాజకీయం చేస్తారన్న ముద్ర కుమారస్వామికి మరో ప్రతికూలాంశం.


విజయేంద్రకు కఠిన సవాల్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్నప్పటి నుంచీ 48 ఏళ్ల బి.వై.విజయేంద్ర స్వపక్షంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అధిష్ఠానం మద్దతు ఉండటం సానుకూలాంశం. ఇప్పటికీ తండ్రి బి.ఎస్‌.యడియూరప్పే విజయేంద్రకు బలం. ఈ ఎన్నికల్లో భాజపా శ్రేణులకు యడియూరప్ప నాయకత్వం వహిస్తున్నా.. గెలుపోటములకు విజయేంద్ర బాధ్యత వహించక తప్పదు. గత సార్వత్రిక ఎన్నికల్లో కమలదళం కన్నడనాట 25 స్థానాలు గెల్చుకుంది. ఈసారి ఆ సంఖ్య ఏమాత్రం తగ్గినా.. విమర్శలు గుప్పించేందుకు బసవనగౌడ యత్నాళ్‌, సి.టి.రవి, డి.వి.సదానందగౌడ వంటి సీనియర్లు సిద్ధంగా ఉన్నారు. యడియూరప్పను విమర్శించే వారంతా.. ఈ ఎన్నికల్లో భాజపా మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోతే విజయేంద్ర నాయకత్వాన్ని సవాలు చేస్తారు. పెద్దగా అనుభవం లేకపోవడం విజయేంద్రకు ప్రతికూలాంశం. గత విధానసభ ఎన్నికల్లోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. ఒకరిద్దరు సీనియర్లు మినహా ఆయనకు పార్టీలో మద్దతిచ్చేవారు దాదాపుగా లేరనే చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img