icon icon icon
icon icon icon

LS polls: ‘కాలా పత్తర్‌’లో.. బిహారీ బాబు-సర్దార్‌జీల పోరు

అసన్‌సోల్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున బిహారీ బాబు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha), సర్దార్‌జీగా పేరొందిన భాజపా సీనియర్‌ నేత సురేంద్రజీత్‌ సింగ్‌ (SS Ahluwalia)లు తలపడుతున్నారు.

Updated : 02 May 2024 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తోన్న భాజపా.. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అసన్‌సోల్‌ స్థానంపై దృష్టిసారించింది. నల్ల బంగారానికి (బొగ్గు గనులకు) నిలయమైన ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక్కడినుంచి టీఎంసీ తరఫున బిహారీబాబుగా పేరొందిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha) బరిలోఉండగా, సర్దార్‌జీగా పేరొందిన సీనియర్‌ నేత సురేంద్రజీత్‌ సింగ్‌ (SS Ahluwalia)ను భాజపా బరిలో దింపింది. దీంతో ఈ స్థానంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

మైనింగ్‌తోపాటు పారిశ్రమలకు నిలయమైన అసన్‌సోల్‌ పార్లమెంటు స్థానం కింద రాణిగంజ్‌, పాండవేశ్వర్‌, జమురియా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ బొగ్గు గనులు, ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి. ఝార్ఖండ్‌కు సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో హిందీ మాట్లాడేవారే ఎక్కువ. ఇక్కడి గనులు, పరిశ్రమల్లో పనిచేసేవారు ఎక్కువగా బిహార్‌, యూపీ నుంచి వచ్చినవారే. దీంతో వారిని ఆకర్షించేందుకు అధికార, విపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. మూడు దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్న ఈ స్థానాన్ని మునుపటి రెండుసార్లు (2014, 19 ఎన్నికల్లో) భాజపా కైవసం చేసుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ దక్కించుకుంది.

ఫ్యాన్‌ ఫాలోయింగ్‌..

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శత్రుఘ్నసిన్హా పట్నాకు చెందినవారు. బిహారీ బాబుగా పేరొందిన ఆయన్ను తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి బరిలో నిలిపింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తరఫున రెండుసార్లు ఇక్కడినుంచి గెలిచిన బాబుల్‌ సుప్రియో.. 2021 చివర్లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత 2022లో జరిగిన ఉప ఎన్నికలో శత్రుఘ్నసిన్హా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి మళ్లీ ఆయన్నే టీఎంసీ పోటీలో నిలిపింది. బాలీవుడ్‌ అగ్ర నాయకుల్లో ఒకరైన శత్రుఘ్నసిన్హా 1979లో వచ్చిన ‘కాలా పత్తర్‌’ సినిమాలో అమితాబ్‌తో కలిసి నటించారు. అసన్‌సోల్‌కు సమీపంలో ఉన్న చస్నాలా బొగ్గు గనిలో చోటుచేసుకున్న విషాదం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ ప్రాంతంలో శత్రుఘ్నసిన్హాకు ఇంకా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు.

తీవ్ర పోటీ..

అసన్‌సోన్‌ స్థానికుడైన సురేంద్రజీత్‌ సింగ్‌ అహ్లూవాలియాను భాజపా పోటీలో నిలిపింది. రాజ్యసభ మాజీ ఎంపీ అయిన సింగ్‌.. 2014లో దార్జీలింగ్‌, 2019లో బర్ధమాన్‌-దుర్గాపుర్‌ నుంచి గెలుపొందారు. ఈసారి తొలుత భోజ్‌పురి గాయకుడు పవన్‌సింగ్‌ను ఇక్కడినుంచి పోటీ చేయిస్తున్నట్లు భాజపా ప్రకటించినప్పటికీ.. పోటీ నుంచి ఆయన తప్పుకోవడంతో సర్దార్‌జీకి కేటాయించింది. అయితే, ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు శాసనసభ స్థానాల్లో ఐదు టీఎంసీ చేతిలోనే ఉండటంతో అహ్లూవాలియా గట్టి పోటీ ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది.

సీపీఎం నుంచి ఎమ్మెల్యే జహనారా ఖాన్‌ బరిలో ఉన్నారు. స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యను లేవనెత్తిన ఆయన.. శత్రుఘ్నసిన్హా, సుప్రియోలు వీటిపై కనీస శ్రద్ధ వహించలేదన్నారు. ఇక్కడి పరిశ్రమలు ఎంతోకాలంగా మూతపడటం, అక్రమ మైనింగ్‌ జోరుగా సాగుతుండటం వంటి అంశాలను ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎంపీగా ఉన్న ఇద్దరు నేతలు.. వారి సిటింగ్‌ స్థానాలకు ఏం చేశారని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మే 13న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img