icon icon icon
icon icon icon

Mamata Banerjee: ఇండియా కూటమి సమావేశమా..? నాకు తెలియదే..?: మమతాబెనర్జీ వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress)కు వచ్చిన వ్యతిరేక ఫలితాలు.. ఇండియా కూటమిలో దాని స్థానంపై ప్రభావం చూపనున్నట్లు కనిపిస్తోంది. 

Updated : 05 Dec 2023 12:40 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections 2023) కాంగ్రెస్ ఓటమి చెందడంతో ఇండియా కూటమి పక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఫలితాలు బుధవారం (డిసెంబర్ 6) జరగనున్న కూటమి సమావేశంపైనా ప్రభావం చూపనున్నట్లు కనిపిస్తోంది. కూటమి తదుపరి కార్యాచరణ నిమిత్తం దిల్లీ వేదికగా నిర్వహించనున్న సమావేశం గురించి తనకు తెలియదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై  చర్చించేందుకు కూటమిలోని పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా బుధవారం దిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge) ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీని గురించి మమత మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ఆ సమావేశం గురించి తెలియదు. నాకు దాని గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అదేరోజు నేను బెంగాల్‌లో మరో కార్యక్రమానికి హాజరవుతున్నాను. ముందే తెలిసి ఉంటే.. కూటమి సమావేశానికే వెళ్లేదాన్ని’ అని పేర్కొన్నారు. తాజాగా హస్తం పార్టీకి నిరాశాజనక ఫలితాలు రావడంపై ఇప్పటికే విమర్శలు గుప్పించిన ఆమె..  ఆ తర్వాత ఈ విధంగా స్పందించడం గమనార్హం. ఆ భేటీకి తృణమూల్‌ గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ఓ సామాన్యుడి విజయం రాజకీయ వర్గాల్లో సంచలనం

‘తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కూడా కాంగ్రెస్‌ గెలవాల్సింది. కానీ, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ ముందుకు రాలేదు. దీంతో ఓట్ల విభజన జరిగి ఆ పార్టీ ఓటమి పాలైంది. భావజాలంతోపాటు గెలిచేందుకు సరైన వ్యూహం, ప్రణాళిక కూడా ఉండాలి. 2024లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగితే కేంద్రంలో భాజపా అధికారంలోకి రాదు’ అని మమత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జమిందారీ మైండ్‌సెట్‌తో అది పోటీలో దిగితే, ఫలితాలు ఇలాగే ఉంటాయని తృణమూల్ విమర్శించింది.

నీతీశ్‌, అఖిలేశ్‌ కూడా..!

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్ కూడా ఈ కూటమి సమావేశానికి హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. ఆయన స్థానంలో జేడీయూ పార్టీ చీఫ్ లలన్ సింగ్ ఈ భేటీకి రానున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఇండియా కూటమికి కాంగ్రెస్ సారథ్యం వహిస్తోంది. కూటమి బాధ్యతలను కాంగ్రెస్‌కు ఇస్తే.. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని, అందువల్ల సారథ్య బాధ్యతలను తమ నేత నీతీశ్‌కుమార్‌కు అప్పగించాలని జేడీయూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, ‘ఇండియా’ కూటమి సమావేశానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ హజరయ్యే ప్రణాళికలేవీ లేవని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరీ తెలిపారు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల సమయంలో సీట్ల విషయంలో కాంగ్రెస్‌, ఎస్పీ మధ్య విభేదాలు పొడచూపిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img