icon icon icon
icon icon icon

KTR: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో కర్ణాటకలో ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పించారు.  

Updated : 10 Nov 2023 23:53 IST

హైదరాబాద్‌: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కామారెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్) వేదికగా విమర్శలు గుప్పించారు.  ‘‘సిద్ధరామయ్య గారు.. కర్ణాటకలో మీది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్‌. తెలంగాణలో మాది 24 గంటల పవర్ ఫుల్ మోడల్‌. పదేళ్ల ప్రస్థానం తరువాత కూడా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన మాది. అధికారం చేపట్టి ఆరు నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం మీది. మీ ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలకు పాతరేసి, నమ్మి ఓటేసిన ఆ ప్రజలను పూర్తిగా గాలికొదిలేసి, ఇక్కడికొచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది అమాయక కర్ణాటక కాదు.. తెలివైన తెలంగాణ. రైతులకు ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని మీరు.. మీ ప్రజలకిచ్చిన ఐదు హామీల్ని ఐదేళ్లయినా అమలుచేయలేరు. మీ రాష్ట్రంలో కనీసం రేషన్ ఇవ్వలేరు.. ఇక్కడికొచ్చి డిక్లరేషన్లు ఇస్తే విశ్వసించేదెవరు? 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదే. ఇప్పటికిప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు జరిగితే వైఫల్యాల కాంగ్రెస్ సర్కారును సాగనంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధం. నమ్మి మోసం చేసినందుకు మీకు సరైన గుణపాఠం చెప్పడం తథ్యం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

కామారెడ్డి బహిరంగ సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలంగాణ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ పదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. ఆయన్ను ఓడించాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఓటుతో కేసీఆర్‌ను ఇంటికి పంపాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు కాలేదని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. కేసీఆర్‌.. కర్ణాటకకు వచ్చి ఒకసారి చూడండి. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img