icon icon icon
icon icon icon

Priyanka: మణిపుర్‌ వెళ్లలేదు గానీ.. క్రికెట్ మ్యాచ్‌ వీక్షించేందుకు వెళ్లారు: ప్రియాంక విమర్శలు

ప్రధాని నరేంద్ర మోదీ హింసతో అట్టుడికిన మణిపుర్‌ను సందర్శించలేదు గానీ.. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు వెళ్లారని కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు.

Published : 22 Nov 2023 16:47 IST

Rajasthan Assembly Polls| జైపుర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. అధికారం కాపాడుకొనేందుకు కాంగ్రెస్‌, ఈసారి గద్దెనెక్కేందుకు భాజపా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రచారానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షాపురలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. 

మెజీషియన్‌ని కదా.. నా ‘మ్యాజిక్‌’ పనిచేస్తుంది: గహ్లోత్‌

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసింది గానీ.. పేదలను మాత్రం నిర్లక్ష్యం చేశారని ప్రియాంక ఆరోపించారు. హింసాత్మక ఘటనలతో దద్దరిల్లిన మణిపుర్‌ను సందర్శించని ప్రధాని నరేంద్ర మోదీ.. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు మాత్రం వెళ్లారని  ఆక్షేపించారు. భాజపా పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కన్నా.. రాజస్థాన్‌లో యువతకు భారీగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాజస్థాన్‌లో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని రెండు మూడు రోజుల క్రితమే సీఎం అశోక్‌ గహ్లోత్‌ని తాను అడగ్గా.. 2లక్షల మందికి ఇచ్చినట్లు ఆయన చెప్పారని ఈ సందర్భంగా ప్రియాంక వెల్లడించారు. అలాగే, బడ్జెట్‌లో లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించగా.. ప్రస్తుతం 40వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మధ్యప్రదేశ్‌లో మూడున్నరేళ్ల భాజపా పాలనలో కేవలం 21 ఉద్యోగాలు ఇచ్చారని ప్రియాంక ఆరోపించారు. భాజపా ప్రజల సమస్యల్ని ఎన్నడూ వినలేదన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ప్రజల సంతోషంలో, బాధలో, ప్రతి సంక్షోభంలో వారి వెంటే ఉందన్నారు. ఇక్కడి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు సామాన్య కుటుంబాల నుంచి వచ్చారని.. నిజాయతీపరులన్నారు. అలాంటి వాళ్లకు అవకాశం ఇస్తే మరింత మెరుగ్గా పనిచేస్తారన్నారు. నవంబర్‌ 25న రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img