icon icon icon
icon icon icon

Priyanka Gandhi: ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన భారాసకు లేదు: ప్రియాంక గాంధీ

మోసపూరిత వాగ్దానాలతో కేసీఆర్‌ మరోసారి సీఎం అయ్యారని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు.

Published : 27 Nov 2023 17:34 IST

కొడంగల్‌: ఉద్యమకారుల పోరాటం వల్ల తెలంగాణ వచ్చిందని, ఇక్కడి ప్రజల ఆలోచనలు, ప్రాణత్యాగాలను గుర్తించి సోనియా గాంధీ (Sonia gandhi) ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చారని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka gandhi) అన్నారు. మోసపూరిత వాగ్దానాలతో కేసీఆర్‌ (KCR) మరోసారి సీఎం అయ్యారని విమర్శించారు. (Telangana Elections) ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రియాంక మాట్లాడారు. కొడంగల్‌ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని (Revanth reddy) అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. భాజపా, భారాస ఒక్కటేనని, కేంద్రంలో భాజపాకి అవసరమైతే.. భారాస సహకరిస్తోందని విమర్శించారు. (Telangana Elections)

‘‘ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన భారాసకు లేదు. ఆ ప్రభుత్వం వచ్చి పదేళ్లు గడిచింది. ఈ పదేళ్లు కేసీఆర్‌ పనితీరును కాంగ్రెస్‌ గమనిస్తూనే ఉంది. ఆయన ప్రజలను దోచుకుంటున్నారు. ఆయన కుటుంబసభ్యులకు పదవులు దక్కుతున్నాయి. పేదలకు ఒరిగిందేమీ లేదు. ఉద్యోగాలు వస్తాయని సంబరపడిన యువత.. ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నారు. తెలంగాణ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పదేళ్లలో ప్రజా ప్రయోజనకరమైన ప్రాజెక్టు ఒక్కటైనా కట్టారా? పేదలకు, మహిళలకు ఇచ్చేందుకు డబ్బులు లేవని చెప్పిన భారాస ప్రభుత్వం.. ఎన్నికల కోసం రూ.కోట్లకు కోట్లు ఎలా ఖర్చు చేస్తోంది’’ అని ప్రియాంక ప్రశ్నించారు.

మరోవైపు రైతులకు చెందాల్సిన డబ్బు అదానీకి మళ్లుతోందని, దేశ సంపదలైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ తన మిత్రులకు కట్టబెడుతున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు. ‘‘రైతుల అప్పులు మాఫీ చేయడానికి కేంద్రం దగ్గర డబ్బులు ఉండవుగానీ, మోదీ కోసం రెండు విలాసవంతమైన విమానాలు కొనడానికి డబ్బులుంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణాలు చేసే పార్టీగా భాజపా పేరు తెచ్చుకుంది. దొరల తెలంగాణ రోజురోజుకూ బలపడుతోంది. ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కావాలి. మాకు తెలిన ధర్మం ప్రజలకు సేవ చేయడమే. ప్రజలందరూ జాగృతం కావాలి. నాయకులను ప్రశ్నించే హక్కు ప్రజలకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కూడా భవిష్యత్‌ కోసం నాయకులను నిలదీయండి’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img