icon icon icon
icon icon icon

BJP: సింధియాపై ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు అహంకారపూరితం: శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) చేసిన వ్యాఖ్యలు దురహంకారమైనవని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

Published : 17 Nov 2023 02:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మండిపడ్డారు. సింధియాపై చేసిన ఆమె దురహంకారమైన వ్యాఖ్యల్ని మధ్యప్రదేశ్‌తోపాటు యావత్‌ దేశం ఎన్నటికీ మరచిపోదన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీఎం శివరాజ్‌ సింగ్‌ ఈ విధంగా స్పందించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ప్రియాంక గాంధీ.. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియాపై విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్‌ ప్రజల విశ్వాసాన్ని సింధియా వమ్ము చేశారన్న ఆమె.. ఎత్తు తక్కువే అయినప్పటికీ అహంకారంలో మాత్రం తక్కువ కాదన్నట్లుగా ఘాటు విమర్శలు చేశారు. ఆయనను ‘మహారాజా’ అని పిలిస్తేనే పనులు జరుగుతాయని కాంగ్రెస్‌ కార్యకర్తలు తనకు చెప్పేవారన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్యను కాంగ్రెస్‌ ద్రోహిగా అభివర్ణించారు. భాజపా, ఆరెస్సెస్‌లలో కష్టపడిన వారిని పక్కనపెట్టి.. ద్రోహులు, పిరికివాళ్లను ప్రధాని మోదీ తన చుట్టూ చేర్చుకున్నారంటూ దుయ్యబట్టారు.

ఛత్తీస్‌గఢ్‌ పోరు.. విజేతను నిర్ణయించే ‘బిలాస్‌పుర్‌ బెల్ట్‌’!

ఇదిలాఉంటే, మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 17న ఒకేరోజు పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 5.6కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 2.88 కోట్ల మంది పురుషులు, 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 22.36లక్షల మంది యువతీ యువకులు తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో 70 సీట్లకు ఇదే రోజున పోలింగ్‌ జరగనుంది. ఈ దశలో మొత్తం 1.63కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img