icon icon icon
icon icon icon

Revanth Reddy: కాంగ్రెస్‌ వస్తే ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటా: రేవంత్‌

త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు.

Updated : 15 Nov 2023 16:10 IST

బోథ్‌: త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్‌ పరామర్శించలేదని రేవంత్‌ ఆరోపించారు. 

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. ‘‘కాంగ్రెస్‌ హయాంలో గ్యాస్‌ సిలిండర్ ధర రూ.400 ఉండేది. మోదీ, కేసీఆర్‌ కలిసి ప్రస్తుతం ఆ ధరను రూ.1200 చేశారు. కేసీఆర్‌ వల్ల బోథ్‌కు నీళ్లు రాలేదు. ఈ నియోజకవర్గంలో ఒక్కసారి కాంగ్రెస్‌కు ఓటు వేయండి. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే బోథ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే బాధ్యతతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాను నేను దత్తత తీసుకుంటా. డిసెంబర్ 31లోపు బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేసే బాధ్యత నాది. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం’’అని రేవంత్‌రెడ్డి అన్నారు.

నిర్మల్‌ అభివృద్ధిని విస్మరించారు..

‘‘పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మల్‌లోనే పెరిగిన ధరలపై పోరాటం చేశా. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొడంగల్‌ను ఎలా అభివృద్ధి చేస్తానో అదే స్థాయిలో నిర్మల్‌ను అభివృద్ధి చేస్తా. కాంగ్రెస్‌.. దళితులు, గిరిజనులు, ఆదివాసీల పార్టీ. అందుకే ఇంద్రవెల్లి గడ్డపై దళిత గిరిజన దండోరా కార్యక్రమం నిర్వహించాం. గతంలో కాంగ్రెస్‌ హయాంలో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి ఈ ప్రాంతంలో 1.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రయత్నం చేశాం. దాదాపు రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టాం. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక తుమ్మిడిహట్టిని మార్చి కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టారు. రూ.38.50 వేల కోట్లతో కట్టాల్సిన ప్రాజెక్టును అంచనాలు పెంచి రూ.1.51 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. ఇవాళ ఆ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. అన్నారం పగిలిపోయింది. ఆదిలాబాద్‌కు చుక్క నీరు రాలేదు. ఐదేళ్లు కేసీఆర్‌, ఐదేళ్లు హరీశ్‌రావు నీటిపారుదలశాఖ మంత్రులుగా ఉన్నా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు.

భూములను లాక్కొనేందుకే ఇక్కడ మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేయాలని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది పేదలకు కాంగ్రెస్‌ ఇళ్లు కట్టించింది. డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తానని కేసీఆర్‌ చెప్పి ఆ హామీని నెరవేర్చలేదు. ఆ శాఖ బాధ్యతలు చేస్తున్న నిర్మల్‌ ఎమ్మెల్యే, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఎందుకు ఓటెయ్యాలి? ఇందిరమ్మ ఇళ్లున్న ప్రాంతంలో కాంగ్రెస్‌ ఓటు అడుగుతుంది. అందుకే కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీహరిరావుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img