icon icon icon
icon icon icon

Telangana Elections: ప్రచారం పరిసమాప్తం.. పోలింగ్‌పైనే రాజకీయ పార్టీల గురి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. మంగళవారం సాయంత్రం 5గంటలకు మైకులు మూగబోయాయి.

Updated : 28 Nov 2023 17:43 IST

ఇంటర్నెట్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana elections) తుది అంకానికి చేరాయి. మంగళవారం సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులన్నీ మూగబోయాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి. గత కొన్ని రోజులుగా భాజపా (BJP), కాంగ్రెస్‌ (Congress) అగ్రనేతలంతా తెలంగాణలోనే మకాం వేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలనే పట్టుదలతో భారాస (BRS), కర్ణాటక ఎన్నికల్లో గెలిచి.. మాంఛి జోష్‌ మీదున్న కాంగ్రెస్‌ తెలంగాణలో కూడా ఎలాగైనా అధికారం హస్త గతం చేసుకోవాలని ఆరు గ్యారంటీలతో ప్రచారం నిర్వహించింది. మరో వైపు అధికారమే లక్ష్యంగా .. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో భాజపా అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు.

96 సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాక ముందు నుంచే  భారాస ప్రచారంలో దూకుడుగా వ్యవహరించింది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ (KCR), మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. సీఎం కేసీఆర్‌ అక్టోబరు 15న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం అదే రోజు హుస్నాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. రోజుకు రెండు, మూడు, నాలుగు చోట్ల జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్‌.. మొత్తం 96 బహిరంగ సభల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈనెల 25న జీహెచ్‌ఎంసీ ప్రాంతానికి సంబంధించి పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగాల్సిన సభ జరగలేదు. హైదరాబాద్ జిల్లాకు చెందిన 15 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏడు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు జరగలేదు. మంత్రి కేటీఆర్‌ 60 రోజులు ప్రచారంలో పాల్గొన్నారు. 30 పబ్లిక్‌ మీటింగ్‌లు, 70 రోడ్‌ షోలు, 30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు, 150కి పైగా టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించి. పార్టీ క్యాడర్‌లో జోష్‌ నింపారు. ఎన్నిల ప్రచారం ముగింపు రోజు సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ సభలో పాల్గొన్నారు.

నియోజకవర్గాల వారీగా బరిలో ఉన్న అభ్యర్థులు వీరే!

రాహుల్‌ గాంధీ 23 సభలు.. ప్రియాంక గాంధీ 26 సభలు

అధికారంలోకి వస్తే వంద రోజల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించింది. ఆ పార్టీ నేతలు కూడా ప్రచారంలో మరింత దూకుడుగా వ్యహరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో మొత్తం 10 సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ 23 సభల్లో, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 26 సభల్లో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 55 సభల్లో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 3 సభల్లో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ 10 సభల్లో, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భఘేల్‌ 4 సభల్లో పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారం చివరి రోజు మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షోలో.. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా రాష్ట్ర ప్రజలకు సందేశం పంపించారు. ‘‘దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకుందాం. తెలంగాణ ప్రజల స్వప్నాలు సాకారం కావాలి. ఈ సారి మీరంతా సర్వశక్తులు ఒడ్డి మార్పు తీసుకురావడానికి కృషి చేయండి. మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి ’’ అని పిలుపునిచ్చారు. 

ప్రధాని మోదీ.. 5 రోజులు, ఎనిమిది సభలు, ఒక రోడ్‌ షో

గులాబీతోటలో కమల వికాసమే లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన వెంటనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జాతీయ నాయకత్వాన్ని ప్రచారంలోకి దింపింది. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అగ్రనాయకత్వం తెలంగాణపై దృష్టి కేంద్రీకరించి వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అనురాగ్ సింగ్ ఠాకూర్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ శిందే, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందే కాషాయ పార్టీ పాలమూరు నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా దేశ ప్రధాని మోదీ హాజరై పలు కీలక హామీలు ఇవ్వడంతో పాటు భారాస సర్కారు పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మొత్తం ఐదు రోజులు.. 8 సభలు, ఒక రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభ, పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభ, కామారెడ్డి, మహేశ్వరం, తూప్రాన్‌, నిర్మల్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌లో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభ, హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ నుంచి కాచిగూడ వీర్‌సావర్కర్‌ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్‌షోలో మోదీ పాల్గొని పార్టీ క్యాడర్‌లో జోష్‌ నింపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణలో 8 ఎనిమిది రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని 17 సభలు, 7 రోడ్‌ షోలలో ప్రసంగించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయిదు రోజులు, 8 సభలు, 3 రోడ్‌ షోలలో పాల్గొన్నారు. ప్రచారంలో అన్ని పార్టీల అగ్రనేతలు పోటీ పడి పాల్గొన్నా..ఓటరు దేవుళ్ళు ఎవరిని కరుణిస్తారో డిసెంబరు 3వరకు వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img