icon icon icon
icon icon icon

Hemang Joshi: నాకు చెప్పకుండానే ఎంపీ టికెట్‌.. ఒకప్పటి మోదీ స్థానంలో మన్‌కీబాత్‌ కుర్రాడు..!

ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్‌లో ఓ యువ కళాకారుడి పేరు ప్రస్తావించారు. తాజాగా ఆ కుర్రాడికే ఒకప్పుడు తాను పోటీ చేసిన వడోదర టికెట్‌ ఇచ్చారు. 

Updated : 02 May 2024 15:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్నేళ్ల క్రితం ఓ కుర్రాడు తన సంగీతం, రచనలతో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు. ఇటీవల అతడు తన భార్యతో కలిసి హోలీ కార్యక్రమంలో ఉండగా  అతడికి ఎంపీ టికెట్‌ ఖాయమైనట్లు తెలిసింది. హఠాత్తుగా శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో ఏమిటా అని చూడగా.. తనకు ఎంపీ టికెట్‌ వచ్చినట్లు తెలిసి ఆశ్చర్యపోయాడు. అతడి పేరే హేమంగ్‌ జోషీ. ఈసారి గుజరాత్‌లోనే అత్యంత పిన్న వయసులో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థిగా ఘనత సాధించాడు. 

హేమంగ్‌ గుజరాత్‌లో సానెడో అనే ఓ రకమైన జానపద డ్రామాలు రాసేవాడు. అతడు బరోడాలోని ఎం.ఎస్‌. విశ్వవిద్యాలయంలో సోషల్‌వర్క్‌ కోర్సు చేస్తున్న సమయంలో చాలా చురుగ్గా ఉండేవాడు. పరిశుభ్రతే ఇతివృత్తంగా సాగిన అతడి సృజనాత్మక ప్రయత్నాలు వేగంగా గుర్తింపుపొందాయి. ఈక్రమంలో నాటి గుజరాత్‌ సీఎం ఆనందీబెన్‌ పటేల్‌ స్వయంగా ఓ ఎండార్స్‌మెంట్‌ ఇచ్చారు. దీనిలో హేమంగ్‌తో కలిసి గాయని భూమి త్రివేది పనిచేశారు. సానెడోకు ఆదరణ క్రమంగా పెరిగింది. 2016 జులైలో జరిగిన ‘మన్‌కీ బాత్‌’లో ప్రధాని మోదీ అతడి విషయాన్ని ప్రస్తావించారు. పీఎం ఓ గుజరాత్‌ విద్యార్థి కార్యక్రమాన్ని తన ప్రసంగంలో తీసుకురావడం ఇదే తొలిసారి. హేమంగ్‌ను అభినందిస్తూ ఓ లేఖ కూడా రాశారు.

హోలీ వేడుకల్లో ఉండగానే..

కళాకారుడిగానే కాదు.. విద్యార్థిగా కూడా హేమంగ్‌ రాణించాడు. ఫిజియోథెరపీలో డిగ్రీ, మానవ వనరుల విభాగంలో పీజీ పట్టాలను అందుకొన్నారు. ఆ తర్వాత ఐఐఎంలో లీడర్‌షిప్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌పై కోర్సు చేశాడు. ప్రస్తుతం ఎంఎస్‌యూలో పీహెచ్‌డీ చేస్తున్నారు. 

హేమంగ్‌ ఎంఎస్‌ విశ్వవిద్యాలయంలో 2015లో ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌వర్క్‌ విభాగానికి జనరల్‌ సెక్రటరీగా పని చేశారు. ఆ తర్వాత 2021లో స్కూల్‌ బోర్డ్‌ ఆఫ్‌ వడోదర మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌గా పార్టీ నియమించింది. ఈ ఏడాది హోలీ వేడుకల్లో ఉండగా అతడి ఫోన్‌కు అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. సిటింగ్‌ ఎంపీ రంజన్‌భట్‌ను కాదని వడోదర టికెట్‌ను భాజపా అతడికి కేటాయించింది. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన స్థానం అది. 10 లక్షల మెజార్టీతో విజయం సాధించడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు హేమంగ్‌ చెబుతున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img