Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 03 Jun 2024 20:59 IST

1. బెంగళూరులో కుండపోత.. 133 ఏళ్ల రికార్డు బ్రేక్‌!

నీటి ఎద్దడితో అల్లాడిన కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) నగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. నగరంలో ఆదివారం ఒక్కరోజే దాదాపు 111 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌ నెలకు సంబంధించి ఒక్కరోజులోనే ఈ స్థాయి వర్షం కురవడం 133 ఏళ్లలో ఇదే తొలిసారని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. పూర్తి కథనం

2. తెలంగాణలో లెక్కింపునకు సర్వం సిద్ధం.. కౌంటింగ్‌లో 10 వేల మంది సిబ్బంది

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, భాజపా, భారాస అభ్యర్థులు సహా 525 మంది పోటీలో ఉన్నారు. పూర్తి కథనం

3. నా చిరునవ్వుకు కారణం వారే: రూమర్లపై నవదీప్‌

తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ నవదీప్ (Navdeep) నటించిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli). ఈ సినిమాతో ‘నవదీప్‌ 2.O’గా పరిచయం కాబోతున్నారాయన. ఈనెల 7న మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌తో నవదీప్‌ బిజీగా ఉన్నారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. తనపై వచ్చే రూమర్స్‌పై స్పందించారు.  పూర్తి కథనం

4. వాటర్‌ట్యాంక్‌లో మృతదేహం.. ఆందోళనలో నల్గొండ ప్రజలు

నల్గొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌లో ఓ మృతదేహం లభ్యం కావడంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గత పది రోజులుగా అవే నీళ్లు తాగుతుండటంతో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తాగునీరు తేడాగా అనిపించడంతో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి స్థానికులు వాటర్‌ ట్యాంక్‌ను పరిశీలించగా అందులో వ్యక్తి మృతదేహం కనిపించింది. పూర్తి కథనం

5. తోటి ఆటగాడిని హేళన చేసి.. చిక్కుల్లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజాం

పొట్టి ప్రపంచకప్‌ టోర్నీకి ముందు పాకిస్థాన్‌ జట్టులో విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా.. తాజాగా ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తోటి ఆటగాడిని హేళన చేస్తూ మాట్లాడిన వీడియో ఒకటి వైరలవుతోంది. పూర్తి కథనం

6. పెరిగిన ఇన్ఫీ సీఈఓ వేతనం.. గతేడాది కంటే ₹10 కోట్లు అదనం

ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సలీల్‌ పరేఖ్‌ వార్షిక వేతనం (Infosys CEO salary) పెరిగింది. 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.66.2 కోట్లు వేతనంగా అందుకున్నట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.56.4 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 17.3 శాతం పెరగడం గమనార్హం. పూర్తి కథనం

7. తాజ్‌ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు.. ప్రయాణికులంతా సేఫ్‌!

తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ఆగ్నేయ దిల్లీలోని సరితా విహార్‌ వద్ద మూడు రైలు బోగీల్లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు హుటాహుటిన బయటకు వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితమేనని తెలిపారు.  పూర్తి కథనం

8. జైల్లో కేజ్రీవాల్‌కు వేధింపులు.. ఆప్‌ తీవ్ర ఆరోపణలు

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను కేంద్రంలోని భాజపా లక్ష్యంగా చేసుకొందని ఆప్‌ నేత, దిల్లీ మంత్రి అతిశీ (Atishi) ఆరోపించారు. జైల్లో ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణించేందుకు మోదీ సర్కారే కారణమని ఆరోపించారు. పూర్తి కథనం

9. సాక్ష్యాలు సమర్పించండి.. లేదంటే..: జైరాం రమేష్‌కు ఈసీ హెచ్చరిక

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah)పై చేసిన ఆరోపణలకు తగిన సాక్ష్యాలను చూపేందుకు మరికొన్ని రోజుల గడువు కావాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) చేసిన విజ్ఞప్తిని ఎన్నికల సంఘం (EC) తిరస్కరించింది. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను చూపించి తీరాలని స్పష్టం చేసింది. పూర్తి కథనం

10. హార్దిక్‌ చాలా స్ట్రాంగ్‌.. గడ్డు పరిస్థితిని తట్టుకోగలిగాడు: మాజీ క్రికెటర్

టీ20 ప్రపంచకప్‌లో అందరి దృష్టి హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) మీదనే. ఐపీఎల్‌లో అత్యంత వివాదాస్పదమై జాతీయజట్టులోకి వచ్చాడు. కెప్టెన్సీ వివాదం, ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకోలేకపోవడంతో విమర్శలు, విడాకులు తీసుకున్నాడనే రూమర్లతో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు వైస్‌ కెప్టెన్‌గా పాండ్య వరల్డ్‌ కప్ కోసం అమెరికాలో అడుగుపెట్టాడు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని