Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 22 May 2024 13:01 IST

1. కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయి: గంటా శ్రీనివాసరావు

కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన తెదేపా నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్‌ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. పూర్తి కథనం

2. ప్రమాదానికి ముందు.. బార్‌లో 90 నిమిషాల్లో 48వేలు ఖర్చు చేసి..!

మహారాష్ట్ర (Maharashtra News)లోని పుణె (Pune)లో టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసు (Pune car Crash)లో నిందితుడైన టీనేజర్‌ గురించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్‌ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.పూర్తి కథనం

3. మహిళపై దుర్భాషలాడిన పిన్నెల్లి.. ఆలస్యంగా వెలుగులోకి..

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టి వీధిరౌడీలా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలింగ్‌ కేంద్రం వద్ద ఎమ్మెల్యేను ఓ మహిళ నిలదీశారు. ఈ క్రమంలో పిన్నెల్లి ఆమెపై దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పూర్తి కథనం

4. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్‌ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.పూర్తి కథనం

5. అదృశ్యమైన బంగ్లాదేశ్ ఎంపీ మృతదేహం కోల్‌కతాలో గుర్తింపు.. హత్యగా అనుమానాలు!

వైద్యచికిత్స నిమిత్తం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ (Anwarul Azim Anar) కొద్దిరోజుల క్రితం అదృశ్యమయ్యారు. అయితే ఆయన మృతి చెందినట్లు బుధవారం వ్యక్తిగత కార్యదర్శి అబ్దుర్ రవూఫ్‌ వెల్లడించారు. కోల్‌కతాలోని న్యూటౌన్‌లోని ఖాళీ ఇంట్లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.పూర్తి కథనం

6. పదేళ్లు లేని కరెంట్ కోతలను మళ్లీ చూస్తున్నాం: కేటీఆర్‌

6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమయ్యాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. పదేళ్లు లేని కరెంట్ కోతలను మళ్లీ చూస్తున్నామన్నారు. విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడి చూస్తున్నట్లు తెలిపారు. మోటార్లు కాలుతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతున్నాయని ఎద్దేవా చేశారు.పూర్తి కథనం

7. ఈవీఎంల ధ్వంసం.. ఇతరులెవరూ సాహసించని రీతిలో చర్యలు ఉండాలి: ఈసీకి నిమ్మగడ్డ ఫిర్యాదు

మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ‘ఎలక్షన్‌ వాచ్‌’ కన్వీనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఫిర్యాదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియో దృశ్యాలను ఈసీకి అందించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.పూర్తి కథనం

8. సొంత కూటమి అభ్యర్థిపైనే పోటీ.. ఆ నటుడిపై భాజపా వేటు

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్‌ సింగ్‌ (Pawan Singh) వ్యవహారం భాజపా (BJP)కు తలనొప్పిగా మారింది. సొంత పార్టీ అభ్యర్థిపైనే అతడు స్వతంత్రుడిగా పోటీకి నిలబడ్డారు. నామినేషన్‌ వెనక్కి తీసుకోవాలని పార్టీ ఆదేశించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో అతడిపై భాజపా క్రమశిక్షణా చర్యలు తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించింది.పూర్తి కథనం

9. ఇప్పుడు ఇంటిపేరు మ్యాటర్ కానేకాదు: జొమాటో సీఈఓ వీడియోపై మోదీ పోస్టు

నేటి భారతంలో ఇంటిపేరుతో పట్టింపు లేదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో జొమాటో ప్రారంభ రోజుల నాటి అనుభవాలను ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్‌ (Deepinder Goyal) వివరించారు. ప్రభుత్వ సహకారంతో చిన్న పట్టణానికి చెందిన కుర్రాడు కూడా జొమాటో వంటి సంస్థను స్థాపించడం సాధ్యమవుతుందని తాను నిరూపించినట్లు చెప్పారు.పూర్తి కథనం

10. రూ.550 కోట్లకు పెరిగిన పేటీఎం నష్టం

పేటీఎం బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక సేవల సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ నష్టం (Paytm Loss) మరింత పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నష్టాలు రూ.550 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే మూడు నెలల వ్యవధిలో రూ.167.5 కోట్ల నష్టాన్ని నివేదించింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు