Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 25 May 2024 13:02 IST

1. హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదు?: జీవీ ఆంజనేయులు

కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. పోలీసునే చంపబోయిన వ్యక్తి ముందు ఎందుకు సాగిలబడుతున్నారని నిలదీశారు. పిన్నెల్లికి హైకోర్టు రక్షణ కల్పించింది ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమేనని తెలిపారు. పూర్తి కథనం

2. ఓటేసిన రాష్ట్రపతి.. జైశంకర్‌ది ‘తొలి ఓటు’.. ఆరో విడతలో ప్రముఖుల ఓటింగ్‌

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ (LS Polls 6th Phase Polling) శనివారం కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. తొలి గంటల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.పూర్తి కథనం

3. అనంతపురం జిల్లాలో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బూదగవి చెరువు అలుగు పారుతోంది. విడపనకల్లు మండలంలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలాయి. దీంతో 19 గ్రామాలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.పూర్తి కథనం

4. గన్‌పౌడర్‌ పరిశ్రమలో పేలుడు.. 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెమెతరా జిల్లాలో గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమ (Gun Powder manufacturing factory)లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. రోజూ మాదిరిగానే ఈ ఉదయం పరిశ్రమకు వచ్చిన కూలీలు తయారీ పనులు మొదలుపెట్టిన కాసేపటికే ఈ ప్రమాదం (Blast) చోటుచేసుకుంది. పూర్తి కథనం

5. మన దేశ చరిత్రలో ఇది అసామాన్య విజయగాథ : కేటీఆర్‌

నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో రెండు యూనిట్ల బాయిలర్ లైట్‌ గురించి పంచుకోవడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్ ముందు చూపునకు యాదాద్రి థర్మల్‌ పవర్ స్టేషన్‌ అద్భుతమైన ఉదాహరణ అని ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు.పూర్తి కథనం

6. పదేళ్లలో భారాస ఉద్యోగాలు కల్పించలేకపోయింది: ఈటల రాజేందర్‌

పదేళ్లలో భారాస ఉద్యోగాలు కల్పించలేకపోయిందని భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని భారాస ఇప్పుడెలా చేస్తుందని ప్రశ్నించారు. పూర్తి కథనం

7. సన్‌రైజర్స్ బ్యాటింగే కాదు.. బౌలింగ్‌కూ పదునెక్కువే: గౌతమ్ గంభీర్

ఐపీఎల్ 17వ సీజన్‌ ఫైనల్‌లో కోల్‌కతా - హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచిన సంగతి తెలిసిందే. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ తుది పోరుకు దూసుకొచ్చింది. అన్ని విభాగాల్లో ఆర్‌ఆర్‌ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది.పూర్తి కథనం

8. సింగరాయకొండలో తెదేపా నాయకుడి కారుకు నిప్పు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంట పాలెంలో తెదేపా నాయకుడి కారును గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. చిగురుపాటి శేషగిరి తన ఇంటి వద్ద పార్క్ చేసిన కారును శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టాడ్డు.పూర్తి కథనం

9. మూడో ఆసీస్‌ ప్లేయర్‌గా కమిన్స్.. షాబాజ్‌ ‘ఇంపాక్ట్‌’ నిర్ణయం వెటోరిదే!

ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టును (డెక్కన్‌ ఛార్జర్స్‌ను కలిపి) విదేశీ కెప్టెన్లే నాలుగు సార్లు ఫైనల్‌కు చేర్చారు. అందులో ముగ్గురు ఆస్ట్రేలియాకు చెందిన వారే కావడం విశేషం. 2009లో ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, 2016లో డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు. తాజాగా ఆసీస్ ప్లేయర్ పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ ఫైనల్‌లో కోల్‌కతాతో తలపడనుంది.పూర్తి కథనం

10. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం.. దర్శనానికి 3 గంటల సమయం

వేసవి సెలవులు ముగుస్తుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు నిరీక్షిస్తున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని