Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 19 Apr 2024 20:59 IST

1.రాష్ట్రాన్ని జగన్‌ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు

ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏబీసీడీ వర్గీకరణ తెచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని జగన్‌..రూ.13లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చి, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. 20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!

సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) తొలి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 102 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరిగింది. బెంగాల్‌, మణిపుర్‌లలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. అయితే, నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం 6 జిల్లాల్లో ‘సున్నా శాతం’ పోలింగ్‌ నమోదుకావడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దీంతో ఎన్నికల సిబ్బంది తొమ్మిది గంటలపాటు నిరీక్షించి వెళ్లిపోయారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. సుప్రీం లీడర్‌ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!

 పశ్చిమాసియాలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌ (Iran)లో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన పేలుళ్లకు ఇజ్రాయెల్‌ (Israel) ప్రతీకార దాడులే కారణమని అమెరికా చెబుతోంది. ఈ దాడి గురించి టెల్‌అవీవ్‌ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని జీ7 దేశాలతో అమెరికా (USA) చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. ఈ ఘటనలో తమ పాత్రేమీ లేదని అగ్రరాజ్యం స్పష్టం చేసిందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు

ఏప్రిల్‌ 16న భీమవరంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సీఎం వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. ‘‘మోడల్‌ కోడ్‌కు విరుద్ధంగా పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితం గురించి జగన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా రోడ్‌ షోలో ప్రసంగించారు. సానుభూతితో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని జనసేన ప్రధాన కార్యదర్శి టి.శివశంకరరావు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. రష్యన్‌ బాంబర్‌ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్‌

భారీస్థాయి దాడులతో ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) కొంతకాలంగా దూకుడు పెంచింది. మరోవైపు ఆయుధాల కొరతతో కీవ్‌ సతమతమవుతోంది. ఈ పరిణామాల నడుమ ఉక్రెయిన్‌ కీలక ప్రకటన చేసింది. సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి శత్రుదేశానికి చెందిన ఓ దీర్ఘశ్రేణి వ్యూహాత్మక బాంబర్‌ను కూల్చివేసినట్లు వెల్లడించిందని ఓ వార్తా సంస్థ తెలిపింది. పుతిన్‌ ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్‌రెడ్డి

ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని, రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం చాలా అవసరమన్నారు. శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌ ప్రసంగించారు. విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి ప్రకటించిన హామీలను భాజపా సర్కారు నెరవేర్చలేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె

 పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ కుమార్తె, అక్కడి పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ (Maryam Nawaz) వేదాలు వల్లించారు. పొరుగున ఉన్నవారితో ఘర్షణ పడొద్దని, స్నేహ హస్తం చాచాలని, హృదయం తలుపులు తెరవాలంటూ శాంతి వచనాలు పలికారు. ఇవి తన తండ్రి మాటలని ఆమె వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.  ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్‌ నమోదు

సార్వత్రిక ఎన్నికల (Lok sabha Elections) సమరంలో తొలి విడత పోలింగ్‌ (First Phase Voting) శుక్రవారం ముగిసింది. పలుచోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5గంటల వరకు 59.7% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఓపెన్‌ ఏఐకి భారత్‌లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?

చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) భారత్‌లో తన తొలి నియామకాన్ని చేపట్టింది. దేశంలో తన కార్యకలాపాలను విస్తృతం చేయాలనుకుంటున్న నేపథ్యంలో ప్రగ్యా మిశ్రాను ప్రభుత్వ సంబంధాల విభాగం అధిపతిగా నియమించింది. గతంలో ట్రూకాలర్‌లో ప్రభుత్వ సంబంధాల విభాగం అధిపతిగా మిశ్రా విధులు నిర్వర్తించారు. అంతకుముందు వాట్సప్‌లోనూ ఆమె పని చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. హైదరాబాద్‌ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

 నగర శివారులో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై నాలుగు చోట్ల చెట్లు కూలాయి. మహేశ్వరం మండలం తుమ్మలూరు- కందుకూరు రహదారిపై నాలుగు కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పడిన చెట్ల కొమ్మలను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని